గత హామీలు ఏమయ్యాయి? | Kishan Reddy Fires On CM KCR And BRS | Sakshi
Sakshi News home page

గత హామీలు ఏమయ్యాయి?

Published Mon, Oct 16 2023 4:42 AM | Last Updated on Mon, Oct 16 2023 4:42 AM

Kishan Reddy Fires On CM KCR And BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఓట్ల కోసం మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన హామీలు విస్మరించి ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు కొత్తవి ప్రకటించారని మండిపడ్డారు. వందల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, కేసీఆర్‌ సకల జనుల ద్రోహి అని దుయ్యబట్టారు.

ఆదివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై స్పందించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో కేసీఆర్‌ బయట పెట్టి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ అమలు చేయలేదన్నారు. అప్పులు పెంచారు.. అవినీతి పెంచారు.. అహంకారం పెంచుకున్నారు తప్ప.. రాష్ట్ర సంపద పెంచలేదని విమర్శించారు.  

పెట్రోల్‌పై పన్ను తగ్గించని ఏకైక రాష్ట్రం 
కేసీఆర్‌ మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అప్పులపాలు చేసి భ్రష్టు పట్టించారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్‌ మీద కేంద్రం తమకు వచ్చే ఆదాయం తగ్గించుకొని ట్యాక్స్‌ తగ్గిస్తే... అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలిసి కొంత పన్ను తగ్గించాయి. పన్ను తగ్గించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. ‘24 జిల్లా కేంద్రాల్లో నిమ్స్‌ స్థాయిలో 24 ఆస్పత్రులు కడతామని హామీ ఇచ్చి ఒక్కటీ కట్టలేదు.

మూడెకరాల సాగు భూమి, దళితులకు 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు, సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించకుండా చూడటం, మహిళా బ్యాంకులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, జర్నలిస్టుల సంక్షేమ నిధి లాంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. మూతపడ్డ కంపెనీలు తెరుస్తామని ఒక్కటీ తెరవలేదు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు ఇండ్రస్టియల్‌ కారిడార్‌ అన్నారు.. అది ఎక్కడ పోయింది?’ అని కిషన్‌రెడ్డి నిలదీశారు. 

గ్రాఫిక్స్‌ చూపెట్టి మభ్యపెట్టారు 
‘ప్రతి ఊరిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ.. ప్రతి గ్రామంలో ఇంటర్నెట్‌.. హామీలు ఏమయ్యాయి? కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామాలకు రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, పునరుజ్జీవనం చేస్తామన్నారు.. ఏదీ లేదు.. హైదరాబాద్‌ ఉత్తరాన విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తది అటుంచితే.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు ల్యాండ్‌ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆకాశ హరŠామ్యలు.. గ్రాఫిక్స్‌ చూపెట్టి ప్రజలను మభ్యపెట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌.

ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి తప్పించుకోవడానికి మూసీకి ఒక కార్పొరేషన్, రోడ్లకు ఒక కార్పొరేషన్‌.. హుస్సేన్‌ సాగర్‌కు ఒక కార్పొరేషన్‌.., వాటర్‌కు ఒక కార్పొరేషన్, కాళేశ్వరంకు ఒక కార్పొరేషన్‌.. ఇలా లెక్కలేనన్ని కార్పొరేషన్లు చేస్తున్నారు. అనేక కార్పొరేషన్లు పెట్టి నాబార్డు, బ్యాంకుల్లో విచ్చలవిడిగా అప్పులు చేశారు’ అని కిషన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా.. తెలంగాణను ఉద్ధరిస్తామని మళ్లీ మేనిఫెస్టో తెచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వడ్డీలకే పోతోందన్నారు. ప్రభుత్వ చేతగానితనంతో, పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేక.. నోటిఫికేషన్లు వాయిదా పడుతుంటే.. దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు.  

బెస్ట్‌ కరప్షన్‌ ఫ్యామిలీ పాలసీ 
‘బెస్ట్‌ ఎకనమికల్‌ పాలసీ అని కేసీఆర్‌ అంటున్నాడు... అది బెస్ట్‌ కాదు.. వరస్ట్‌ ఎకనామికల్‌ పాలసీ. పవర్‌ పాలసీ బెస్ట్‌ పాలసీ అని అన్నడు.. అది బెస్ట్‌ కాదు.. డేంజర్‌ పవర్‌ పాలసీ. రూ.45 వేల కోట్ల అప్పులతో డిస్కంలు, విద్యుత్‌ వ్యవస్థ కుప్పుకూలిపోయే స్థితిలో ఉన్నది. బెస్ట్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పాలసీ అట.. అది బెస్ట్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పాలసీ కాదు.. బెస్ట్‌ లిక్కర్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పాలసీ. బెస్ట్‌ ఇరిగేషన్‌ పాలసీ అన్నడు.. అది బెస్ట్‌ కమీషన్‌ ఇరిగేషన్‌ పాలసీ. అత్యుత్తమ దళిత పాలసీ అని కేసీఆర్‌ అంటున్నాడు.. కానీ కేసీఆర్‌ బెస్ట్‌ కరప్షన్‌ ఫ్యామిలీ పాలసీ, చీటింగ్‌ పాలసీ అమలుచేస్తున్నాడు’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement