♦ నెల ముందుగానే తొలివిడత నిధులు విడుదల చేసిన కేంద్రం
♦ ఇన్‌పుట్ సబ్సిడీకి ఖర్చు చేయాలని రాష్ట్ర నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్)కి కేంద్రం రూ.108 కోట్లు కేటాయించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖకు సమాచారం అందింది. 2016-17కి కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు రూ.288 కోట్లు కేటాయిం చిన సంగతి తెలిసిందే. అందులో రాష్ట్ర వాటా పోను కేంద్రం రూ.216 కోట్లు ఇవ్వాలి. ప్రస్తుతం అందులో నుంచి తొలి విడత సాయం కింద రూ. 108 కోట్లు కేటాయించింది. వాస్తవంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను ప్రతీ ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో 2 విడతలుగా విడుదల చేస్తారు.
అయితే తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నందున ముందస్తుగానే సాయం చేయాలని రాష్ట్రం కోరిన మేరకు కేంద్రం ఈ నెలలోనే నిధులు విడుదల చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండో విడత సొమ్మును కేంద్రం డిసెంబర్‌లో విడుదల చేయనుంది. కరువు ఉన్నందున ఈ నిధులను రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం ఢిల్లీ వెళ్లి మరింత కరువు సాయం చేయాలని కోరిన సంగతి తెలిసిందే.
మొత్తంగా రూ.1,515 కోట్లు
2015-2020 సంవత్సరాల కోసం 14వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ శాఖకు రూ.1,515 కోట్లు కేటాయించింది. అందు లో భాగంగా 2016-17కు రూ. 288 కోట్లు కేటాయించింది. 12 రకాల విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలకు ఈ సాయాన్ని ప్రతీ ఏడాది కేటాయిస్తుంది. విపత్తుల తీవ్రతను బట్టి కేటాయించిన సొమ్ము చాలకపోతే రాష్ట్రాల విన్నపం మేరకు కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుంది.