సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు దొంగలు పడిన ఆరునెలలకు ఎఫ్‌ఐఆర్ వేసిన చందంగా ఉన్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గిన్నిస్ రికార్డును తలదన్నేలా.. బీఆర్‌ఎస్ పాలనలో ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల 17 సార్లు పరీక్షల్ని వాయిదా వేసి కొత్త చరిత్రను సృష్టించారన్నారు.
‘టీఎస్‌పీఎస్సీ స్కామ్ బయటపడిన తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ సక్రమంగా లేదు. ఇందులోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ చివరికి న్యాయస్థానం ఆ పరీక్షను కూడా రద్దు చేసేంత స్థాయిలో ఘనమైన చరిత్ర మీది’అని విమర్శించారు. గత మార్చి 12న ఈ స్కామ్ వెలుగు చూస్తే.. ఎన్నికల సందర్భంగా ప్రజల్లో మరీ ముఖ్యంగా యువతలో ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు భయపడి డిసెంబర్ 3 తర్వాత టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన అంటూ కేటీఆర్ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఈ ప్రకటనతో కేటీఆర్ యువతను, నిరుద్యోగులను మళ్లీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లలోని వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, యువత, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
యూనివర్సిటీల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందన్నారు. యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఇంటికొక ఉద్యోగమిస్తాం.. అని హామీలు గుప్పించిన కేసీఆర్ సర్కార్ గత పదేళ్లలో ఒక గ్రూప్–1 పోస్టును కూడా భర్తీ చేయలేదని, ఒక్క డీఎస్సీని నిర్వహించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.
కేటీఆర్‌వి పగటి కలలు..
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న కేటీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ప్రజలు ఫామ్ హౌస్‌కి పరిమితం చేయబోతున్నారన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్‌పై, బీఆర్‌ఎస్‌పై యువత, విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వారు తమ సత్తా చాటి బీజేపీని గెలిపించబోతున్నారని చెప్పారు. డిసెంబర్ 3న వెలువడే ఫలితాల్లో బీఆర్‌ఎస్ ఘోరంగా ఓటమి చవిచూడబోతోందన్నారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మంత్రి కేటీఆర్.. నష్ట నివారణలో భాగంగానే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన అంటూ కొత్త నాటకం మొదలు పెట్టారని విమర్శించారు. ‘కేటీఆర్.. మీ ఎత్తులు, జిత్తులను నిరుద్యోగులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏరు దాటాక తెప్ప తగలేసే మీ వైఖరి గురించి తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా మీకు ఓట్లు వేసి గెలిపిస్తారనుకుంటే, అది మీ మూర్ఖత్వమే అవుతుంది’అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
‘మీ వైఫల్యం వల్లే 30 లక్షల మంది యువత కుటుంబాలు నిరాశలో కూరుకుపోయాయి. గ్రూప్స్ అభ్యర్థుల ఆత్మహత్యలకు ముమ్మాటికీ మీరే కారణం. రాజధాని నగరం నడిబొడ్డున గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం మీ పాపం కాదా? ఈ మధ్య మెట్‌పల్లికి చెందిన మరో యువకుడు రెహమత్ కూడా గ్రూప్ 1, 2 పరీక్షలు వాయిదా పడ్డాయని ఆత్మహత్య చేసుకుంటే, మీ అధికారాన్ని ఉపయోగించి దానిని తొక్కిపెట్టడం వాస్తవం కాదా?’అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తాం’అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
1న మూడో జాబితాపై కసరత్తు
నవంబర్ 1వ తేదీన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాపై కసరత్తు ఉంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఆధ్వర్యంలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ జాబితాపై చర్చించాక అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని ఆయన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అందరి అభిప్రాయాలను స్వీకరించాకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగుతోందన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో పొత్తుపై చర్చ జరుగుతోందని, దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అభ్యర్థుల మూడో జాబితాతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని, ప్రస్తుతం ఎన్నికల ప్రణాళికపై కసరత్తు సాగుతోందని వెల్లడించారు. మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని కిషన్‌రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment