తెలుగు రాష్ట్రాలకు వెంటనే విడుదల చేసేలా చర్యలు
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడి
పూర్తిస్థాయిలో సాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద రూ.3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడి రైతులను, ప్రజలను కలిసి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం.. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతో చర్చించిన తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటలు దెబ్బతిన్న మీనవాలు, పెద్దగోపవరం, మన్నూరు, కట్టలేరు పరిశీలించడంతో పాటు ఖమ్మంలో మున్నేరు వరదను ఏరియల్ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ అందర్నీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు.
నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారంపై నిర్ణయం
వరదల వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని చౌహాన్ చెప్పారు. వరదల్లో అరటి, పసుపు, కూరగాయ ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతులు పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కలి్పంచడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం.. కేంద్ర ప్రభుత్వ నాలుగు ప్రాథమ్యాలని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment