పాత డిజైనే ప్రాణ‘హితం’! | Reference to the state government, a group of retired engineers | Sakshi
Sakshi News home page

పాత డిజైనే ప్రాణ‘హితం’!

Published Fri, Apr 10 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

పాత డిజైనే ప్రాణ‘హితం’!

పాత డిజైనే ప్రాణ‘హితం’!

రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచన
{పాజెక్టుపై రూపొందించిన నివేదికలో వెల్లడి
మహారాష్ట్ర కోరినట్లు మీటర్ ఎత్తు తగ్గించి
తుమ్మిడిహెట్టి నుంచే నీటి మళ్లింపు చేయాలని సూచన
20-30 టీఎంసీలు తగ్గితే.. వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి వాడుకోవచ్చని ప్రతిపాదన
ఇలాచేస్తేనే ఇప్పటిదాకా జరిగిన పనులు వృథా కావని హితవు

 
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పాత డిజైనే శ్రేయస్కరమని గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తేల్చింది. కావాలంటే మహారాష్ట్ర కోరుతున్నట్లుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ఒక మీటరు మేర తగ్గించి.. నీటిని మళ్లించుకోవడమే మేలని స్పష్టం చేసింది. ఎత్తు తగ్గింపుతో నిర్ణీత స్థాయిలో నీటిని తీసుకోలేకపోతే... మిగ తా నీటిని ప్రాణహితకు దిగువన ఉన్న వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి మళ్లించుకోవచ్చని సూచించింది. ఇలాచేస్తే ఇప్పటివరకు జరిగిన దాదాపు రూ. 4 వేల కోట్ల విలువైన పనులు వృథా కావని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తమ నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం.
 
ఘనమైన ప్రాజెక్టు..

 గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి.. సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పథకం పొడవునా గ్రామాలకు, రాజధానికి తాగునీరు అందించడం కోసం రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రాణహిత-చేవెళ్ల’ భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి, మిడ్‌మానేరుకు నీటిని మళ్లించి, ఆ తర్వాత హైదరాబాద్ మీదుగా చేవెళ్ల వరకూ నీటిని తరలించనున్నారు. అయితే తుమ్మిడిహెట్టి బ్యారేజీతో తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా ఉంటుందని, ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర కోరడంతో... ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నుంచి కాకుండా.. 110 కిలోమీటర్ల దిగువన ఉన్న కాళేశ్వరం సమీపంలోని మేటిగడ్డ వద్ద నీటిని మళ్లించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ డిజైన్ మార్పుపై అధ్యయనం చేసే పనిని వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. ఇక మరోవైపు గోదావరిలో లభ్యత నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా అదనపు బ్యారేజీల నిర్మాణం, ప్రాజెక్టుల  పరిధిలో చేయాల్సిన రీ డిజైనింగ్ తదితర అంశాల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం సభ్యులు అనంతరాములు, వెంకట్‌రామారావు, చంద్రమౌళి, దామోదర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, సాంబయ్య, జగదీశ్వర్ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాణహిత ప్రాజెక్టు పనులను పరిశీలించారు. దీనిపై తమ ప్రతిపాద నలు, సూచనలతో కూడిన 14 పేజీల నివేదికను గురువారం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు.

పాత డిజైన్‌కే మొగ్గు!

దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఎక్కడెక్కడ అదనపు బ్యారేజీల నిర్మాణం చేపట్టాలనే దానిపై తమ 14 పేజీల నివేదికలో స్పష్టంగా వివరించిన కమిటీ... చివరి రెండు పేజీల్లో మాత్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించింది. కొత్త ప్రతిపాదన అయిన కాళేశ్వరం వద్ద నీటి మళ్లింపునకు పూనుకుంటే.. విద్యుత్ అవసరం మరో 400 మెగావాట్ల మేర పెరుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేగాకుండా ఇప్పటివరకు బ్యారేజీ 152 మీటర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకుని జరిగిన రూ. నాలుగు వేల కోట్ల విలువైన కాలువల పనుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కోరుతున్నట్లుగా బ్యారేజీ ఎత్తును ఒక మీటరు తగ్గించి, 151 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించాలని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచించింది. ఎత్తు తగ్గింపు వల్ల నిర్ణీత 160 టీఎంసీల నీటి మళ్లింపు సాధ్యంకాకుంటే... 130 టీఎంసీల వరకు తరలించి, మరో 30 టీఎంసీలను బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన ఉన్న వేమనపల్లి వద్ద మళ్లించవచ్చని తెలిపింది. దీనికోసం వేమనపల్లి వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ఇలా చేస్తే ఎల్లంపల్లి తర్వాతి మూడు ప్యాకేజీలు యథావిధిగా ఉంటాయని బృందం పేర్కొన్నట్లుగా తెలిసింది.
 
వ్యాప్కోస్  నివేదిక వచ్చాకే..


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ బాధ్యతలను ప్రస్తుతం వ్యాప్కోస్‌కు అప్పగించినందున.. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం నివేదికపై ప్రభుత్వం వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యాప్కోస్ నివేదిక అందాక.. రెండు నివేదికలను పరిశీలించి ప్రాజెక్టుపై ముందుకెళ్లే అవకాశం ఉందని తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement