సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థాగత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర విపత్తుల నిర్వహణ బలగాల (ఎస్‌డీఆర్‌ఎఫ్) ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటుచేసే ఈ ప్రధాన కేంద్రంలోనే శిక్షణా కేంద్రాన్ని కూడా నెలకొల్పనుంది.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 50 ఎకరాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రధాన కేంద్రం, శిక్షణ కేంద్రం నిర్మాణానికి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (రివైజ్డ్ డీపీఆర్)ను ఖరారు చేసింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
రూ.99.73 కోట్లతో ప్రధాన కేంద్రం
దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన సముద్రతీరం (దాదాపు 972 కి.మీ) ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. దీంతో ఏటా తుపాన్లు, వరదల ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోంది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను యుద్ధప్రాతిపదికన ఆదుకునేందుకు.. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండే వ్యవస్థను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం)లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రధాన కేంద్రాలను కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటుచేయనున్నారు.
ఇందుకోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు 50 ఎకరాలు, ఎన్‌ఐడీఎంకు 10 ఎకరాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేటాయించిన 50 ఎకరాల్లో ప్రధాన కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతారు. ఈ మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రణాళికకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
ప్రధాన కేంద్రంలో 154 మంది..
ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రధాన కేంద్రంలో 154 మంది అధికారులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వీరిలో పర్యవేక్షణ స్థాయి ఉన్నతాధికారులు నలుగురు ఉంటారు. అలాగే, రెండు రెస్క్యూ టీమ్‌లలో అత్యవసర సేవలు అందించే అధికారులు, సిబ్బంది 94 మంది ఉండనున్నారు.
అదేవిధంగా క్వార్టర్ మాస్టర్ గ్రూప్ సభ్యులు 15 మంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది 8 మంది, రవాణా విభాగం అధికారులు, సిబ్బంది 15 మంది, ప్రధాన కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు ఇద్దరు, ఫార్మసిస్టులు నలుగురు, మినిస్టీరియల్ సిబ్బంది 12 మంది ఉంటారు.
ఆధునిక మౌలిక వసతులతో..
తుపాన్లు, వరదలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు సమర్థంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆధునిక మౌలిక వసతులను ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.65 కోట్లతో ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రధాన కేంద్రంలో 309 అధునాతన పరికరాలను రూ.21.74 కోట్లతో కొనుగోలు చేయనున్నారు.
అలాగే, రూ.39 కోట్ల వ్యయంతో వాహనాలను కూడా కొంటారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం రూ.77 లక్షలతో కంప్యూటర్లు, జీపీఎస్ ట్రాకర్లు, ఇతర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారాన్ని అనుసంధానించేందుకు అధునాతన సాంకేతిక, సమాచార పరికరాలను రూ.1.50 కోట్లతో కొంటారు. అదేవిధంగా శిక్షణ కేంద్రంలో 10 రకాల శిక్షణ అందించేందుకు రూ.2 కోట్లతో పరికరాలను కొనుగోలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment