బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు సిద్ధమైంది. పార్టీలో జరిగిన పరిణామాలు.. సీట్ల కేటాయింపు నుంచి ఫలితాల ప్రకటన వరకు అభ్యర్థుల తీరుపై సమగ్ర నివేదికతో ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ కమలసారథి కిషన్ రెడ్డి, అసలు కాషాయ దళపతి హస్తినకు తీసుకెళ్లిన రిపోర్ట్ లో ఏముంది ? ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 8 అసెంబ్లీ సీట్లు.. 14 శాతం ఓట్లు సాధించి ఉనికి చాటుకుంది. గత మూడేళ్లుగా బీజేపీ చేసిన పోరాటలకు.. వచ్చిన ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడంపై పార్టీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి ఆ నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, హోం మంత్రి అమిత్ షాకు సమర్పించనున్నారు. కిషన్ రెడ్డి ఇస్తున్న రిపోర్ట్ లో ఏముందనే దానిపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ సాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంత వరకు వర్కవుట్ అయ్యాయనే దానిపై నివేదికలో వివరించినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం, బీసీ సీఎం నినాదం ఎంత వరకు ఉపయోగపడిందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ 36 మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. 12 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా విజయం సాధించలేదు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లపై మిషన్ 31 అని కమిటీలు వేసినా.. ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఆరు స్థానాలు ఇచ్చి బీజేపీ పరువు నిలబెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 48 మంది కార్పోరేటర్లు... టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నా వారిని వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైంది. దీంతో జీహెచ్ఎంసీలో కేవలం ఒక్క గోషామహల్ విజయంతో సరిపెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీగా ఓట్లను చీల్చడంతో బీజేపీ సీట్లకు గండిపడింది. కాంగ్రెస్ ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు.
కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, బోధ్ అసెంబ్లీ స్థానాలపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ స్థానాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు, ఎంపీలు పోటీ చేసి పరాజయం పాలుకావడం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం అభ్యర్థులుగా ఫోకస్ చేసినప్పటికీ ఎందుకు గెలవలేదనే దానిపై చర్చ సాగుతోంది. ఎంపీల అతివిశ్వాసం, గ్రేటర్ లో కార్పోరేటర్ల సహాయ నిరాకరణ, నేతల మధ్య ఆధిపత్య పోరులాంటి అంశాలు.. బీజేపీ వైఫల్యానికి కారణంగా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వైఫల్యాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు ? పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుందనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
చదవండి: TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment