సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఆ పార్టీ ఆశావహుల్లో రెండు, మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించింది. 52 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముందే చెప్పినట్లు అత్యధికంగా బీసీలకు 19 స్థానాల్లో అవకాశం కల్పించింది. రెడ్డి 12, వెలమ 5, ఎస్సీలకు 8, ఎస్టీలకు 6, వైశ్యులు 1, ఉత్తరాది అగర్వాల్ (లోధి)వర్గానికి చెందిన ఒకరికి చోటు లభించింది.
మొత్తంగా 12 మంది మహిళలకు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలు కలుపుకుని) అవకాశం కల్పించింది. ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (కోరుట్ల), సోయం బాపూరావు (బోథ్)లను అసెంబ్లీ బరిలోకి దించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.
మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌పై ఆదివారం సస్పెన్షన్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈసారి కూడా గోషామహల్ సీటునే ఇచ్చారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మరోసారి దుబ్బాక నుంచి బరిలో నిలిచారు. అధికార బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (సిరిసిల్ల)పై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను పోటీకి దింపారు. కాగా కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, మరో ఎంపీ కె.లక్ష్మణ్‌లకు మొదటి జాబితాలో చోటు కల్పించలేదు.
నెలాఖరులోగా రెండు లేదా మూడు జాబితాల్లో మిగతా 67 సీట్లకు అభ్యర్థులు ఖరారు కావొచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాలతో ఉమ్మడి జిల్లాలు అన్నీ కవర్ అయ్యేలా (పాతబస్తీ, పార్టీకి అంతగా బలం లేని ఇతర చోట్ల కలిపి), బీసీలు, మహిళలు, రెడ్డి, వెలమ ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు సీట్లు ఖరారు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో మాదిరిగా ఇక్కడ కూడా.. గతంలో పార్టీ అభ్యర్థులు 3, 4 స్థానాల్లో నిలిచిన పలు స్థానాలకు అభ్యర్థులను ముందుగా ప్రకటించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. తొలి జాబితాలో పార్టీకి చెందిన పలువురు సీనియర్లకు కూడా కోటు దక్కలేదు.
కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ దూరం!
తొలి జాబితాలో లేని అంబర్‌పేట, మునుగోడు, గద్వాల, ముషీరాబాద్, మహబూబ్‌నగర్, ఉప్పల్, ఎల్‌బీనగర్ తదితర స్థానాల్లో ఎవరికి టికెట్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి పోటీ చేస్తారో లేదో చర్చనీయాంశంగా మారింది. కిషన్‌రెడ్డితో పాటు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (ముషీరాబాద్) పోటీకి దూరంగా ఉంటామని జాతీయ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. దీంతో అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి భార్య కావ్యారెడ్డి లేదా నగర సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు డా.ఎన్.గౌతమ్‌రావు బరిలో నిలుస్తారా? మరో బీసీ నేతకు అవకాశం ఇస్తారా? వేచి చూడాల్సి ఉంది.
అయితే తాను అంబర్‌పేట నుంచి పోటీ చేయాలా వద్దా? అన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, అది పార్టీ అంతర్గత వ్యవహారమని కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఇక ముషీరాబాద్ నుంచి హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. మునుగోడు, ఎల్‌బీనగర్‌ల నుంచి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆయన సతీమణి పోటీ చేయాలని భావిస్తున్నారు. గద్వాల నుంచి పోటీకి పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, మహబూబ్‌నగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి సిద్ధమైనా మొదటి జాబితాలో ఈ సీట్లు ఖరారు చేయలేదు.
బలం లేని చోట్ల బీసీలకు?
బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించినా పార్టీ బలంగా లేని పాతబస్తీ, ఇతర చోట్ల ఇచ్చారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్డి కులస్తులకు ఎక్కువ సీట్లు కేటాయించారని, అయితే బీసీలకు తగిన ప్రాధాన్యత లేని నియోజకవర్గాల్లో ఇచ్చారని అంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా లాంటి సీట్లు బీసీలకు ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. జనగామలో బలమైన నేత బీరప్పకు ఇవ్వలేదని చెబుతున్నారు. అయితే ఈ వాదనను ఇతర నేతలు ఖండిస్తున్నారు.
బీసీలకు సంబంధించి పలువురికి గెలిచే సీట్లు, పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే అవకాశం కల్పించారని అంటున్నారు. పార్టీ బలంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పలు సీట్లు బీసీలకు కేటాయించడం వారికి పెద్దపీట వేసినట్టేనని వివరిస్తున్నారు. ఇక వరంగల్ పశ్చిమ స్థానం నుంచి టికెట్ ఆశించిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. మరోవైపు తనతో పాటు బీజేపీలోకి వచ్చిన కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమకు వేములవాడ టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీకి దూరంగా ఉంటానని ఈటల పేర్కొనడంతో ఆ నియోజకవర్గాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
‘జనసేన’పై నిర్ణయం తీసుకోలేదు: కిషన్‌రెడ్డి
ఈ ఎన్నికల్లో జనసేనతోనూ సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందనే నాయకత్వం సంకేతాలిస్తోంది. జనసేన 12 సీట్లు కోరుతోందని, హైదరాబాద్‌లో ఒకటి, మరో రెండు సీట్లు రాష్ట్రంలోని ఇతర చోట్ల ఇవ్వాల్సి ఉంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో జనసేనకు గుర్తింపు లేకపోవడంతో పాటు నాయకులు, కేడర్ లేని పరిస్థితుల్లో ఆ పార్టీకి రెండు, మూడు సీట్లు ఇచ్చినా తమకు నష్టమేనని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. కాగా జనసేనతో పొత్తుపై ప్రాథమికంగా చర్చించామని, అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
సామాజికవర్గాల వారీగా..
– 19 మంది బీసీలలో మున్నూరు కాపు–2, ముదిరాజ్–3, యాదవ్–3, గౌడ్–3, విశ్వకర్మ–1, పద్మశాలి–1, పెరిక–2, అరే కటిక–1, అరే మరాఠా–1, లోధా–2 ఉన్నారు.
– 19 ఓసీలలో 12 మంది రెడ్డి, 5 వెలమ, ఒక వైశ్య, ఒక నార్త్ ఇండియన్ అగర్వాల్ ఉన్నారు.
– 8 మంది ఎస్సీలలో ఒకరు బైండ్ల, 5 మాదిగ, 2 మాల ఉన్నారు.
– 6 మంది ఎస్టీల్లో 4 లంబాడా, ఒక కోయ ఒక గోండు ఉన్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా..
తొలి జాబితాలో ఎక్కువగా ఉత్తర తెలంగాణ పరిధిలోని నియోకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు స్పష్టమౌతోంది. హైదరాబాద్ పరిధిలో 7 నియోజకవర్గాలు, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తొమ్మిది చొప్పున స్థానాలు, ఆదిలాబాద్‌లోని 7, నిజామాబాద్‌లోని 5, నల్లగొండ, మెదక్‌లోని నాలుగేసి చొప్పున, రంగారెడ్డిలో 3, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని రెండేసి చొప్పున నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.
అభ్యర్థుల జాబితా:
1) సిర్పూర్ – డా.పాల్వాయి హరీశ్ బాబు
2) బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి
3) ఖానాపూర్ (ఎస్టీ) – రమేష్ రాథోడ్
4) ఆదిలాబాద్– పాయల్ శంకర్
5) బోథ్(ఎస్టీ) – సోయం బాపూరావు
6) నిర్మల్– ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7) ముధోల్–రామారావు పటేల్
8) ఆర్మూర్– పైడి రాకేష్ రెడ్డి
9) జుక్కల్ (ఎస్సీ) – టి.అరుణతార
10) కామారెడ్డి– కె.వెంకటరమణా రెడ్డి
11) నిజామాబాద్ అర్బన్– ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
12) బాల్కొండ – ఆలేటి అన్నపూర్ణమ్మ
13) కోరుట్ల – ధర్మపురి అర్వింద్
14) జగిత్యాల– డా.భోగా శ్రావణి
15) ధర్మపురి (ఎస్సీ)– ఎస్.కుమార్
16) రామగుండం– కందుల సంధ్యారాణి
17) కరీంనగర్ – బండి సంజయ్ కుమార్
18) చొప్పదండి (ఎస్సీ)– బొడిగ శోభ
19) సిరిసిల్ల– రాణి రుద్రమరెడ్డి
20) మానకొండూరు (ఎస్సీ)– ఆరెపల్లి మోహన్
21) హుజూరాబాద్›– ఈటల రాజేందర్
22) నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్
23) పటాన్‌చెరు –టి.నందీశ్వర్ గౌడ్
24) దుబ్బాక – మాధవనేని రఘునందన్ రావు
25) గజ్వేల్ – ఈటల రాజేందర్
26) కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్
27) ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్
28) మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
29) ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
30) కార్వాన్ – అమర్‌సింగ్
31) గోషామహల్ – టి.రాజాసింగ్
32) చార్మినార్ – మేఘారాణి
33) చాంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్
34) యాకుత్‌పురా – వీరేందర్ యాదవ్
35) బహదూర్‌పురా – వై.నరేశ్ కుమార్
36) కల్వకుర్తి – తల్లోజు ఆచారి
37) కొల్లాపూర్ – ఎ.సుధాకర్ రావు
38) నాగార్జున సాగర్ – కె.నివేదితా రెడ్డి
39) సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు
40) భువనగిరి – గూడూరు నారాయణరెడ్డి
41) తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య
42) జనగాం – డా.ఆరుట్ల దశమంత్ రెడ్డి
43) స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) – డా.గుండె విజయ రామారావు
44) పాలకుర్తి – లేగ రామ్మోహన్ రెడ్డి
45) డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత
46) మహబూబాబాద్ (ఎస్టీ) – జాథోత్ హుస్సేన్ నాయక్
47) వరంగల్ పశ్చిమ – రావు పద్మ
48) వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
49) వర్ధన్నపేట (ఎస్సీ)– కొండేటి శ్రీధర్
50) భూపాలపల్లి– చందుపట్ల కీర్తి రెడ్డి
51) ఇల్లందు (ఎస్టీ) – రవీంద్ర నాయక్
52) భద్రాచలం (ఎస్టీ) – కుంజా ధర్మారావు
బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు
Published Mon, Oct 23 2023 4:49 AM | Last Updated on Mon, Oct 23 2023 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment