Council elections
-
మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హెచ్ఆర్డీఏ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల్లో హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఘన విజయం సాధించింది. హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్‌కుమార్ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్ ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. హేమాహేమీలుగా పిలిచే ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు ఓడిపోయారు. కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న ప్రతి డాక్టర్ 13 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ 13 ఓట్లను కలిపి ఒక్క ఓటుగా పరిగణిస్తారు. అలా ఈ ఎన్నికల్లో మొత్తం 17,090 ఓట్లు పోల్ కాగా, రకరకాల కారణాలతో 3,311 ఓట్లను రిటర్ణింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. మిగిలిన 13,779 ఓట్లను లెక్కించారు. అత్యధికంగా డాక్టర్ ప్రతిభాలక్ష్మి 7,007 ఓట్లను సాధించగా, డాక్టర్ మహేశ్‌కుమార్ 6,735 ఓట్లు సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఎన్నికలు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. మెడికల్ కౌన్సిల్ 25 మంది డాక్టర్లతో ఏర్పాటవుతుంది. అందులో 13 మంది ఇప్పుడు డాక్టర్లు ఓటు ద్వారా ఎన్నికయ్యారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేయాల్సి ఉంది. అనంతరం చైర్మన్‌ను ఎన్నుకుంటారు. చైర్మన్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పదవినీ హెచ్ఆర్డీఏ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వాస్తవంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే మెడికల్ కౌన్సిల్ ఎన్నికలకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల వల్ల మెడికల్ కౌన్సిల్ ఎన్నికలపై ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు రిజి్రస్టేషన్ చేసుకుంటారు. ఈ ఎన్నికల్లో వారే ఓట్లేశారు. విజేతలు సాధించిన ఓట్లు ఇలా డాక్టర్ ప్రతిభా లక్ష్మి 7,007 ఓట్లు, డాక్టర్ కె.మహేష్‌కుమార్ 6,735, డాక్టర్ బండారి రాజ్‌కుమార్ 6,593, డాక్టర్ జి.శ్రీనివాస్ 6,454, డాక్టర్ కిరణ్‌కుమార్ 6,434, డాక్టర్ ఎస్.ఆనంద్ 6,192, యెగ్గన శ్రీనివాస్ 6,086, డాక్టర్ రవికుమార్ 6,085, డాక్టర్ నరేష్కుమార్ 6,091, డాక్టర్ శ్రీకాంత్ 5,974, డాక్టర్ సన్నీ దావిస్ 5,912, డాక్టర్ విష్ణు 5,844, డాక్టర్ సయ్యద్ ఖాజా ఇమ్రాన్ అలీ 5695 ఓట్లు సాధించారు. -
మార్చి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ 2021–22 సమావేశాలు మార్చి మూడో వారంలో జరిగే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 20 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోల్ మేనేజ్మెంట్ ఏర్పాట్లలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బిజీగా ఉన్నారు. మార్చి 14న పోలింగ్ జరగనుండగా 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు స్థానాల్లో సైతం తమ పార్టీ అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్ జరిగే వరకు మండలి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మండలి ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి 14 తర్వాత ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. సమావేశాలు 15 రోజులే... వచ్చే ఆర్థిక సంవత్సరాని (2021–22)కి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును మార్చి 31లోగా ఉభయ సభలు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉండడంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు 12–15 రోజులకు మించి జరిగే అవకాశాలు లేవు. కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటుండటం కూడా మరో కారణం కానుంది. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను మార్చి తొలి వారంలో ఖరారు చేసే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాల తొలిరోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఒకట్రెండు రోజులు చర్చ నిర్వహించనున్నారు. మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో బడ్జెట్‌పై చర్చ, అనంతరం పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంది. కేవలం 12–15 రోజుల్లో ఈ కార్యక్రమాలను ముగించేలా ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈసారి కూడా శాఖలవారీగా పద్దులపై విస్తృతస్థాయి చర్చ లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సానుకూల దృక్పథంతో బడ్జెట్... కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే క్రమంగా గాడినపడుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయం మినహా జీఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్ తదితరాల రూపంలో ఆదాయం పుంజుకొని ఇప్పటికే సాధారణ స్థితికి చేరు కుంది. సానుకూల దృక్పథంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021–22 రూపకల్పనకు ప్రస్తుత పరిస్థితులు దోహదపడనున్నాయి. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నా ఇంకా కీలక దశకు చేరుకోలేదు. ఎప్పటిలాగే బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా వారంపాటు సమీక్షలు నిర్వహించాకే శాఖల వారీగా బడ్జెట్ అవసరాలు, కేటాయింపులు కొలిక్కి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రాధామ్యాలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు జరపాల్సిన కేటాయింపులపై సీఎం స్వయంగా నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు తెలిపారు. మార్చి తొలివారంలో బడ్జెట్ రూపకల్పనపై సీఎం సమీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
భద్రతా మండలిలో ఎన్నికల సందడి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో ఐదు తాత్కాలిక సభ్యదేశాల నియామక ప్రక్రియ మొదలైంది. 75వ ఐక్యరాజ్యసమితి సమావేశాల అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు సామాజిక, ఆర్థిక మండలి సభ్యుల నియామకానికి కూడా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బుధవారం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో తమకు స్పష్టమైన విజయం లభించడం ఖాయమని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయం సాధిస్తే రెండేళ్లపాటు (2021–22) ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభిస్తుంది. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేస్తోంది కాబట్టి గెలుపు తథ్యమే. భారత్ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. -
30న నిర్మాతల మండలి ఎన్నికలు
ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతలమండలి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఈసారి జరగాల్సిన ఎన్నికలు చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు నిర్మాతల మండలి ఎన్నికలు జూన్ 30న జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ కలిసి ‘మన కౌన్సిల్– మన ప్యానెల్’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతల మండలి నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడింది. నిర్మాతలందరం ఒక గ్రూప్‌గా ఏర్పడి నిర్మాతల మండలి బలంగా ఉండాలని పి.రామ్మోహన్రావు, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాసరావు లాంటి పెద్దలందరూ ముందుకొచ్చారు’’ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నిజానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అర్హులకు తగ్గ పదవులిచ్చి నిర్మాతల మండలి స్ట్రాంగ్‌గా ఉండాలన్నదే మా కోరిక. కానీ సమయాభావం వల్ల సభ్యులందరూ అందుబాటులో లేని కారణంగా ఎన్నికలు జరపక తప్పటం లేదు’’ అన్నారు. టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా మిగిలిన సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి అర్హులైన, ఆసక్తి ఉన్న సభ్యులకి పదవులిస్తాం’’ అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మన ప్యానెల్’,‘గిల్డ్ప్యానెల్’ పోటీ పడనున్నాయి. ఈ కార్యక్రమంలో వైవీయస్ చౌదరి, నిర్మాతలు మోహన్ వడ్లపట్ల, రామసత్యనారాయణ, అశోక్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
మండలి ఎన్నికలకు కొత్త జాబితా
సాక్షి, హైదరాబాద్ : శాసనమండలి ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా రూపొందించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జాబితాపై సెప్టెంబర్ 2016లోనే రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. దీంతో పాత ఓటర్ల జాబితా పూర్తిగా రద్దయింది. మరో 6 నెలల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎన్నిౖMðన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతుండటం, ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన నేపథ్యంలో వచ్చే నెలలో ఓటర్ల న మోదుకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలోనే ప్రక్రియ పూర్తి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిౖMðన శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పదవీకాలం వచ్చే ఏడాది పూర్తవనుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి.. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా రిటైర్‌అవుతున్నారు. ఈ స్థానాలకు జనవరి లేదా ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కొత్తగా నమోదు చేసుకుంటేనే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కొత్తగా నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉంటుంది. ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేళ్లు దాటిన వారు ఓటు నమోదు చేసుకోవాలి. కొత్తగా ఓటర్ల నమోదు చేసుకోవా లని వచ్చే నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరులో ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. స్వామిగౌడ్ అనాసక్తి! వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ పోటీచేయడానికి అనాసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన తాను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తానని ఆయన విశ్వాసంతో ఉన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు చంద్రశేఖర్‌గౌడ్ సన్నిహితులు చెబుతున్నారు. కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేషన్ చైర్మన్ చిరుమిళ్ల రాకేశ్‌కుమార్ పేర్లు కూడా టీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ పేరూ టీఆర్ఎస్ పరిశీలించే అవకాశం లేకపోలేదు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు
- పొన్నాలను పరామర్శించిన కొప్పుల హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కసరత్తు ప్రారంభించింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి అభ్యర్థి ఎంపికపై ఈ మూడు జిల్లాల అధ్యక్షులతో, పార్టీ ముఖ్య నాయకులతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోనులో మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ విషయంలోనూ ఆ మూడు జిల్లాల ముఖ్యులతో చర్చిస్తున్నారు. ఈ ఎన్నికలకు పార్టీ పరంగా అభ్యర్థులను పోటీకి నిలపడం ఇదే మొదటిసారి. ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను పోటీకి నిలపనున్న విషయాన్ని ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుకు పొన్నాల లక్ష్మయ్య వివరించారు. పొన్నాలను గురువారం కొప్పుల రాజు పరామర్శించిన సందర్భంగా ఈ ఎన్నికల విషయం చర్చకు వచ్చింది. -
మండలి రేసులో గులాబీ గుర్రాలెవరో..!
- పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీకి భారీ క్యూ - తెరపైకి తటస్థుల పేర్లు - అధినేత ఆశీస్సులున్న వారికే చాన్స్? హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో మండలి టికెట్ల లొల్లి గుబులు రేపుతోంది. వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగానే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉండడం... పార్టీతో సంబంధం లేని తటస్థుల పేర్లూ తెరపైకి రావడంతో ఇది మరింత రసవత్తరంగా సాగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎన్నికలు ఉండడంతో పార్టీ ఆసాంతం మండలి ముచ్చట్లలో నే మునిగిపోయింది. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న డాక్టర్ కె.నాగేశ్వర్ (మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్), కపిలవాయి దిలీప్ కుమార్ (వరంగల్ - ఖమ్మం - నల్లగొండ )ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా అదేరోజు ముగియనుంది. మండలి ఎన్నికల్లో బరిలో దిగాలనుకునేవారు ముందునుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి పెట్టారు. అధికార టీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే పట్టభద్రుల నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘కడియం’ ైవె పే మొగ్గు! వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆయనకు మండలిలో చోటు కల్పిస్తారని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే, ఎలాంటి ఇబ్బంది ఉండని ఎమ్మెల్యే కోటా నుంచే ఆయనను మండలికి పంపుతారని భావించినా... వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి కడియం పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ సమీకరణల వల్ల టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు పోటీ పడుతున్నారు. వరంగల్ జిల్లాకే చెందిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాయకుడు మర్రి యాదవరెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ అధినేతను కోరినట్లు తెలుస్తోంది. ప్రచారంలో సుద్దాల అశోక్‌తేజ పేరు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ఇందులో సినీ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వామపక్షాల కూటమి ఈసారి ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను కాదని సుద్దాల అశోక్‌తేజను బరిలోకి దింపాలని యోచిస్తుండగా... ఆయన మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతుతోనే పోటీ చేస్తానని, లేదంటే పోటీలో ఉండనని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ మద్దతు ఇస్తే నాగేశ్వర్ కూడా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, వారిద్దరూ ఈ విషయమై ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. మరోవైపు టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ను ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలన్న వ్యూహంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కానీ, దేవీప్రసాద్ తనకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పూల రవీందర్ ద్వారా పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ద్వారా టీపీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. -
మండలి ఎన్నికలు ఏకగ్రీవం
సాక్షి, ముంబై: విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికల్లో వీరికి పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. మండలి ఉప ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు 20వ తేదీతో ముగిసింది. చివరి రోజు మంగళవారం శివసేనకు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, శివ్‌సంగ్రాం అధ్యక్షుడు వినాయక్ మేటే, రాష్ట్రీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు మహాదేవ్ జాన్ కర్, బీజేపీ మహిళా ఆఘాడి అధ్యక్షురాలు స్మితా వాఘ్ నామినేషన్లు వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు నలుగురే నామినేషన్ వేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎమ్మెల్సీలుగా ప్రాతినిథ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే, బీజేపీకి చెందిన ఆశీష్ శేలార్‌లు ఇటీవల శాసనసభకు ఎన్నికయ్యారు. వీరంతా 2014 అక్టోబరు 20వ తేదీనే తమ విధాన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఎన్సీపీలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వినాయక్ మేటే సభ్యత్వం రద్దయింది. ఇలా మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పృథ్వీరాజ్ చవాన్, వినాయక్ మేటేల పదవీ కాలం 2016 జూలై ఏడో తేదీ వరకు ఉంది. అలాగే ఖాళీ అయిన ఆశీష్ శేలార్ స్థానం గడువు 2018 జూలై 27 వరకు, వినోద్ తావ్డే స్థానం గడువు 2020 ఏప్రిల్ 24 వరకు ఉంది. -
నేడు మండలి ఎన్నికలు
కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష అన్ని చోట్లా ముక్కోణపు పోటీ 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ మంగళవారం ఓట్ల లెక్కింపు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలోని నాలుగు స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో రెండేసి చొప్పున పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజక వర్గాలున్నాయి. ఎగువ సభలో సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి వీటిలో కాంగ్రెస్ మూడు స్థానాలనైనా గెలుచుకోవాల్సి ఉంది. ప్రస్తుతం సభలో బీజేపీది పైచేయిగా ఉంది. పశ్చిమ, ఆగ్నేయ పట్టభద్రులు, బెంగళూరు, ఈశాన్య ఉపాధ్యాయుల నియోజక వర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అన్ని చోట్లా ముక్కోణపు పోటీలున్నాయి. పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. పశ్చిమ పట్టభద్రుల నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులుగా పీహెచ్. నీరలకేరి, ఎస్వీ. సంతనూర, వసంత హొరట్టిలు పోటీ చేస్తున్నారు. ఓటర్లుగా ధార్వాడ, గదగ, హావేరి, ఉత్తర కన్నడ జిల్లాల్లోని పట్టభద్రులు ఉన్నారు. ఆగ్నేయ పట్టభద్రుల నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రొఫెసర్ సీహెచ్. మురుగేంద్రప్ప, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఏహెచ్. శివయోగి స్వామి, స్వతంత్ర అభ్యర్థిగా ఆర్. చౌడరెడ్డిలు పోటీలో ఉన్నారు. తుమకూరు, దావణగెరె, చిత్రదుర్గ, కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జేడీఎస్‌కు పెట్టని కోటగా భావిస్తున్న బెంగళూరు ఉపాధ్యాయుల నియోజక వర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా పుట్టన్న హ్యాట్రిక్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎం. నీలయ్య, బీకే. వెంకటేశ్ రంగంలో ఉన్నారు. బెంగళూరు నగర, గ్రామీణ, రామనగర జిల్లాల ఉపాధ్యాయులు ఓటర్లు. ఈశాన్య ఉపాధ్యాయుల నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా శశీల్ నమోషి, కాంగ్రెస్ నుంచి శరణప్ప మట్టూర్, జేడీఎస్ అభ్యర్థిగా మహంతప్ప అంబలిగి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని ఆరు జిల్లాలు, దావణగెరె జిల్లాలోని హరపనహళ్లి తాలూకా ఈ నియోజక వర్గం పరిధిలోకి వస్తాయి.