ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో ఒక స్పెషాలిటీ ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకు అంతా పచ్చగా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే అంతా ఏడారిలా ఆయనకు అనిపిస్తుంది. తనకు గిట్టకపోతే ఎదుటివారు దెయ్యాలు, భూతాలుగా కనిపిస్తారు. తనకు ఉపయోగపడితే వారు గొప్పవారైపోతారు. ఆయనకు తరచు రెండు కళ్ల సిద్దాంతం గుర్తుకు వస్తుంటుంది. ఏపీతో పాటు తనకు తెలంగాణ కూడా ముఖ్యమేనని ఆయన చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో ఎన్నడూ తెలంగాణలో పార్టీ గురించి పట్టించుకోలేదు. ఆ విషయాన్ని మాజీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎంత స్పష్టంగా చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలి.
అసలు 2023 లో టీడీపీ తరపున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలలో ఎవరిని నిలబెట్టలేదు. తన పార్టీవారు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తిరుగుతున్నా ఆయనకు అభ్యంతరకరంగా తోచలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనకుండా రేవంత్ పేరు చెప్పి మెచ్చుకోవడం గమనించవలసిన అంశమే. బహుశా తెలంగాణ బీజేపీవారికి ఇది ఇబ్బందే అయినా ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో వారు తగవుకు సిద్దపడకపోవచ్చు. తెలంగాణ టీడీపీ సమావేశంలో కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆడిపోసుకోవడం మానలేదు. జగన్ మళ్లీ గెలిచే అవకాశం ఉందని భయపడుతున్నట్లుగా ఉంది. జగన్ భూతమట. పరిశ్రమలు పెట్టేవారికి మళ్లీ జగన్ వస్తే ఎలా అన్న సందేహం ఉందట.
అందుకే ఆ భూతాన్ని రాకుండా చేస్తానని ఈయన చెప్పారట. ప్రతిపక్షంలో ఉన్నవారిని బూతాలతో పోల్చితే ,చంద్రబాబు కూడా మొన్నటివరకు విపక్షనేతగానే ఉన్నారు కదా! నిత్యం ఏపీ లో ఏదో ఒక లొల్లి చేశారు కదా! జగన్ ప్రభుత్వం ఏ అడుగు వేసినా కదలనివ్వకుండా న్యాయ వ్యవస్థ ద్వారా,ఇతరత్రా అడ్డుపడ్డారు కదా!ఎంత వీలైతే అశాంతి సృష్టించే ప్రయత్నం చేశారు కదా. అప్పుడు చంద్రబాబు కూడా బూతం మాదిరే వ్యవహరించారన్న విమర్శ వర్తించదా! ఆయనను అలా అనడం లేదు. కాని చంద్రబాబు మాత్రం జగన్ పై ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అయినా ఆయన గెలిచారు కాబట్టి బూత మాంత్రికుడు అయిపోయారా! ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019 లో ఓటమిపాలైంది కదా! ఆయనను ఓడిస్తే జనం తప్పు చేసినట్లు. జగన్ ను ఓడిస్తే జనం ఒప్పు చేసినట్లు అవుతుందా!ఏమి లాజిక్కు అండి.
చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఎంతగా దూషించారు! ఉగ్రవాది,దేశంలోనే ఉండడానికి వీలులేని వ్యక్తి , అవినీతి పరుడు అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు. మోదీ గెలవడంతోనే చంద్రబాబు మాట మార్చేశారు. 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి కాళ్లావేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కాని ఇప్పుడు ఏమంటున్నారో చూడండి.. బీజేపీవారే పొత్తు పెట్టుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు.మోడీని విశ్వగురు అని ,గొప్ప నాయకుడని ఇదే చంద్రబాబు కీర్తించారు. ఇదేమిటి ఈ రెండు మాటలు ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. చరిత్రను అందరూ చూసినా ,దానిని వక్రీకరించి చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడని గొప్పదనం ఆయనదని అనడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరమా?తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకటికి రెండుసార్లు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇచ్చారు.
తీరా కేంద్రం వాటి ఆధారంగా తెలంగాణ ఏర్పాటుకు సంకల్పించగానే దానిని ఏదో రకంగా అడ్డుకోవడానికి యత్నించారు. తెలంగాణలో మాత్రం తనవల్లే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్నారు.ఏపీ కి వెళ్లేసరికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దెయ్యం,బూతం అయిపోయింది. ఏపీ ని సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ కలుస్తుందని ఎవరూ ఊహించని టైమ్ లో చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో అలయ్ బలయ్ చేసుకుని 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని ఓటమిపాలయ్యారు.
తదుపరి కాంగ్రెస్ ఊసెత్తలేదు. 2023 తెలంగాణ ఎన్నికలలో మాత్రం మళ్లీ కాంగ్రెస్ కు పరోక్షంగా సహకరించారు. అదే టైమ్ లో 2024 ఏపీ శాసనసభ ఎన్నికలలో బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నారు.ఇలా ప్రతి విషయంలోను రెండు కళ్ల సిద్దాంతం పాటించే చంద్రబాబు నాయుడు ,తెలంగాణలో కూడా టీడీపీ అభివృద్ది చెందుతుందని తాజాగా చెబుతున్నారు.మరి గత ఎన్నికలలో ఎందుకు పోటీచేయలేదో మాత్రం చెప్పరు.
బహుశా తన శిష్యుడు ,కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో టీడీపీని తెలంగాణలో పనిచేయించారన్న ప్రచారం జరిగింది.ఈ సంగతి ఎలా ఉన్నా ఏపీ ప్రయోజనాల కన్నా తెలంగాణ మేలు కోసమే ఆయన ఎక్కువ ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో వ్యాఖ్యలు వస్తున్నాయి.అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ కి ఇవ్వవలసిన ఆస్తులను ఇవ్వడానికి నిరాకరించినా చంద్రబాబు నోరు విప్పడం లేదు. పైగా రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సూక్తులు చెబుతున్నారు.
అదే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.వీరిద్దరూ కలిసి మాట్లాడినా కుమ్మక్కైపోయారని,ఏపీ కి జగన్ నష్టం చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపించేవారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో పెట్టుబడి పెడతామని కెసిఆర్ ప్రతిపాదిస్తే, జగన్ పోర్టును కేసీఆర్‌కు అమ్మేస్తున్నారని గగ్గోలు పెట్టారు.
కాని చిత్రంగా అంతకన్నా ఎక్కువగా రేవంత్ ఏకంగా కోస్తా తీరంలోను, తిరుమల తిరుపతి దేవస్థానంలోను వాటా అడిగితే, ఆయన బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఏపీలో కొత్త పరిశ్రమలు అనేకం రావడానికి వీలుగా జగన్ పలు చర్యలు తీసుకుంటే ఆయనను బూతం అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇదేనా అభివృద్ది కొనసాగించడమంటే.ఈనాడు మీడియాలోనే మూడున్నర లక్షల కోట్ల రూపాయల రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్లు ఏపీ లో వస్తున్నాయని అంగీకరిస్తూనే , వాటిని ఏడుగురు బడా పారిశ్రామికవేత్తలకే కట్టబెడుతున్నారంటూ ఒక తప్పుడు కధనాన్ని ప్రచారం చేసింది. ఏపీకి ఏ పరిశ్రమ వస్తున్నా ఆ రోజులలో ఎలా చెడగొట్టాలా అని చంద్రబాబుకు మద్దతు ఇచ్చే మీడియా విశ్వయత్నం చేసేది.బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ తెచ్చినందుకు జగన్ బూతం అవుతారా?అదాని ,అంబాని వంటి పెద్ద,పెద్ద పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వ టైమ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే జగన్ బూతం అవుతారా? శ్రీసిటీలో ఎసిలు తయారు చేసే పరిశ్రమ వచ్చింది.
నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు రంగం సిద్దం అయింది. అచ్చుతాపురం పారిశ్రామికవాడలో పలు పరిశ్రమలు వచ్చాయి.అంతెందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరసగా మూడేళ్లపాటు దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిపినందుకు జగన్ బూతం అవుతారా?మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం అంతా జరుగుతున్న నెల రోజులకు పైగా విద్వంసాన్ని చూసి పరిశ్రమలవారు భయపడుతున్నారని వార్తలు వచ్చాయి. పుంగనూరులో విద్యుత్ బస్ ల ప్లాంట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్న యాజమాన్యం టీడీపీవారి అరాచకాలను చూసి ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారట.పుంగనూరులో ఏకంగా ఒక ఇండోర్ స్టేడియంనే కూల్చేసిన ఘన చరిత్ర టీడీపీదిగా ఉంది. విశాఖలో ఒక ప్రముఖ ఐటి సంస్థ కాప్ జెమినీ రాబోతుందన్న కొద్ది నెలల క్రితం వార్తలు వచ్చాయి. టీడీపీ అధికారంలోకి రావడంతోనే వారు చెన్నైకి వెళ్లిపోయారట. వీటన్నిటికి కారణబూతమైన టీడీపీవారు బూతాలు కాదట. విశాఖ వద్ద జగన్ మంచి భవనం కడితే తప్పు.
అదే అమరావతిలో చంద్రబాబు భారీ వ్యయంతో భవనాలు నిర్మిస్తే గొప్ప విషయం. రాష్ట్రం ఆర్దిక సుడిగుండంలో ఉందని పదే,పదే ప్రచారం చేస్తున్నారు. అంటే తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు మంగళం పాడడానికే ఈ గాత్రం అందుకున్నారని జనం అంతా భావిస్తున్నారు. తాను ప్రభుత్వాన్ని నడిపితే తెల్లవార్లు కష్టపడుతున్నట్లు,ఎదుటివారు ప్రభుత్వాన్ని నిర్వహిస్తే అసలు పని చేయనట్లు ప్రొజెక్టు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడు. దానికి తోడు ఆయనకు భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండడం బాగా కలిసి వచ్చే పాయింట్ అని చెప్పక తప్పదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా,ఏపీ గురించి చంద్రబాబు దృష్టి పెట్టి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. అలాకాకుండా బూతాలు,దెయ్యాలు అంటూ ఎంతగా మంత్రాలు చదివితే అంతగా ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని అంతా అర్ధం చేసుకుంటారు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment