తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇంకా సిద్ధపడటం లేదా! టీడీపీని, బీజేపీని జత చేయాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయబారం అంత సఫలం కాలేదనే అనుకోవాలా? ప్రస్తుతానికైతే అలాంటి అభిప్రాయమే ఏర్పడుతోంది. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఆలోచించడమే విడ్డూరమనిపిస్తోంది. ఏపీలో అనైతిక పొత్తుకు తెరదీసిన జనసేనతో కలిసి తెలంగాణలో బీజేపీ ఎలా కలిసి వెళ్తుందన్నది ఆశ్చర్యంగానే ఉంటుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ పరిణామంతో తెలంగాణలో ఏదో జరిగిపోతోందని ఎవరూ అనుకోలేదు కానీ, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వస్తుందన్న చర్చ జరిగింది. ఎలాగోలా బీజేపీతో కలవాలని, తద్వారా తమపై వచ్చిన అవినీతి కేసుల నుంచి బయటపడాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అండగా నిలుస్తున్న పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు వంటి వాటిని పట్టించుకోకుండా సమర్థిస్తున్న తీరు జనసేన వర్గాలకే మింగుపడటం లేదు. తాను ఎన్డీయేలో ఉన్నప్పటికీ, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ దానిని పక్కనబెట్టి పవన్ టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు.
పెళ్లి ఒకరితో, కాపురం మరొకరితో అన్నట్లు ఏపీ రాజకీయాల్లో పవన్ వ్యవహరిస్తున్నా, బీజేపీ పెద్దగా ఫీల్ కాకుండా ఆయనతో తెలంగాణలో పొత్తు కోసం చర్చలు జరిపింది. ఆ క్రమంలో ఆయన అమిత్ షా వద్దకు తీసుకెళ్లాలని కోరారట. దాంతో కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ షాతో జరిపిన చర్చల్లో ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయంట కానీ, జనసేన, టీడీపీ కలిసి ఏపీలో పనిచేస్తున్న విషయం ప్రస్తావనకు రాలేదట. ఇది ఈనాడు పత్రికలో రాసిన కథనంలోని ఒక అంశం. దీనిని ఎవరైనా నమ్ముతారా? తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు గురించి మాత్రమే చర్చకు వచ్చిందట. అందులో సీట్ల బేరసారాలు సాగాయి.
వాటిని రాష్ట్రస్థాయిలో తేల్చుకోండని అమిత్ షా వారిని పంపించేశారు. ఏపీలో చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయి జైల్లో ఉన్న విషయం సహజంగానే ప్రస్తావనకు వచ్చి ఉండాలి. అందులో తమ ప్రమేయమేమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని షా చెప్పి ఉండాలి. ఏపీ రాజకీయాలకు లింక్ పెట్టి తెలంగాణలో పొత్తు కుదుర్చుకోవాలన్న పవన్ వ్యూహం అంత సఫలమైనట్లు లేదు. అందుకే పవన్, మనోహర్ ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారనిపిస్తుంది. తదుపరి కిషన్‌రెడ్డి.. టీడీపీతో పొత్తు గురించి మాట్లాడుతూ ఆ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి కాదని తేల్చేశారు. నిజంగానే బీజేపీ పొత్తు పెట్టుకోదలిస్తే క్షణాల్లో టీడీపీని ఎన్డీయేలో చేర్చుకున్నట్లు ప్రకటించేది కదా!
అయితే కొద్దికాలం క్రితం టీడీపీ నేత లోకేశ్ తాము ఎన్డీయేకి, ఇండియా కూటమికి సమదూరంలో ఉన్నామని ప్రకటించారు. దాంతో బీజేపీ ఈ విషయంలో చొరవ చూపడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమవుతుందోగానీ, ఇప్పటికైతే టీడీపీతో పొత్తుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సిద్ధపడట్లేదని స్పష్టమవుతోంది. తెలంగాణలో కూడా టీడీపీని తోడు తీసుకెళ్లాలని అనుకున్న పవన్ వ్యూహం బెడిసినట్లుంది.
అదే సమయంలో సొంతంగా పోటీ చేస్తామని మొదట బెదిరించిన టీడీపీ ఆ తర్వాత తోక ముడిచిందన్న వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేనతో పొత్తు అని చెప్పినప్పటికీ అమిత్ షా పాల్గొన్న సూర్యాపేట సభలో పవన్ కళ్యాణ్ లేదా ఆయన పార్టీ నేతలు పాల్గొనకపోవడం కూడా గమనించాల్సిన అంశమే. ఒకపక్క పొత్తు కుదిరిందని చెబుతారు. మరోవైపు ఎడమొహంగా, పెడమొహంగా ఉంటున్నారు.
బీజేపీకి ఏమైనా కలిసొస్తుందా?
ఇక, తెలంగాణలో పవన్ కల్యాణ్ వల్ల బీజేపీకి ఏమైనా కలిసొస్తుందా అన్న చర్చ ఉంది. ఆయా చోట్ల జన సమీకరణకు పవన్ కల్యాణ్ ఉపయోగపడొచ్చు. ఎందుకంటే ఆయన సినీ నటుడిగా ఉన్నారు కనుక. కానీ ఓట్లు, విజయావకాశాలను ఎంతవరకు ప్రభావితం చేయగలర్నది చర్చనీయాంశమే. తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్లలో కాపు వర్గాన్ని, తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు వర్గాన్ని, సినిమాల పరంగా ఆయనకు ఉన్న అభిమానులను ఆకర్షించడానికి బీజేపీ పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చి ఉండొచ్చు.
మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు ఏపీలో ఉన్నందున, కొంతమంది పవన్ అభిమానులు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండటానికీ ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు. టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్‌కు సాయపడుతున్న నేప«థ్యంలో బీజేపీ ఆ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని టీడీపీతో స్నేహానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు.
ఆంధ్ర పార్టీతో పొత్తుపై మళ్లీ అదే అస్త్రమా?
గత ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బాగా నష్టపోయింది. ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్ పొత్తేమిటని బీఆర్‌ఎస్ వ్యతిరేక ప్రచారం చేసింది. ఈసారి పవన్, బీజేపీ కలిస్తే ఆ సమస్య ఎలా ఉంటుదన్నది చూడాలి. సహజంగానే బీఆర్‌ఎస్ ఈ పరిణామాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అవసరమైతే మళ్లీ అదే అ్రస్తాన్ని ప్రయోగించవచ్చు. కాకపోతే జనసేనకు టీడీపీకి ఉన్నంత బలం లేనందున అంత సీరియస్‌గా కూడా తీసుకోకపోవచ్చు.
ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ ఇచ్చే ఎనిమిదో పదో సీట్లకు జనసేన అంగీకరిస్తుందా? లేదా? అన్నది కూడా చూడాలి. అమిత్ షా వరకు వెళ్లాక ఆ విషయంలో పట్టుబడతారా అన్నది అనుమానమే. బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికే గతంలో జనసేన 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించింది. అది కొంత ఫలించి బీజేపీ చర్చలు జరిపి, అమిత్ షా వరకు తీసుకువెళ్లింది.
కాగా జనసేనతోపాటు టీడీపీని బీజేపీతో కలపడానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కొంత ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏపీ రాజకీయాలు. బీజేపీ ఉద్దేశం పవన్‌ను తెలంగాణలో ఉపయోగించుకోవడం. పవన్ కళ్యాణ్ రాయబారం ఫలించలేదు గానీ, బీజేపీ చెప్పినట్లు పవన్ వినక తప్పని పరిస్థితి ఏర్పడిందా అన్న సందేహం వస్తుంది.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment