
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలసి నిర్వహించ తలపెట్టిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. ఈ యాత్రను ముందుగా అనుకు న్నట్టు ఈ నెల 15 నుంచి కాకుండా దసరా పండుగ తర్వాత ప్రారంభించాలని పీసీసీ నేతలు నిర్ణయించారు. ఎన్నికల ప్రచారం ముగిసేదాకా బస్సు యాత్రను కొనసాగించడం ద్వారా అప్పటివరకు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని కొనసాగించవచ్చన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కిరాకపోవడంతో అసమ్మతి బెడద నుంచి బయటపడేందుకే యాత్రను వాయిదా వేసినట్టు పలువురు నేతలు పేర్కొంటున్నారు.
రెండు ప్రతిపాదనలు
వాస్తవానికి ఈనెల 15వ తేదీ నుంచి రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున అన్ని జిల్లాలను చుట్టివచ్చేలా బస్సుయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ మేరకు పీఏసీలో బస్సుయాత్రపై చర్చించిన నేతలు రెండు ప్రతిపాదనలు చేశారు.
ఈ నెల 15 నుంచి 22 వరకు యాత్ర చేయాలని.. లేదంటే దసరా తర్వాతి నుంచి ఎన్నికలదాకా నిర్వహించాలని.. ఈ రెండింటిలో జాతీయ నాయకత్వం సూచన మేరకు ఏదో ఒక షెడ్యూల్‌ను ఖరారు చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాకూ చెప్పారు. ఇందులో రెండో ప్రతిపాదనకే అధిష్టానం మొగ్గు చూపిందని, దసరా తర్వాతే యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది.
ఐక్యంగా ఉన్నామని చాటేందుకే..
బస్సు యాత్ర వాయిదా వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఈ నెల 16న లేదా 18న ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తేలకుండానే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రయోజనం ఉండదన్న ఆలోచన వచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా ఈనెల 15 నుంచి ప్రారంభిస్తే యాత్ర మధ్యలో ఉండగానే అభ్య ర్థులను ప్రకటించాల్సి ఉంటుందని, టికెట్లు రాని వారి అసమ్మతి ప్రభావం యాత్రపై పడుతుందన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం.
ఈ మేరకు గొడవల మధ్య యాత్ర నిర్వహించడం ద్వారా ప్రయోజనం ఉండదనే భావనకు అధిష్టానం వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు దసరా తర్వాత యాత్ర చేపట్టడం ద్వారా.. ఆ సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించి.. ఎన్నికల ప్రచారానికి ఊపు తేవచ్చనే ప్రణా ళికతో వాయిదాకే మొగ్గుచూపినట్టు వివరిస్తు న్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉన్నారని ప్రజల్లో భావన కలిగించే ఉద్దేశమూ దెబ్బ తినదన్న ఆలోచన చేసినట్టు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment