ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. యువత ముందుకొచ్చి ఓటు వేయడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. అయితే ఈసారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల యువరక్తం.. పైగా కొత్త ముఖాలు.. అందునా సీనియర్లతో పోటాపోటీకి సిద్ధం కావడం గమనార్హం.
కార్నె శిరీష(బర్రెలక్క) :
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్నె శిరీష(బర్రెలక్క) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో చిన్నవయస్కురాలైన అభ్యర్థిగా ఈమెకు ఓ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష.. నామినేషన్ మొదలు నుంచి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఆమె వర్గం దాడి జరిగాక.. ఆ చర్చ తారాస్థాయికి చేరింది. చివరాఖరికి హైకోర్టు సైతం ఆమెకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ సుధాకర్ లాంటి సీనియర్లను ఈమె ఢీ కొడుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం!
మామిడాల యశస్వినీరెడ్డి:
ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో అత్యంత యువ అభ్యర్థి యశస్విని కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీ(26) పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. అత్త ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ విషయంలో పౌరసత్వ అభ్యంతరాలు తలెత్తడంతో.. కోడలు యశస్వినీకి ఆ అవకాశం దక్కింది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. నాన్ లోకల్ అనే ప్రత్యర్థి ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. పాలకుర్తిలో గెలుపుపై యశస్విని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి: ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ
మైనంపల్లి రోహిత్‌రావు:
మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్(27). మెదక్ జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిచెసిన రోహిత్ తన తండ్రి.. ఆయన అనుచర గణం అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ పేరిట కరోనా టైంలో అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి లాంటి సీనియర్‌తో పోటీకి రోహిత్ సిద్ధం అయ్యారు.
ఇదీ చదవండి: మెదక్‌లో మళ్లీ పాతయుద్ధమేనా?
ఉషా దాసరి:
ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉషా దాసరి (27).. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. కలెక్టర్ కావాలనే కలని సైతం పక్కన పెట్టి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నెలకొల్పి.. ఉచిత ట్యూషన్‌లతో స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారీమె. దాసరి మనోహర్‌తో పాటు చింతకుంట విజయరమణారావులాంటి సీనియర్ల నడుమ పోటీకి నిలిచారు.
ఇదీ చదవండి: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ
వీళ్లేకాదు.. మిరియాల రామకృష్ణ(28) జనసేన అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల.. పువ్వాడ అజయ్‌లాంటి వారితో పోటీ పడుతుండగా.. అలాగే ములుగు నుంచి సీతక్కకు పోటీగా బీఆర్‌ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతి(29) ఎన్నికల బరిలో దిగి యువసత్తా చాటాలని చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment