కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్
రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తాం. రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తా. – కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్
కేసరపల్లి(గన్నవరం)/సాక్షి, అమరావతి: వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం మండలంలోని కేసరపల్లి–సావరగూడెం రోడ్డులో ముంపునకు గురైన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును కేంద్ర మంత్రికి విన్నవించుకున్నారు.
వారం రోజులుగా నీట మునిగిపోవడం వల్ల వరిపైరు కుళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిన ఉంటుందని జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన పసుపు, పత్తి, అరటి, మినుము రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చౌహన్ మాట్లాడుతూ రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తామని చెప్పారు.
రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తానని చెప్పారు. పసల్ బీమా యోజన కింద రైతులకు ఆదుకుంటామని పేర్కొన్నారు. ఎంపీలు, మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ రంగాన్ని ఆదుకోండి
సంక్షోభంలో ఉన్న ఆయిల్ పామ్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ జాతీయ ఆయిల్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీఎస్ఆర్ ప్రసాద్, కే.క్రాంతి కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులపై తక్షణమే దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, డైనమిక్ డ్యూటీ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment