‘ప్రాణహిత’ డిజైన్ మార్చుతాం: మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చేందుకు యోచిస్తున్నట్టు శాసనసభ వ్యవహారాల, నీటిపారుదల శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రిజర్వాయర్లు, కాల్వల ప్రతిపాదనలు సమగ్రంగా లేవని కేంద్ర జలవనరుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఆయన తెలిపారు.
శనివారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సరికొత్త చట్టం రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరువును ఎదుర్కొనేందుకు రూ.వెయ్యికోట్లతోచెరువుల పూడికతీత చేపట్టనున్నట్టు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయని హరీశ్‌రావు వెల్లడించారు.