సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది.
వారు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. మిగతా అభ్యర్థులకు సంబంధించి పరిశీలన పూర్తిచేసి.. ఆదివారం సాయంత్రానికి 55 మంది పేర్లతో అధికారికంగా తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. తొలి జాబితా దాదాపు ఖరారైనా జాప్యం కావడం వెనుక.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంగా పునరాలోచన చేయడం, కొందరు అటూ, ఇటూ మారే అవకాశం ఉండటమే కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ రెండో జాబితా వెలువడితే.. అవకాశం దక్కనివారు బీజేపీ వైపు చూడవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయని అంటున్నాయి.
అభ్యర్థులు, సీట్ల మార్పుతో..
అధికార బీఆర్‌ఎస్ నెలన్నర ముందే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు చాలా మందికి బీ ఫారాలు కూడా అందజేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసి, మిగతా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి అభ్యర్థులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఈ నెల 15 లేదా 16న తొలి జాబితా ఉంటుందని ముఖ్యనేతలు ప్రకటించినా విడుదల చేయలేదు.
శనివారానికి దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని.. 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందని పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇందులోని దాదాపు 15 వరకు స్థానాల్లో అభ్యర్థుల మార్పు, నేతలు పోటీకి సుముఖత వ్యక్తం చేయని చోట్ల ఇతరులను ఎంపిక చేయాల్సి రావడంతో ప్రకటన ఆగిపోయినట్టు తెలిసింది.
ఫోన్ చేసి సమాచారమిస్తూ..
అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం.
సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
అభ్యర్థుల తీరు ఎలా ఉంది?
ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు (కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ మినహా), ఇద్దరు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావులకు తొలి జాబితాలోనే అవకాశం కల్పించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్‌తోపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ రెండు చోట్లా ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపుతున్నట్టు సమాచారం. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసి, ఆయనకు అదే స్థానంలో పోటీ చేసే అవకాశంపై ఢిల్లీలో చర్చ జరిగినట్టు తెలిసింది.
అయితే దీనిపై స్పష్టత రాలేదు. మరోవైపు చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ధర్మపురి నుంచి ఎస్.కుమార్‌ల పేర్లు ఖరారయ్యాయని.. అయితే వివేక్ ధర్మపురి నుంచి పోటీకి మొగ్గుచూపుతుండటంతో కుమార్‌ను చెన్నూరుకు మార్చడంపై ఆలోచన జరుగుతోందని సమాచారం. ఇదే జరిగితే ఈ రెండు సీట్ల అభ్యర్థులు మారనున్నారు. మరోవైపు కాంగ్రెస్ మలివిడత జాబితా ఇంకా ప్రకటించనందున.. ఒకవేళ అక్కడ టికెట్లు దక్కని బలమైన నాయకులు, బీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులు బీజేపీలోకి వచ్చే అవకాశాలను కూడా ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
జనసేన పొత్తులపై అస్పష్టత
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో తెలంగాణలో బీజేపీ పొత్తుపై ప్రచారం జరిగినా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ జరిపిన చర్చల్లో రాష్ట్రంలో బీజేపీకి మద్దతివ్వాలని, పోటీ ఆలోచనను విరమించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ భేటీల్లో చర్చ జరిగినా.. ఇరువైపుల నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
నెలాఖరులోగా మిగతా జాబితాలు
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాతీయ నేతలతో రాష్ట్ర ముఖ్య నేతలు చర్చించారు. అభ్యర్థుల పేర్లపై ప్రాథమిక పరిశీలన పూర్తి చేశారు. ఇందులో ఒక్కరే బలమైన అభ్యర్థులున్న సీట్లు, ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలు కలిపి 55 సీట్లలో అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని నేతలు వెల్లడించారు.
ఆదివారం సాయంత్రానికల్లా ఈ 55 మందితో జాబితా వెలువడే అవకాశం ఉందని తెలిపారు. నెలాఖరులోగా మిగతా అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించనున్నట్టు వెల్లడించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల కంటే అధికంగా బీసీలు, మహిళలు, యువతకు సీట్లు కేటాయించేలా కసరత్తు జరిగిందని వివరించారు.
ఎడతెగని ఉత్కంఠ
Published Sun, Oct 22 2023 3:46 AM | Last Updated on Sun, Oct 22 2023 7:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment