రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, వందల సంఖ్యలో ప్రచార సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ ‘టేకాఫ్’ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ పార్టీ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వీటిని అద్దెకు తీసుకునేందుకు సై అంటున్నారు.
ఒత్తిడి లేకుండా, వేగవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో అద్దె హెలికాప్టర్లకు ఎన్నికల వేళ గిరాకీ జోరందుకుంటుంది. గంటల వ్యవధిలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లి పలు ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉండటం కూడా నేతలను గాల్లో చక్కర్లు కొట్టేలా చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్
అద్దె లక్షల్లోనే...
బ్లేడ్ ఇండియా, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్విసెస్, జెట్‌సెట్‌గో వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకు ఇస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా కూడా హెలికాప్టర్లతో సహా వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా బెల్ 407, ఎయిర్‌బస్ హెచ్125, హెచ్130 వంటి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారు. ఇందులో అయిదుగురు ప్రయాణించవచ్చు. సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు రూ.1.5 లక్షల నుంచి ఉంటుంది. రెండు ఇంజిన్ల సామర్థ్యం ఉంటే రూ.2.75 లక్షల వరకు అవుతుంది.
జాతీయ పార్టీల నుంచి డిమాండ్..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, స్టార్ క్యాంపెనర్లతో తెలంగాణలో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అద్దె హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి హెలిక్టాపర్ల అద్దెకు అభ్యర్థనలు వస్తున్నాయని ఓ సంస్థ ప్రతినిధిని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తమ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని ప్రచారం సాగించారని తెలిపారు. తెలంగాణలోనూ ఇరు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండటం వల్ల ఇక్కడ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
డీజీసీఏ మార్గదర్శకాలు తప్పనిసరి..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన నిబంధనలను ఆపరేటర్లు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందే. పైగా ఎన్నికల సమయంలో ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్ లేదా విమానంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వీఐపీ విమానాలను నడిపే పైలట్‌లు ని ర్మిష్ట రకం విమానం లేదా హెలికాప్టర్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఫ్లయింగ్ గంటల అనుభవాన్ని కలిగి ఉండాలి.
అద్దె ఖర్చు ఎవరి ఖాతాలో..
హెలికాప్టర్ అద్దెలపై కూడా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయినర్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తే అభ్యర్థి పేరు తీసుకోకుండా లేదా అభ్య ర్థితో వేదికను పంచుకోకుండా ప్రసంగాలు చేస్తే అప్పుడు ఆ ఖర్చు మొత్తం పార్టీపైనే పడుతుంది. ఒకవేళ అభ్యర్థి పేరుతో ప్రచారం చేస్తే గనుక అప్పుడు ఆ వ్యయం పార్టీ, అభ్య ర్థికి చెరి సగం పడుతుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. సొంతంగా హెలికాప్టర్లు ఉన్న వారి ప్రయాణ సమయం, అద్దెను అభ్యర్థుల ఖర్చుగా పరిగణిస్తారు.
ప్రచార రథాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలను రూపొందించే సిబ్బందికి, వాహనాలకు, డ్రైవర్‌లకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పార్టీల జెండాలు, బ్యానర్లను తయారు చేసే టైలర్‌లకు సైతం భారీ గిరాకీ వచ్చింది. ఉప్పల్, చర్లపల్లి తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెడీమేడ్ దుస్తులను తయారు చేసే పలు కంపెనీల్లోని కుట్టుమిషన్‌లపైన ఇప్పుడు పార్టీల జెండాలు రెడీ అవుతున్నాయి.
అంబర్‌పేట్ పటేల్‌నగర్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల్లోనూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలను, బ్యానర్లను తయారు చేసే మహిళా టైలర్‌లకు డిమాండ్ వచ్చేసింది. తాత్కాలికంగా అయినా ఇప్పుడు ఇది ఓ కుటీర పరిశ్రమగా మారినట్లు పటేల్‌నగర్‌కు చెందిన బాలమణి తెలిపారు. రోజుకు 250 నుంచి 300 వరకు బ్యానర్లు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రిని తయారు చేస్తున్నామని చెప్పారు.
ప్రచార రథాలకు మేకప్....
నేతలు ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వాహనాల కోసం వినియోగించే టాటా, మహీంద్ర వాహనాలకు డిమాండ్ వచ్చేసింది. అభ్యర్థుల కటౌట్‌లు, బ్యానర్లు తదిర హంగులతో ప్రచార రథాలుగా తీర్చిదిద్దేందుకు కా ర్మికులు, టెక్నీషియన్‌లు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. మూసారాంబాగ్, ఇందిరాపార్కు, తదితర ప్రాంతాల్లో ప్రచార ర«థాల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment