
పోటీపై పార్టీ నేతల ప్రతిపాదనను తిరస్కరించిన కేసీఆర్
అధికారికంగా ఎవరికీ మద్దతు ఇవ్వరాదని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని మూడు స్థానాలకు ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చారు. పట్టభద్రుల కోటా స్థానంలో పోటీ చేయాలని పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించారు. పట్టభద్రుల కోటాలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలకు ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా కీలక నేతలకు సూచించారు.
అదే సమయంలో మండలి ఎన్నికల్లో ఇతర పార్టీలు లేదా అభ్యర్థులెవరికీ మద్దతు ఇవ్వ డం లేదనే సంకేతాలు కూడా ఇచ్చారు. శాసన మండలి ఎన్ని కలకు బదులు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సన్నాహాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించారు.
ఇక స్థానిక ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు.. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ నిర్వహణపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.
పోటీకి నేతలు సిద్ధమైనా..
శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ కోటా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దా ర్ రవీందర్‌సింగ్, డాక్టర్ బీఎన్ రావు, శేఖర్‌రావు, రాజారాం యాదవ్ తదితరుల పేర్లు వినిపించాయి.
పట్టభద్రుల కోటా లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేందర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఓ దశలో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీకి సన్నద్ధమవుతున్న ప్రసన్న హరికృష్ణను బీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చి పార్టీ టికెట్ ఇప్పించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కొంతమేర ప్రయత్నాలు కూడా చేశారు.
కానీ చివరికి పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తిరిగి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment