సాక్షి. హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. బుధవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఒకవేళ అవకాశం ఉంటే బుధవారం రాత్రే జాబితా ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా... ఏకాభిప్రాయం కుదిరిన సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముంనే చర్చ జరుగుతోంది.
మేనిఫెస్టోకు ఓపిక పట్టండి
అధికార బీఆర్‌ఎస్ 98 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 55 మందితో తొలిజాబితా ప్రకటించేసింది. అదీగాక ఈ రెండు పార్టీలు మేనిఫెస్టోను సైతం ప్రకటించి ప్రచారంలో ముందున్న నేపథ్యంలో బీజేపీ ఇంకా తొలి జాబితాను కూడా ప్రకటించకపోవడంపై పార్టీ నాయకుల్లో ఒకింత ఆందోళన ఉంది. అదీగాక మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో దిగాలు చెందుతున్నారు.
ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా... ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం.
మేనిఫెస్టోలో ప్రతిపాదించే విషయాలను రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించాక... వారే ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే దానిపై స్పష్టతనిస్తారని చెబుతున్నారు. మేనిఫెస్టో ప్రకటనతోపాటే అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం విస్తృతంగా చేపట్టేలా ఢిల్లీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, బీసీలకు తగిన గుర్తింపు, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించినట్టు తెలిసింది.
సకల జనుల ద్రోహి పేరుతో...
కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారంటూ ‘సకల జనుల ద్రోహి కేసీఆర్’ పేరిట ఎన్నికల ప్రచారం చేపట్టాలని కమలం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. మంగళవారం రాష్ట్ర పార్టీ ఎన్నికల సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి తదితరులు ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన అంశాలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా కొత్తపంథాలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 14 కమిటీల (మేనిఫెస్టో, క్యాంపెయిన్, సోషల్ ఔట్‌రీచ్, స్క్రీనింగ్ తదితరాలు) సమావేశాలతో పార్టీ కార్యాలయమంతా సందడి నెలకొంది. మేనిఫెస్టో, అభ్యర్థుల స్క్రీనింగ్, క్యాంపెయిన్, ఎన్నికల మేనేజ్‌మెంట్ తదితరాలపై చర్చించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment