సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘తెలంగాణలో ఫైట్ చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పోటీ చేయకూడదనే నిర్ణయానికి ఎందుకు వచ్చిండో అర్థం కావట్లేదు. బాలకృష్ణ చిటికలేసి చెప్పిండు. తెలంగాణలో నేనుంట అన్నడు. తెలంగా ణ మొత్తం తిరుగుత అన్నడు. తడాఖా చూపిస్త అన్నడు.
ఏమైందో తెలియదు’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాసాని మాట్లాడుతూ తాను టీడీపీని వదలిపెట్టడానికి గల కారణాలను వివరించారు. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, ఇతర నాయకులు వ్యవహరించిన తీరును సోదాహరణంగా వివరించారు. ‘లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థం కాని పరిస్థితి. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడు. సూర్యచంద్రులకు కూడా దొర కడు. కలుద్దామని 20 సార్లు ఫోన్ చేసిన. కాని ఫోన్ లేపలేదు.
హైదరాబాద్‌లో ఉన్నప్పుడైనా నన్ను పిలిచి మాట్లాడొచ్చు కదా? నాకు తెలంగాణతో సంబంధం లేదు. ఆంధ్రాకే పరిమితం అన్నట్లుగా ఉన్నడు’అని వ్యాఖ్యానించారు. ‘నేను పార్టీ నుంచి నయా పైసా తీసుకోలేదు. నేనే పార్టీకి డబ్బులు ఇచ్చిన. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడికి నెలకు రూ.50వేలు ఇస్తున్న. నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో రూ.11 లక్షలు రామ్మోహన్ రావుకు ఇచ్చిన. అందులో పార్లమెంటు అధ్యక్షులకు రూ. 50 వేల చొప్పున, మిగతా అటెండర్ల కోసం ఇవ్వమని చెప్పిన. కానీ రూ.లక్ష మాత్రమే అటెండర్లకు ఇచ్చిన్రు. మిగతా 10 లక్షలకు ఇప్పటికీ లెక్కలేదు’అని కాసాని చెప్పారు.
గంగలో పోసిన పన్నీరు
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు పడిన కష్టమంతా గంగలో పోసిన పన్నీరుగా మారిందని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపలేదని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా బాబు, లోకేశ్‌ని సంప్రదించినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం బాబు ఆహ్వానించడంతోనే తాను ఆ పార్టీలోకి వెళ్లానని, తనకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో టీడీపీని కాపాడాలని బాబు కోరారన్నారు. బాబు ఆదేశాల మేరకు ఖమ్మంలో భారీ బహిరంగసభ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి వెళ్లి జెండా ఎగరవేశామని, ఇంటింటికి టీటీపీ కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్లినట్లు వివరించారు. 17 పార్లమెంటు స్థానాల్లో కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.
బీసీలకు హామీలు ఇచ్చాం
బీసీలకు అధిక సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావించినప్పటికీ, అటువైపు అడుగులు వేయలేదని కాసాని చెప్పారు. బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చామని, నాయీ బ్రాహ్మణులు, రజకులకు తొలి టికెట్ చంద్రబాబే ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారంతా ఎదురు చూస్తుంటే పోటీ చేయబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం, తెలంగాణలో పోటీకి దూరంగా ఉండటంతో కొంతమంది నేతలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని చెప్పడంతో దూరం పెరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఎన్నికల కోసం బాలకృష్ణ, లోకేశ్‌ను సంప్రదించినా స్పందించలేదని, ఇప్పటికే పోటీ కోసం 30 మందిని ఫైనల్ చేసినా వారికీ బీ–ఫారం ఇవ్వలేదని అన్నారు. కేడర్‌కు అన్యాయం చేయడం తనను కలచివేసిందన్నారు.
పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు?
ఈ శాసనసభ ఎన్నికల్లో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీ చేయాలనుకునే 67 మంది అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు కాసాని చెప్పారు. ఎన్నికల కోసం ఐదేళ్లుగా ఎదురుచూసిన పార్టీ నేతలకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబును శుక్రవారం రాజమహేంద్రవరం జైల్లో కలిసి టీటీడీపీ తరపున పోటీ చేసే అంశం గురించి మాట్లాడితే ‘మనం పోటీ చేయడం లేదు’అని చెప్పారని, దాంతో తనకేం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెడితే పార్టీ తెలంగాణ నాయకులు, కార్యకర్తలంతా పోటీ చేయాల్సిందేనని పట్టుపట్టారని అన్నారు. మీటింగ్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరుకాలేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతున్నందున ఇక టీడీపీలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపాలని తాపత్రయపడుతున్నాయని, రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడమేనని వివరించారు.
ఎన్నికల్లో పోటీ చేయొద్దంటే పార్టీ ఎందుకని ప్రశ్నించారు. పోటీ చేయనప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదనే విషయాన్ని అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. తన కేడర్‌తో మాట్లాడాక భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్న అయన.. కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు చెప్పారు. గతంలోనే బీఆర్‌ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సంప్రదించారని తెలిపారు.
ఏపీలో ఒకలా.. ఇక్కడ ఇంకోలా..
‘టీడీపీ ఇక్కడ పోటీ చేయొద్దనడం వెనుక ఎవరున్నరో గానీ, మన చౌదరీలే కాంగ్రెస్‌కు ఓటేయమని క్లియర్‌గా చెబుతున్నరు. బాబు ను మొన్న కలిసినప్పుడు మన కమ్మ వాళ్లే పోటీ చేయడం లేదని ప్రచారం చేస్తున్నరని క్లియర్‌గా చెప్పిన. టీడీపీ వాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయమని చెబితే ఎట్ల. వీళ్లు ప్రచారం చేసినా.. కొందరే కాంగ్రెస్ అంటున్నరు. మిగతా వాళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటేయాలంటున్నరు.
ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క. జనరల్ ఎన్నికల్లో చేయకపోతే ఎట్ల?’అని కాసాని ప్రశ్నించారు. ‘ఆంధ్రాలోబీజేపీ, జనసేనతో టీడీపీ పోటీ చేస్తదట. తెలంగాణలో బీజేపీ వద్దట. ఇదేం పద్ధతి. ఆంధ్రాలో బీజేపీ, జనసేనతో పోటీ చేసినప్పుడు ఇక్కడ కూడా చేయాలి కదా’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment