ఆమనగల్‌లో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘సీఎం కేసీఆర్ సింహంలాంటి వాడు. సింహం సింగిల్‌గానే వస్తుంది. తోడేళ్లే మందలు మందలుగా వస్తాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా.. చివరికి తెలంగాణలో గెలిచేది కేసీఆరే..’’అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం షాద్‌నగర్ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం కొనసాగుతోందన్నారు.
‘‘బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులను మోహరిస్తే.. కాంగ్రెస్ నుంచి సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే,రాహుల్‌గాందీ, ప్రియాంక గాంధీ తిరుగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ప్రజలకు జూటా మాటలు చెప్తున్నారు. ఒక్క బక్కపల్చని కేసీఆర్‌ను ఓడించేందుకు ఇంత మంది రావాల్నా? ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడబోతోంది.
కేసీఆరే తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు..’’అని చెప్పారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ వాళ్లు డబ్బు సంచులతో తిరుగుతున్నారని.. వాళ్లు పంచే డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం కారు గుర్తుపై వేయాలని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. గత పాలనలో రెండు, మూడు గంటలకు మించి కరెంట్ ఉండేది కాదని.. తెలంగాణ వచ్చాక 24 గంటలు ఇస్తున్నామని వివరించారు.
బీజేపీ నేతలు పోటీకి భయపడుతున్నారు
రాష్ట్రంలో బీజేపీ ఎత్తిపోయిందని.. ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పోటీకి భయపడుతున్నారన్నారు. ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలని.. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్ కావాలో, బతుకులను చీకట్లోకి నెట్టే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కల్వకుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్, షాద్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment