సాక్షి,. హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడానికి వీలుగా బీజేపీ ముఖ్యనేతలు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోనున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు నిర్వహించే ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా...గురువారం ఉదయమే ఢిల్లీ నుంచి నగరానికి తిరిగొచ్చిన ఈటల రాజేందర్...బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లా గూడూరుకు వెళ్లారు.
గూడూరు నుంచి రోడ్డు మార్గాన డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేటకు వచ్చిన ఆయన బీజేపీ అభ్యర్థి భూక్య సంగీత తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరుకు చేరుకుని అక్కడ బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల సభ ముగిశాక హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ ఈ నెల 5వ తేదీ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఈటల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తాజాగా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కావడంతో...నామినేషన్ల దాఖలు...ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంది.
మరో మూడు రోజుల్లో ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసుకుని హెలికాప్టర్ ద్వారా విస్తృత ప్రచారాన్ని చేపడతామని బండి సంజయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11 దాకా, మళ్లీ సాయంత్రం 4 నుంచి 9 దాకా తాను పోటీచేస్తున్న కరీంనగర్‌లో సంజయ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా వరుసగా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి సంజయ్ సిద్ధమవుతున్నారు. పార్టీ అప్పగించిన ప్రచార బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు సంజయ్ తెలిపారు.
బీజేపీ అభ్యర్థుల మలివిడత జాబితాను ప్రకటించాక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ ఇతర నేతల ఎన్నికల ప్రచారానికి పార్టీ షెడ్యూల్ ఖరారు చేస్తోంది. కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హెలికాప్టర్‌లో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా..కాంగ్రెస్ కూడా పార్టీ అధినేతలు వచ్చిన సమయంలో హెలికాప్టర్ సేవలను వినియోగించుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment