
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నల్లగొండ జిల్లా మునుగోడులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని 10 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తరువాత సభ ప్రారంభం కానుంది. సభకు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ఒక్కో గ్రామం నుంచి 500 మందిని తరలించేలా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వాహనాలను సిద్ధం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా 2022 అక్టోబర్ 30న చండూరు మండలం బంగారిగడ్డలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మునుగోడును కడుపులో పెట్టి చూసుకుంటానని ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, డిమాండ్లను నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. ఇచ్చిన హామీల్లో రోడ్లు, చండూరు రెవెన్యూ డివిజన్, 100 పడకల ఆసుపత్రి వంటి డిమాండ్లు నెరవేరాయి. చౌటుప్పల్ ఆసుపత్రి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
గ్రామాల్లోన్లూ దాదాపు రూ.500 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే కృష్ణా జలాల విషయంలో న్యాయ వివాదాల కారణంగా సాగునీటి సమస్య అలాగే ఉంది. రిజర్వాయర్ల పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ నేపథ్యంలో మునుగోడు నుంచి మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. మునుగోడులో 30 పడకల ఆసుపత్రి, ఇంటర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. దీంతో గురువారం నాటి సభలో సీఎం కేసీఆర్ ఏం హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.