అధికారంలోకొస్తే ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్‌  | Minority Declaration issued by TCongress | Sakshi
Sakshi News home page

అధికారంలోకొస్తే ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్‌ 

Published Fri, Nov 10 2023 4:43 AM | Last Updated on Thu, Nov 23 2023 11:34 AM

Minority Declaration issued by TCongress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచి్చంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, సీడబ్ల్యూసీ సభ్యులు నాసిర్, షకీల్‌ ఆహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్‌ అహ్మద్‌ తదితరులు మైనారిటీ డిక్లరేషన్‌  విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ అధికార బీఆర్‌ఎస్‌ మెప్పు కోసం క్రికెట్‌ దిగ్గజం అజహరుద్దీన్‌ను జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఓడించేందుకు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బాధ్యత తీసుకున్నాడని ఆరోపించారు.

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో పోటీ చేయని మజ్లిస్‌ ఈసారి అజహరుద్దీన్‌పై ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపడం వెనుక మైనారిటీ ఓట్లు చీల్చే కుట్ర కనిపిస్తోందని దుయ్యబట్టారు. అలాగే మైనారిటీ పక్షపాతినని చెప్పుకొనే సీఎం కేసీఆర్‌ తమ పార్టీ నేత షబ్బీర్‌ అలీ పోటీ చేసే కామారెడ్డి స్థానం నుంచి కూడా పోటీ చేయడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే గోషామహల్‌లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై గెలవాలని రేవంత్‌ సవాల్‌ చేశారు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే మైనారిటీ డిక్లరేషన్‌లోని హమీల అమలు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజహరుద్దీన్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు జాఫర్‌ జవీద్, కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీతారావ్‌ తదితరులు పాల్గొన్నారు. 
కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌లోని హామీలు... 

► మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ను రూ. 4,000 కోట్లకు పెంచడంతోపాటు నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి ఏటా రూ.1,000 కోట్ల కేటాయింపు. 

► 6 నెలల్లోగా కులగణన చేపట్టి విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనారిటీలు సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చర్యలు.  

► అబ్దుల్‌ కలాం తౌఫా–ఎ–తలీమ్‌ పథకం కింద ఎంఫిల్‌ పూర్తి చేస్తున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం. పీహెచ్‌డీ, అదనంగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వారికి రూ. లక్ష, గ్రాడ్యుయేష¯న్‌కు రూ. 25,000, ఇంటర్‌కు రూ.15,000, 10వ తరగతి పాసైన వారికి రూ. 10,000 ఆర్థిక చేయూత. 

► తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు. 

► మైనారిటీ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ. 

► మసీదుల ఇమామ్‌లు, మౌజమ్‌లు, దర్గాల ఖాదీమ్‌లు, చర్చి పాస్టర్లులకు నెలకు రూ. 10,000 నుంచి 12,000 వరకు గౌరవ వేతనం. 

► వక్ఫ్‌ బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వాదీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్‌. 

► ముస్లిం, క్రిస్టియన్‌ శ్మశానవాటికల కోసం భూకేటాయిపు. 

► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు. 

► కొత్తగా పెళ్లయిన ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీ జంటలకు రూ. 1,60,000 ఆర్థిక చేయూత. 

► కులీ కుతుబ్‌ షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సెట్విన్‌ల బలోపేతం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement