- కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష
- అన్ని చోట్లా ముక్కోణపు పోటీ
- 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్
- మంగళవారం ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలోని నాలుగు స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో రెండేసి చొప్పున పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజక వర్గాలున్నాయి. ఎగువ సభలో సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి వీటిలో కాంగ్రెస్ మూడు స్థానాలనైనా గెలుచుకోవాల్సి ఉంది. ప్రస్తుతం సభలో బీజేపీది పైచేయిగా ఉంది. పశ్చిమ, ఆగ్నేయ పట్టభద్రులు, బెంగళూరు, ఈశాన్య ఉపాధ్యాయుల నియోజక వర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
అన్ని చోట్లా ముక్కోణపు పోటీలున్నాయి. పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. పశ్చిమ పట్టభద్రుల నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులుగా పీహెచ్. నీరలకేరి, ఎస్‌వీ. సంతనూర, వసంత హొరట్టిలు పోటీ చేస్తున్నారు. ఓటర్లుగా ధార్వాడ, గదగ, హావేరి, ఉత్తర కన్నడ జిల్లాల్లోని పట్టభద్రులు ఉన్నారు.
ఆగ్నేయ పట్టభద్రుల నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రొఫెసర్ సీహెచ్. మురుగేంద్రప్ప, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఏహెచ్. శివయోగి స్వామి, స్వతంత్ర అభ్యర్థిగా ఆర్. చౌడరెడ్డిలు పోటీలో ఉన్నారు. తుమకూరు, దావణగెరె, చిత్రదుర్గ, కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జేడీఎస్‌కు పెట్టని కోటగా భావిస్తున్న బెంగళూరు ఉపాధ్యాయుల నియోజక వర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా పుట్టన్న హ్యాట్రిక్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎం. నీలయ్య, బీకే. వెంకటేశ్ రంగంలో ఉన్నారు.
బెంగళూరు నగర, గ్రామీణ, రామనగర జిల్లాల ఉపాధ్యాయులు ఓటర్లు. ఈశాన్య ఉపాధ్యాయుల నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా శశీల్ నమోషి, కాంగ్రెస్ నుంచి శరణప్ప మట్టూర్, జేడీఎస్ అభ్యర్థిగా మహంతప్ప అంబలిగి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని ఆరు జిల్లాలు, దావణగెరె జిల్లాలోని హరపనహళ్లి తాలూకా ఈ నియోజక వర్గం పరిధిలోకి వస్తాయి.