ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(SDMA), రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF)ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చిన రాజప్ప వెల్లడించారు.
విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఏర్పాటుకు ప్రపంచ బ్యాంక్ తొలి విడతగా రూ.23.58 కోట్ల సాయం అందిస్తుందన్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనేందుకు 600 మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అందించిన సాయంతో మిషనరీ, వాహనాలు, శిక్షణ, టెక్నాలజీ అంశాల ఏర్పాటు కోసం ఖర్చు చేస్తామన్నారు. వీటి కోసం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని చిన రాజప్ప తెలిపారు.