సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పదిరోజులు కావొస్తున్నా..ఓటమికి గల కారణాలపై ఇంతవరకూ సమీక్షించలేదు. పోటీ చేసిన అభ్యర్థులతో రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలెవరూ కనీసం మాట్లాడకపోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ఏ ఎన్నికలు జరిగినా, ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల వ్యవధిలోనే గెలుపోటములపై రివ్యూ చేయడం ఆ పార్టీ ఆనవాయితీ. కానీ ఈసారి అలాంటిదేమీ లేదు. శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరిస్థితి, కారణాలను విశ్లేషించుకుని త్వరలోనే జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉండగా, అలాంటి ప్రయత్నమేదీ ఇప్పటివరకు జరగకపోవడంతో కేడర్‌లో నిరుత్సాహం నెలకొంది.
మొహం చాటేసిన జాతీయ నేతలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీ ముఖ్యనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఆ స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో జాతీయ నాయకత్వం నుంచి పార్టీలోని వివిధ స్థాయిల్లో కొంత నిరాశ, నిస్పృహలు ఎదురయ్యాయి. గెలుపోటములకు గల కారణాలపై కనీసం పోస్టుమార్టం కూడా చేయకపోవడంపై రాష్ట్ర పార్టీనేతలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్, సహఇన్‌చార్జ్ సునీల్ బన్సల్, ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్ తదితరులు ఫలితాల వెల్లడి తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు.
3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా...
రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నుంచి అధికార కైవసం, మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి, తెలంగాణలో మాత్రం నిరాశాజనక ఫలితాలు ఎందుకు వచ్చాయన్న విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 111 సెగ్మెంట్‌లలో పోటీ చేసి 8 స్థానాల్లో గెలుపు, 19 చోట్ల రెండోస్థానం, 46 సెగ్మెంట్‌లలో బీజేపీకి డిపాజిట్లు దక్కిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు రావడానికి కారణాలు ఏమిటన్న దానిపై అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకోకపోవడం ఏమిటనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
అక్కడక్కడా స్థానిక సమీక్షలతో సరి
ఫలితాల తర్వాత కొన్నిచోట్ల అభ్యర్థులు, స్థానిక నేతలు వారి స్థాయిలో ఓటమిపై సమీక్షించారు. దీనిపై రాష్ట్ర పార్టీకి నివేదికలు పంపించినట్టు సమాచారం. మరికొందరు అభ్యర్థులు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని నేరుగా కలిసి ఓటమికి గల కారణాలపై విశ్లేషించినట్టు తెలిసింది.
అయితే పార్టీపరంగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి స్థానిక నేతలతో భేటీ అయ్యి ప్రస్తుత ఫలితాలకు దారితీసిన కారణాలపై సమీక్షించి రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉన్నా, అందులో ఎలాంటి పురోగతి లేదు. ఎన్నికల ఫలితాల సరళిపై, ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడానికి గల కారణాలు వివరిస్తూ జాతీయ నాయకత్వానికి కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవివరమైన నివేదిక సమర్పించినట్టు పార్టీవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment