సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నవంబర్ మూడో తేదీ నుంచి విస్తృతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ప్రచారపర్వం కూడా ఊపందుకుంటుందని చెప్పారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీ సామాజికవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమే అని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన ఏకైక పార్టీ బీజేపీయేనని గుర్తు చేశారు.
బీజేపీ నేతృత్వంలో దేశంలోనే తొలిసారిగా బీసీ వ్యక్తి నరేంద్రమోదీ ప్రధానమంత్రి పీఠం అధిరోహించి.. ప్రపంచం అబ్బురపడేలా నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని వివరించారు. కేంద్రంలో బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసి దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారని ధ్వజమెత్తారు. మత రిజర్వేషన్ల పేరుతో బీసీలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.
మొదటి కేబినెట్‌లోనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు
హైదరాబాద్‌లో బీసీలకు 50 కార్పొరేటర్ స్థానాలు రిజర్వ్ చేస్తే.. అందులో 37 సీట్లను మజ్లిస్ ఎత్తుకుపోయిందని కిషన్‌రెడ్డి నిందించారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం చేసే ముస్లిం రిజర్వేషన్లను మొదటి కేబినెట్ లోనే రద్దు చేస్తామని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేలా రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. మజ్లిస్ అనుమతి లేకుండా నాడు కాంగ్రెస్ మంత్రులు, నేడు బీఆర్‌ఎస్ మంత్రులు పాతబస్తీలో పర్యటించలేని పరిస్థితి ఉందని, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో కేసీఆర్ కుటుంబం పనిచేస్తోందన్నారు.
మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కరెంటు బిల్లులు, పన్నులు కట్టడం లేదని, ప్రభుత్వ అధికారులు వెళ్తే వారిపై కత్తులతో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన వారిపై యూపీలో యోగీ ప్రభుత్వం తరహాలో బుల్డోజర్లతో అణచివేస్తామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
పార్టీలో చేరిన నేతలకు కండువాలు కప్పి..
నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లెల ఇంద్రకరణ్ రెడ్డి, నలుగురు మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు మంథని నియోజకవర్గ నేత చల్ల నారాయణ రెడ్డికి కిషన్‌రెడ్డి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రచారాన్ని పరిగెత్తిస్తాం
Published Mon, Oct 30 2023 5:10 AM | Last Updated on Mon, Oct 30 2023 5:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment