
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/మోర్తాడ్(బాల్కొండ)/సాక్షిప్రతినిధి,కరీంనగర్/ నిర్మల్: తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని, ఎవరో ఒకరు గెలుస్తారని... కానీ మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను నిర్ణయిస్తుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, వాళ్ల మంచి చెడులు విచారించి, ఏపార్టీకి ఓటేస్తే లాభమో, ఏ ప్రభుత్వం ఏర్పడితే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఒక్క చాన్స్ అంటూ వస్తున్న వారిని నమ్మితే అంతేనని.. పంటికి కూడా తగలకుండా మింగేస్తారని వ్యాఖ్యానించారు. తాను చెప్పిన విషయంపై గ్రామాలకు వెళ్లిన తర్వాత లోతుగా చర్చించాలని కోరారు. నిర్మల్, బాల్కొండ, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ కోసం నేను 24 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నా. 14 ఏళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన. మరో పదేళ్లపాటు తెలంగాణ అభివృద్ధి కోసం మమేకమైన. ఇప్పుడు దుష్టశక్తుల నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు మీరే కొట్లాడాలి. ప్రజలు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల మంచి చెడులను విచారించాలి. ఆగం కావొద్దు. నేను మాట్లాడిన మాటలు ఇక్కడనే విడిచిపెట్టొద్దు. మీ గ్రామాలకు వెళ్లిన తర్వాత చర్చ పెట్టాలి. ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలవాలి.
ఈ ప్రజాస్వామ్య దేశంలో మీ దగ్గరున్న విలువైన వజ్రాయుధం ఓటు. పోటీచేసే ప్రతి అభ్యర్థి గుణగణాలు, ఆయా పార్టీల చరిత్ర, నడవడిక, దృక్పథం మీద చర్చ జరగాలి. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కర్ఫ్యూ లేదు. మత కల్లోలాలూ లేవు. అలాంటిది బీఆర్‌ఎస్ అభ్యరి్థ, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపైనే కాంగ్రెస్ కత్తుల దాడి జరిగింది. వాళ్లు దుర్మార్గమైన సంస్కృతిని తయారు చేస్తున్నారు. కేసీఆర్ ప్రాణంతో ఉన్నంత వరకు తెలంగాణలో శాంతిభద్రతలు ఉంటాయి.
నెహ్రూ కాలం నుంచే దృష్టిపెట్టి ఉంటే..
కాంగ్రెస్ హయాంలో దళిత సమాజం అణచి వేయబడింది. వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. నెహ్రూ కాలం నుంచే వీరి సంక్షేమంపై దృష్టిపెట్టి ఉంటే దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదు. అసలు దళితబంధు అనే పథకాన్ని పుట్టించినదే బీఆర్‌ఎస్ పార్టీ. దళిత సమాజాన్ని ఉద్ధరించాలన్నదే మా లక్ష్యం. ఏ ప్రధాని, సీఎం కూడా దళితబంధు లాంటి ఆలోచన చేయలేదు. గిరిజనులకూ పోడు పట్టాలు ఇవ్వడంతోపాటు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం.
కరెంటు, నీళ్లు, రైతుబంధు..
నీటి తీరువా రద్దుచేశాం. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. పండిన పంటనూ ప్రభుత్వమే కొంటుంది. రైతు రుణమాఫీ అందరికీ వస్తుంది. ఒకప్పుడు అంజుమన్ బ్యాంక్ అప్పులు బాకీ ఉంటే రైతుల ఇండ్ల తలుపులు గుంజుకుపోయేవారు. అలాంటి పరిస్థితులు రాకుండా, రైతుల బాధలు తీర్చాలని రైతుబంధు అమలు చేస్తున్నాం. ఇదేదో ఎలక్షన్ల కోసం చేయలేదు. నాకు రైతుబంధు పెట్టాలని ఎవరైనా దరఖాస్తు ఇచ్చారా? ఉద్యమం చేశారా? నా అంతట నేను రైతు నాయకులు, మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకున్నా. దాని ఫలితం తెలంగాణ ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నది.
కాంగ్రెస్‌కు ఓటేస్తే పెద్ద పాము మింగినట్టే!
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ అంటూ వస్తోంది. ఇంతకుముందు 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు వారు ఏంచేశారో ప్రజలు ఆలోచన చేయాలి. అన్నిరంగాల సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు ఓటేస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే. కాంగ్రెస్ నేతలు పంటికి కూడా తగలకుండా మింగేస్తారు.
ప్రజల పన్నులను దుబారా చేస్తూ రైతుబంధు ఇస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు వృధా, మూడు గంటలు ఇస్తే చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ధరణి పోర్టల్ వద్దంటున్నారు. ధరణిని రద్దుచేస్తే మళ్లీ పైరవీకారుల దందాలు షురూ అవుతాయి. ధరణి పోర్టల్ తీసివేస్తే రైతుబంధు, వడ్ల డబ్బులు ఎట్లా ప్రజల ఖాతాల్లోకి రావాలి?
పదేళ్లలో నంబర్ వన్‌గా నిలిచాం
గత పదేళ్లలో దేశంలో తెలంగాణ అన్ని విషయాల్లో నంబర్ వన్‌గా నిలిచింది. తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉంది. త్వరలోనే మిగులు విద్యుత్ సాధించబోతున్నాం. బీఆర్‌ఎస్ గెలిస్తే రైతుబీమా తరహాలో రాష్ట్రంలో రేషన్‌కార్డున్న 93 లక్షల కుటుంబాలకు రూ.5లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తాం.
ఒకవేళ కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు అధికారంలోకి వచ్చినా రైతుబంధుకు రాంరాం పలుకుతారు. దళితబంధుకు జైభీం చెప్తారు. కరెంట్ కట్ చేస్తారు. ఇచ్చే కొంచెం కూడా పగలు, రాత్రి సరఫరా చేస్తారు. కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నారు. ఏది మంచో, ఏది చెడో రైతులు తేల్చుకోవాలి.
మోటార్లకు మీటర్లు పెట్టేదేలేదని చెప్పిన
ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చిపట్టింది. విమాన రంగం, రైల్వేలు, విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటు బాట పట్టించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తే.. చావడానికైనా సిద్ధమేగానీ మీటర్లు పెట్టనని చెప్పిన. మనకు రావాల్సిన రూ.25వేల కోట్ల నిధులకు కేంద్రం కోత పెట్టినా మీటర్లు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్ సీఎం బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. వాళ్ల మాటలు వింటే నెత్తి పగలగొట్టుకోవాలి అనిపిస్తుంది.
ఆ నియోజకవర్గాలకు హామీలు
బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జేఎన్టీయూతో మాట్లాడి నిర్మల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను 70వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గం అంతా దళితబంధు అమలు చేస్తామన్నారు. నిర్మల్ సభలో ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్, ధర్మపురి సభలో కొప్పుల ఈశ్వర్, బాల్కొండ సభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.