BC CM
-
బీజేపీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి, రెండు సభల్లో పాల్గొననున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఏయే అంశాలపై మాట్లాడుతారు, ఏ హామీలిస్తారన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ తరఫున బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని, ఎస్సీ వర్గీకరణ అంశానికీ మద్దతు ప్రకటించవచ్చని నేతలు అంటున్నారు. ఈ నెల 7న సాయంత్రం 5.30గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బీసీ గర్జనసభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తే పార్టీ తరఫున సీఎం అయ్యే బీసీ నేత పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న దశలో బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీకి అనుకూలంగా బీసీల మద్దతు కూడగట్టవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఎమ్మార్విఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగల ఆత్మగౌరవసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ జాతీయ, రాష్ట్ర పార్టీలు ఇప్పటికే మద్దతును ప్రకటించిన నేపథ్యంలో.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోపాటు రాష్ట్రంలో ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని మోదీ హామీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. 7న మోదీ షెడ్యూల్ ఇదీ.. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు యూపీ నుంచి వైమానికదళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి వస్తారు. 5.30 గంటల నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటల సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. -
బీసీ ‘కమలం’!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కర్ణాటక ఎన్నికలకు ముందు కొంతకాలంపాటు అది రెండో స్థానంలో ఉన్న భావన కనిపించింది. రాష్ట్రంలో ఉన్న బలమైన పునాది కారణంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఉత్తేజంతో వేగంగా కోలుకొని, బీజేపీని వెనక్కు నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇంకొన్ని ఇతర కారణాలు కూడా ఈ పరిణామానికి దోహదపడి ఉండవచ్చు. ఇప్పుడున్న వరసక్రమం – బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇదే క్రమం కొనసాగుతుందా? కచ్చితంగా చెప్పడం కష్టం. వరస మారడానికి అవకాశాలు పుష్కలం. గడచిన కొన్నేళ్లుగా బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ సంచలనాలను గమనంలోకి తీసుకుంటే ఆ పార్టీ మన అంచనాలను తలకిందులు చేయగల అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయ లేము. ఇంతకుముందు రెండుసార్లు (1998, 2019) జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓట్లను తెలంగాణలో సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ పూర్తిగా చతికిలబడుతూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచీ కూడా మన దగ్గర ముఖాముఖి పోటీలకే ప్రాధాన్యత లభించడం చూస్తున్నాం. 1978లో రెడ్డి కాంగ్రెస్, 2009లో ప్రజా రాజ్యం బలంగా ముందుకొచ్చినా ఇరవై శాతం ఓట్లను దక్కించుకోలేదు. ఒక్క టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో మూడో పక్షానికి ఆదరణ లభించడం మొదలైంది. గత రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ పోలింగ్ నాటికి బలంగా ముందుకు రాగల అవకాశాలున్నాయని గుర్తించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండుమార్లు ఇరవై శాతానికి పైగా ఓట్లు సాధించిన అనుభవాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ ఓట్లు రాబట్టడం కష్టం కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ముక్కోణ పోటీ పరిస్థితుల్లో తమ మూడో కోణాన్ని బీసీ కోణంగా మలచడం ద్వారా సంచలనం సృష్టించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు సమాచారం. అధికార బీఆర్ఎస్కు వందమందికి పైగా సిటింగ్ ఎమ్మెల్యేలున్న కారణంగా టిక్కెట్ల పంపిణీలో ప్రయోగాలు చేసే అవకాశం దానికి లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది. 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు వెలువడుతున్న సూచనలను బట్టి ఆ పార్టీ మాట నిలబెట్టుకునే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తున్నది. టిక్కెట్లు ఇవ్వక పోగా బీసీ నాయకుల పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఈసడింపు ధోరణితో వ్యవహరిస్తున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజుల క్రితం రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మవారి ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడానికి వెళ్లింది. ఆగమేఘాల మీద వారికి పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు లభించాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి తమ వర్గానికి ఉన్నదనీ, కనీసం పది సీట్లయినా తమకు కేటాయించాలని కోరారట! ఆరు స్థానాల వరకు కేటాయించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలొ చ్చాయి. రెండు శాతం జనాభా గల బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ఆరు సీట్లు ఆఫర్ చేసిన అధిష్ఠానం 54 శాతం జనాభా గల తమకెంత రాచమర్యాదలు చేస్తుందోనని ఊహించుకుని బీసీ నేతలు కొందరు ఢిల్లీ బాట పట్టారు. వారం రోజులపాటు ఢిల్లీ ఫుట్‌పాత్‌ల మీద కాలక్షేపం చేయడం తప్ప వీరికి అగ్రనేతల దర్శనభాగ్యం మాత్రం లభించలేదు. నానా తంటాలు పడి కాళ్లావేళ్ళా పడ్డ మీదట కేసీ వేణుగోపాల్ అనే ప్రధాన కార్యదర్శి ఓ పది నిమిషాలు టైమిచ్చాడట! ఇద్దరు మాజీ ఎంపీలు, ఇతర కీలక బాధ్యతలు వెలగబెట్టిన ప్రముఖ బీసీ నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండానే వేణుగోపాల్ విరుచుకు పడ్డాడని సమాచారం. ‘మీకు టిక్కెట్లిస్తే గెలవరు. మీలో పెద్దపెద్ద నాయ కులకు సైతం డిపాజిట్లు రావు. పార్టీ గెలవాలని ఉందా? లేదా? గెలవాలనుకుంటే సర్దుకుపొండి’ అంటూ విసుక్కున్నాడట! పొన్నాల లక్ష్మయ్యను సస్పెండ్ చేసి పారేస్తానని కూడా వేణుగోపాల్ హెచ్చరించాడట! అదృష్టవశాత్తు ఈ బృందంలో పొన్నాల లేడు. బృంద సభ్యులు అవమాన భారంతో తలలు వంచుకొని వెనుదిరగడం తప్ప మాట్లాడే అవకాశం మాత్రం లభించలేదు. 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని నిన్న పొన్నాల తెంచే సుకున్నారు. అవమాన భారంతో గుండె మండిపోయిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుని అపాయింట్ మెంట్ కోసం ఏడాది పాటు ప్రయత్నించినా పొన్నాలకు చేదు అనుభవమే మిగిలిందని ఆయన అనుచరులు వాపోయారు. ఢిల్లీలో పది రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగినా పొన్నాలకు ఏ నాయకుడి అపాయింట్‌మెంటూ దొరకలేదు. అమెరికాలో ఉన్నతో ద్యోగం చేస్తూ 1980లోనే ఇండియా వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి పొన్నాల. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పన్నెండేళ్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌కు మొట్ట మొదటి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తికి జరిగిన సత్కారాన్ని చూసి పార్టీలోని బీసీ నేతలు ఖిన్నులవుతున్నారు.కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకులకు ఫోన్లు చేసి మరీ ‘ఈ పార్టీలో బీసీలకు భవిష్యత్తు లేదు. బీజేపీలోకో, బీఆర్ఎస్లోకో వెళ్లండ’ని సీనియర్ బీసీ నేతలు సలహా ఇస్తున్నారు. ఈ రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవా లని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 54 శాతం జనాభా ఉన్న బీసీ బాణాన్ని తన ప్రధానాస్త్రంగా ప్రయోగించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నది. దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ తమదేనని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కె. లక్ష్మణ్ గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేయడమే గాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చాకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించారు. దేశవ్యాప్తంగా పదమూడు మంది మాత్రమే ఉండే ఈ బోర్డులో స్థానం దక్కడం ఒక అరుదైన గౌరవం. మొన్నటివరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈటల రాజేందర్‌కు ప్రధానమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి లభించింది. ఈటల ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభ విజయం సాధించడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆరేడు స్థానాల్లో బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది. అంటే అక్కడ పార్టీ మొదటి స్థానంలో ఉన్నట్టు లెక్క. మరో పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు ఆ పార్టీ భావిస్తున్నది. నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు అదనపు ఓట్లను పొందగలిగితే ఈ రెండో స్థానం సీట్లను గెలవగలుగుతుంది. ఎకాయెకిన అన్ని ఓట్లను అదనంగా సంపాదించే మార్గం బీసీ మంత్రమేనన్న అభిప్రాయంతో బీజేపీ వ్యూహం రూపొంది స్తున్నట్టు తెలుస్తున్నది. వ్యూహం ఫలిస్తే బీజేపీ ఖాతాలో పాతిక సీట్లు పడతాయి. పాతిక సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన గేమ్ తన చేతిలోనే ఉంటుందని దాని అంచనా. మెజారిటీ స్థానాల్లో పార్టీ మూడో స్థానంలోనే ఉన్నందువల్ల ప్రయోగాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. బలంగా ఉన్న 25 సీట్లతోపాటు మిగిలిన అన్రిజర్వ్డు సీట్లతో కలిపి నలభై స్థానాలకు పైగా బీసీలకు కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా. మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిలో ఎన్నడూ లేనివిధంగా 27 మంత్రి పదవులూ, పార్టీ పరంగా సంస్థా గత పదవులతోపాటు ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన పార్టీగా ప్రచారం చేసుకుని బీసీ ఓటర్లలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో జనసంఖ్య పరంగా వరసగా ముదిరాజ్ – గంగపుత్ర, యాదవ – కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, వడ్డెర బలమైన కులాలు. ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం, పలుకుబడి ఉన్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్లను అధికంగా కేటాయించడం ద్వారా మిగిలిన కులాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. యాదవ కులానికి చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాధారణంగా సామాజిక వర్గాలను ఆకర్షించడానికి రెండు మూడు నెలల ముందు చేసే ప్రయత్నాలు ఫలించవు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని అనుకూలంగా మలచు కోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. పొన్నాల రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించిన తీరు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు శాతం జనాభా గల అగ్రవర్ణానికి అడిగిందే తడవుగా అగ్రనేతల అపాయింట్మెంట్ లభించడం, బీసీ వర్గాల్లో దశాబ్దాల అనుభవం గల నాయకులకు కూడా దర్శనం దొరక్క పోవడంపై విస్తృతంగా చర్చ జరుగు తున్నది. ఈ చర్చ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
TS Politics: బీసీ రూట్లో బీజేపీ!
ప్రధాని మోదీ బీసీ అంటూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘బీజేపీ జెండా.. బీసీలకు అండ’ నినాదంతో ముందుకెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. బీసీ అయిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారని.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, గతంలో కర్ణాటక సీఎంగా పనిచేసిన బీఎస్ యడ్యూరప్ప తదితరులు వెనుకబడిన వర్గాల వారేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర పార్టీలోనూ బీసీ నేతలకు కీలక పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ బీసీలకు అండగా నిలిచేది, అవకాశాలు ఇచ్చేది బీజేపీనే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తు న్నట్టు వివరిస్తున్నారు. బీసీల ఓటును కూడగట్టడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ రూట్లో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిస్తూ కొత్త ప్రయోగానికి దారులు వేస్తోంది. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం, అధికారంలో తగిన వాటా, గుర్తింపుతోపాటు అన్ని కలసి వస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఆ వర్గాలకు చెందిన వారినే కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేకపోవడంతో.. ఎన్నికల సమరం ముగిసేదాకా బీసీ సీఎంను ప్రకటించడం జరగకపోవచ్చని ఆ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. ఎస్సీ 19, ఎస్టీ 12 రిజర్వ్డ్ సీట్లు పోగా, మిగతా 88 సీట్లలో 40కిపైగా సీట్లను బీసీలకు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. వెనుకబడిన వర్గాలను ఆకర్షించేలా.. రాష్ట్ర జనాభాలో 50శాతానికిపైగా బీసీలు ఉండటంతోపాటు ఎస్సీ, ఎస్టీలనూ కలిపితే 85శాతానికి పైగా వెనుకబడిన వర్గాల వారే ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ వర్గాల ఓట్లను సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్ రెండూ అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉన్నాయని.. వాటిలో ఏది అధికారంలోకి వచ్చినా బీసీలకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. వారు బీసీని సీఎం చేయడం కాదుగదా.. కేబినెట్లోనూ తగిన అవకాశాలు కల్పించడం కష్టమేనని చెప్తున్నారు. ఆ పార్టీలు ఇటు రాష్ట్రస్థాయిలో, అటు జాతీయ స్థాయిలో ఎక్కడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని పేర్కొంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచాక టీఆర్ఎస్ కేబినెట్లలో బీసీవర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించిన దాఖలాలు లేవని.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన వాటా కల్పించలేదని విమర్శిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కల్పన, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర పథకాలు సరిగా అమలు కాలేదని.. బీసీ బంధు అమలు కూడా నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించేలా ప్రచారం చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని చెప్తున్నారు. బీసీలలో బీజేపీ పట్ల విశ్వాసాన్ని కల్పించేలా అసెంబ్లీ ఎన్నికల్లో 40కిపైగా సీట్లు కేటాయించాలని నిర్ణయానికి వచ్చారని వివరిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవకాశాలు వివరిస్తూ.. బీసీల కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోదీ సారథ్యంలో.. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలకు ప్రాతినిధ్యం, దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీసీల కోసం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు.. చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన ఎంబీసీల కోసం పీఎం విశ్వకర్మయోజన పథకం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, సదుపాయాల కల్పన వంటివి చేపట్టినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ చర్యల ద్వారా జాతీయ స్థాయిలో బీసీల మద్దతు కూడగట్టగలిగామని.. తెలంగాణలోనూ ఈ ఎజెండాతో ముందుకు తీసుకెళ్లాలని నాయకత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. ఇక రాష్ట్ర పార్టీలోనూ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ ఎంపీగా కె.లక్ష్మణ్‌కు అవకాశం కల్పించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం, అధ్యక్ష పదవి మార్పు తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌కు పార్టీ చేరికల కమిటీ కన్వీనర్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియామకం, ఎంపీగా ధర్మపురి అర్వింద్‌కు అవకాశం వంటి వాటిని వివరిస్తున్నారు. బీసీ నేతలను ముందు నిలిపి.. ఇప్పటికే రాష్ట్రంలో బీసీలను ఆకట్టుకునేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణను లక్ష్మ ణ్, సంజయ్, ఈటల తదితరులకు బీజేపీ అప్పగించింది. ఆయా కుల సంఘాలు, వర్గా ల వారీగా పార్టీ సదస్సులు, సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు బీసీ నేతలను ముందు నిలిపి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీసీ వర్గాలకు జరిగిన అన్యాయం, వారు నిర్లక్ష్యానికి గురైన తీరును గణాంకాలతో సహా ప్రజలకు వివరించాలని.. ఇదే సమ యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను భావిస్తోంది. -
బీజేపీ నినాదం.. బీసీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని వివిధ స్థాయిలలో ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరిపినట్టు, ఈ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. గత శుక్రవారం కోర్ కమిటీ భేటీ, శనివారం మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, గత మూడేళ్ల కాలంలో పార్టీలో చేరిన ముఖ్య నేతల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీల్లో బీసీ నినాదాన్ని తెరపైకి తేవడంతో పాటు బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు సమాచారం. ఈ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, పార్టీ ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఒకవేళ బీఆర్ఎస్, కాంగ్రెస్సుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా అగ్రవర్ణాల వారే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ.. బీసీ వాదంతో, ముఖ్యంగా బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థిని కూడా ముందే ప్రకటిస్తే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని పలువురు సూచించినట్లు తెలిసింది. కుల సంఘాల వారీగా సమావేశాలు ఎన్నికల సందర్భంగా బీసీ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను కదిలించగల, బీసీ సామాజికవర్గాల్లో పట్టున్న బలమైన నేతను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలనే సూచనలు పెద్దెత్తున వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టేలా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని జాతీయ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించినట్టు సమాచారం. అన్ని సామాజికవర్గాల మద్దతు కూడగట్టేలా వివిధ కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే అంశాన్ని, రాష్ట్రంలో కూడా ప్రజలు అధికారంలోకి తెస్తే.. ‘డబుల్ ఇంజన్ సర్కార్’తో కలిగే ప్రయోజనాలను.. ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఈ వ్యూహాలకు తుదిరూపం ఇవ్వడంలో భాగంగా వచ్చేనెల తొలి 15 రోజుల్లో జిల్లాల వారీగా ఆయా రంగాల నిపుణులు, సామాజికవేత్తలు, కుల సంఘాల ప్రముఖులను సంప్రదించాలని, బీజేపీ బీసీ ఎజెండాను వారి ముందుంచి సహకరించాల్సిందిగా కోరనున్నట్టు పార్టీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఊపునిచ్చేలా పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 100 రోజుల ప్రణాళికపై ముమ్మర కసరత్తు వచ్చే వందరోజుల కాలానికి చేపట్టే కార్యాచరణపై కసరత్తు నిమిత్తం పార్టీ నేతలు విజయశాంతి, చాడ సురేష్‌రెడ్డి, డా.జి.మనోహర్‌రెడ్డిలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, ముఖ్యమైన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోవడం, తదితర అంశాలతో ఈ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెలలో చేరికలపై స్పష్టత... బీసీ వాదం, ఇతరత్రా రూపాల్లో జోరందుకునేలా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వచ్చే నెలలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి చేరికలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల వివిధ స్థాయి నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ సందర్భంగా.. ముందుగానే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం లేదా ఆ స్థానంలో పని చేసుకోవాల్సిందిగా సంబంధిత నేతకు సంకేతాలివ్వడం మంచిదనే సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చేరికలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చాక అభ్యర్థుల ప్రకటన కసరత్తు చేపట్టి, త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో వీటిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి, గెలిచే అవకాశాలున్న నేతలు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ఎవరైనా విజయావకాశాలున్న నేత బీజేపీలోకి వస్తారా? వారిని చేర్చుకునేందుకు ఏం చేయాలన్న దానిపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
ఆయన ఓటమికి పరోక్షంగా ప్రయత్నాలు
-
బీసీలకే అధికారం రావాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడిన బీసీలకే రాజ్యాధికారం రావాలే తప్ప దొరలు, పెత్తందార్లకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనను తెలంగాణ టీడీపీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లింను డిప్యూటీ సీఎంను చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు తానే సీఎం కావాలంటున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం ఏనాడు తెలంగాణ కోసం పోరాడలేదని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని అన్నారు. ప్రాణాలు వదిలింది కూడా బీసీలేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని బీసీని చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. సీఎంగా తాను మాత్రమే తెలంగాణను అభివృద్ధి చేశానని చెప్పారు. ‘దేవాదుల కట్టాను. మాధవరెడ్డి కాలువ, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులన్నీ నేనే నిర్మించా. స్కూళ్లు, హాస్పిటళ్లు, రోడ్లు నేనే వేయించా. నా వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చింది. సింగపూర్ 50 ఏళ్లలో అభివృద్ధి జరిగితే తొమ్మిదేళ్లలో సైబరాబాద్ నిర్మించా. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తా. ఖమ్మంతో పాటు ప్రతి జిల్లాను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతా’ అని హామీల వర్షం కురిపించారు. బాంచెన్ నీకాల్మొక్త దొరా అనేది తెలంగాణలో పోవాలన్నదే నా కల అని అది బీసీ ముఖ్యమంత్రితోనే సాధ్యమవుతుందన్నారు. ఇక నుంచి ఎన్నికలయ్యేంత వరకు కాపురాలు మానేసి ఇంటింటికి తిరిగి కేసీఆర్ దుకాణం బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ అదిలాబాద్ జిల్లాకు చెందిన అల్లూరి శోభారాణి తదితరులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమేశ్ రాథోడ్, అరవింద్‌కుమార్ గౌడ్, ఎగ్గె మల్లేశం పాల్గొన్నారు. చంద్రబాబుతో శైలజానాథ్ భేటీ మాజీ మంత్రి శైలజానాథ్.. చంద్రబాబుతో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం శైలజానాథ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎంతో కాలం నుంచి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఆయన చంద్రబాబుతో భేటీ అయి ఇదే అంశంపై చ ర్చించినట్లు సమాచారం. శైలజానాథ్ మాత్రం బాబును కలవలేదని చెప్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా చంద్రబాబును కలిసినట్లు సమాచారం. -
సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తారా?
హైదరాబాద్: తెలంగాణలో ఓటమి ఖాయమని తెలిసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ మంత్రం జపిస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు జూపల్లి కృష్ణారావు అన్నారు. ఓటమి భయంతోనే బీసీ సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర అవినీతిమయం అని జూపల్లి ఆరోపించారు. పదేళ్లగా చంద్రబాబు కోలుకోవడం లేదన్నారు. పార్టీని విలీనం చేయలేదంటూ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను విమర్శించే అర్హత తెలంగాణ కాంగ్రెస్ నేతలకెక్కడదని దుయ్యబట్టారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.