
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని వివిధ స్థాయిలలో ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరిపినట్టు, ఈ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. గత శుక్రవారం కోర్ కమిటీ భేటీ, శనివారం మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, గత మూడేళ్ల కాలంలో పార్టీలో చేరిన ముఖ్య నేతల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ భేటీల్లో బీసీ నినాదాన్ని తెరపైకి తేవడంతో పాటు బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు సమాచారం. ఈ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్, పార్టీ ఎన్నికల సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
ఒకవేళ బీఆర్‌ఎస్, కాంగ్రెస్సుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా అగ్రవర్ణాల వారే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ.. బీసీ వాదంతో, ముఖ్యంగా బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థిని కూడా ముందే ప్రకటిస్తే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని పలువురు సూచించినట్లు తెలిసింది.
కుల సంఘాల వారీగా సమావేశాలు
ఎన్నికల సందర్భంగా బీసీ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను కదిలించగల, బీసీ సామాజికవర్గాల్లో పట్టున్న బలమైన నేతను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలనే సూచనలు పెద్దెత్తున వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టేలా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని జాతీయ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించినట్టు సమాచారం.
అన్ని సామాజికవర్గాల మద్దతు కూడగట్టేలా వివిధ కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే అంశాన్ని, రాష్ట్రంలో కూడా ప్రజలు అధికారంలోకి తెస్తే.. ‘డబుల్ ఇంజన్ సర్కార్’తో కలిగే ప్రయోజనాలను.. ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
ఈ వ్యూహాలకు తుదిరూపం ఇవ్వడంలో భాగంగా వచ్చేనెల తొలి 15 రోజుల్లో జిల్లాల వారీగా ఆయా రంగాల నిపుణులు, సామాజికవేత్తలు, కుల సంఘాల ప్రముఖులను సంప్రదించాలని, బీజేపీ బీసీ ఎజెండాను వారి ముందుంచి సహకరించాల్సిందిగా కోరనున్నట్టు పార్టీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఊపునిచ్చేలా పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
100 రోజుల ప్రణాళికపై ముమ్మర కసరత్తు
వచ్చే వందరోజుల కాలానికి చేపట్టే కార్యాచరణపై కసరత్తు నిమిత్తం పార్టీ నేతలు విజయశాంతి, చాడ సురేష్‌రెడ్డి, డా.జి.మనోహర్‌రెడ్డిలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, బీఆర్‌ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, ముఖ్యమైన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోవడం, తదితర అంశాలతో ఈ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలిసింది.
వచ్చే నెలలో చేరికలపై స్పష్టత...
బీసీ వాదం, ఇతరత్రా రూపాల్లో జోరందుకునేలా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వచ్చే నెలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి చేరికలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల వివిధ స్థాయి నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ సందర్భంగా.. ముందుగానే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం లేదా ఆ స్థానంలో పని చేసుకోవాల్సిందిగా సంబంధిత నేతకు సంకేతాలివ్వడం మంచిదనే సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే చేరికలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చాక అభ్యర్థుల ప్రకటన కసరత్తు చేపట్టి, త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో వీటిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి, గెలిచే అవకాశాలున్న నేతలు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ఎవరైనా విజయావకాశాలున్న నేత బీజేపీలోకి వస్తారా? వారిని చేర్చుకునేందుకు ఏం చేయాలన్న దానిపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment