ప్రజలకు ఏం కావాలో గ్రహించలేదా? | Sakshi Guest Column On Telangana Assembly Elections | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఏం కావాలో గ్రహించలేదా?

Published Thu, Oct 12 2023 12:59 AM | Last Updated on Thu, Oct 12 2023 12:59 AM

Sakshi Guest Column On Telangana Assembly Elections

తెలంగాణకు ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 30న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. పార్టీలు సైతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 15న మేనిఫెస్టోను విడుదల చేస్తామని అధికార బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఇంకా కసరత్తు జరుగుతున్నదని కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్నది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని బీజేపీ పేర్కొంటున్నది. దీంతో ప్రజలకు ఏం కావాలో ప్రధాన పార్టీలు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్య మున్నా ఎన్నికల కదన రంగంలో మాత్రం కాంగ్రెస్‌ ముందుగానే దూకిందని చెప్పాలి. గత మేలో వరంగల్‌లో రాహుల్‌ గాంధీతో సభ నిర్వహించి ‘రైతు డిక్లరేషన్‌’ను ‘హస్తం’ పార్టీ ప్రకటించింది. అధికా రంలోకి వస్తే రైతులకు ఏమేం చేసేదీ దాంట్లో పేర్కొన్నది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, యూత్‌ డిక్లరేషన్లను ప్రకటించింది. దీంతోపాటు మహిళలు, బీసీలు తదితరులపై డిక్లరేషన్లను ప్రకటించడానికి సిద్ధమవుతున్నది.

మరోవైపు ‘ఆరు గ్యారెంటీ’ల పేరుతో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు విస్తృతంగా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. అయితే మేనిఫెస్టోను ఇప్పటికీ ఎందుకు ఫైనల్‌ చేయడం లేదనే ప్రశ్న ఉత్పన్న మవుతున్నది. శ్రీధర్‌ బాబు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇంకెంత కాలం అభిప్రాయాలను సేకరిస్తుందోననే అనుమానం కాంగ్రెస్‌ కార్యకర్తల్లోనే ఉంది.  

అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్‌ఎస్‌ ఇప్పటికీ తన మేనిఫెస్టోను విడుదల చేయలేదు. అయితే అక్టోబర్‌ 15న రిలీజ్‌ చేస్తామని ఇటీవల తేదీని నిర్ణయించింది. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయింది. దీంతో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తే బడ్జెట్‌ సెట్‌ చేయడం కష్టమేనని బీఆర్‌ఎస్‌కు అనుభవ పూర్వకంగా తెలిసొచ్చిందనిపిస్తోంది. ‘గృహలక్ష్మి’, బీసీ, మైనార్టీలకు ‘చేయూత’ లాంటి స్కీమ్స్‌ను లేటుగా అయినా ప్రవేశపెట్టి అమలు ప్రారంభించి తాము ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నామనే సంకేతాన్ని పంపడానికి ప్రయత్నించింది.

అయితే తూతూమంత్రంగా అమలు చేయడంతో వీటి వల్ల ప్రజల్లో పార్టీ పట్ల పాజిటివిటీ రాలేదు. మరోవైపు కాంగ్రెస్‌ హామీల వర్షం కురిపిస్తుండడంతో తప్పని సరిగా మేనిఫెస్టోలో పలు హామీలను చేర్చేందుకు బీఆర్‌ఎస్‌ రెడీ అయినట్లు తెలుస్తున్నది. మహిళల కోసం బీఆర్‌ఎస్‌ తెచ్చే స్కీమ్‌ ప్రతిపక్షాల మైండ్‌ బ్లాక్‌ చేస్తుందని మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రభావంతోనే అని అర్థమవుతోంది.

కర్ణాటక ఎలక్షన్స్‌ కంటే ముందు తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. అయితే కన్నడ ఓటర్లు బీజేపీని తిరస్కరించడంతో తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగింది. మరోవైపు బండి సంజయ్‌ను స్టేట్‌ చీఫ్‌ పదవి నుంచి తొలగించడంతో బీజేపీ పతనం మొదలైంది. మేనిఫెస్టో తయారీని కూడా ఆ పార్టీ లైట్‌ తీసుకుంటున్నట్లు అర్థమవుతున్నది. తాము ఉచితాలకు వ్యతిరేకమని ఇప్పటికే పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. సంక్షేమమే తమ ధ్యేయ మనేది వారి మాట. 

దీంతో బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజల్లోనూ ఆసక్తి కనిపించడం లేదు. షెడ్యూల్‌ రావడానికి ఐదు రోజుల ముందు మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలో ‘మేనిఫెస్టో కమిటీ’ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని బండి సంజయ్‌ ప్రకటించారు. ఇది నోటిమాటగానే తప్ప దీన్ని ఎలా అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. దశా బ్దాలుగా ప్రజలను పాలించిన, పాలిస్తున్న పార్టీలు ప్రజలకు ఏం కావాలో ఇప్పటికీ గ్రహింపు లేక పోవడం విడ్డూరంగానే ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. 
ఫిరోజ్‌ ఖాన్‌ 
వ్యాసకర్త సీనియర్‌ ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌
మొబైల్‌: 96404 66464

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement