ప్రధాని మోదీ బీసీ అంటూ..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘బీజేపీ జెండా.. బీసీలకు అండ’ నినాదంతో ముందుకెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. బీసీ అయిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారని.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, గతంలో కర్ణాటక సీఎంగా పనిచేసిన బీఎస్ యడ్యూరప్ప తదితరులు వెనుకబడిన వర్గాల వారేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర పార్టీలోనూ బీసీ నేతలకు కీలక పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ బీసీలకు అండగా నిలిచేది, అవకాశాలు ఇచ్చేది బీజేపీనే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తు న్నట్టు వివరిస్తున్నారు. బీసీల ఓటును కూడగట్టడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ రూట్‌లో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిస్తూ కొత్త ప్రయోగానికి దారులు వేస్తోంది. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం, అధికారంలో తగిన వాటా, గుర్తింపుతోపాటు అన్ని కలసి వస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఆ వర్గాలకు చెందిన వారినే కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేకపోవడంతో.. ఎన్నికల సమరం ముగిసేదాకా బీసీ సీఎంను ప్రకటించడం జరగకపోవచ్చని ఆ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. ఎస్సీ 19, ఎస్టీ 12 రిజర్వ్‌డ్ సీట్లు పోగా, మిగతా 88 సీట్లలో 40కిపైగా సీట్లను బీసీలకు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి.
వెనుకబడిన వర్గాలను ఆకర్షించేలా..
రాష్ట్ర జనాభాలో 50శాతానికిపైగా బీసీలు ఉండటంతోపాటు ఎస్సీ, ఎస్టీలనూ కలిపితే 85శాతానికి పైగా వెనుకబడిన వర్గాల వారే ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ వర్గాల ఓట్లను సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్ రెండూ అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉన్నాయని.. వాటిలో ఏది అధికారంలోకి వచ్చినా బీసీలకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. వారు బీసీని సీఎం చేయడం కాదుగదా.. కేబినెట్‌లోనూ తగిన అవకాశాలు కల్పించడం కష్టమేనని చెప్తున్నారు.
ఆ పార్టీలు ఇటు రాష్ట్రస్థాయిలో, అటు జాతీయ స్థాయిలో ఎక్కడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని పేర్కొంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచాక టీఆర్‌ఎస్ కేబినెట్లలో బీసీవర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించిన దాఖలాలు లేవని.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన వాటా కల్పించలేదని విమర్శిస్తున్నారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కల్పన, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర పథకాలు సరిగా అమలు కాలేదని.. బీసీ బంధు అమలు కూడా నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించేలా ప్రచారం చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని చెప్తున్నారు. బీసీలలో బీజేపీ పట్ల విశ్వాసాన్ని కల్పించేలా అసెంబ్లీ ఎన్నికల్లో 40కిపైగా సీట్లు కేటాయించాలని నిర్ణయానికి వచ్చారని వివరిస్తున్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవకాశాలు వివరిస్తూ..
బీసీల కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోదీ సారథ్యంలో.. కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీలకు ప్రాతినిధ్యం, దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీసీల కోసం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు.. చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన ఎంబీసీల కోసం పీఎం విశ్వకర్మయోజన పథకం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, సదుపాయాల కల్పన వంటివి చేపట్టినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు.
ఈ చర్యల ద్వారా జాతీయ స్థాయిలో బీసీల మద్దతు కూడగట్టగలిగామని.. తెలంగాణలోనూ ఈ ఎజెండాతో ముందుకు తీసుకెళ్లాలని నాయకత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. ఇక రాష్ట్ర పార్టీలోనూ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ ఎంపీగా కె.లక్ష్మణ్‌కు అవకాశం కల్పించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం, అధ్యక్ష పదవి మార్పు తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం, బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌కు పార్టీ చేరికల కమిటీ కన్వీనర్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియామకం, ఎంపీగా ధర్మపురి అర్వింద్‌కు అవకాశం వంటి వాటిని వివరిస్తున్నారు.
బీసీ నేతలను ముందు నిలిపి..
ఇప్పటికే రాష్ట్రంలో బీసీలను ఆకట్టుకునేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణను లక్ష్మ ణ్, సంజయ్, ఈటల తదితరులకు బీజేపీ అప్పగించింది. ఆయా కుల సంఘాలు, వర్గా ల వారీగా పార్టీ సదస్సులు, సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు బీసీ నేతలను ముందు నిలిపి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీసీ వర్గాలకు జరిగిన అన్యాయం, వారు నిర్లక్ష్యానికి గురైన తీరును గణాంకాలతో సహా ప్రజలకు వివరించాలని.. ఇదే సమ యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment