సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడిన బీసీలకే రాజ్యాధికారం రావాలే తప్ప దొరలు, పెత్తందార్లకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనను తెలంగాణ టీడీపీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లింను డిప్యూటీ సీఎంను చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు తానే సీఎం కావాలంటున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం ఏనాడు తెలంగాణ కోసం పోరాడలేదని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని అన్నారు. ప్రాణాలు వదిలింది కూడా బీసీలేనని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని బీసీని చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. సీఎంగా తాను మాత్రమే తెలంగాణను అభివృద్ధి చేశానని చెప్పారు. ‘దేవాదుల కట్టాను. మాధవరెడ్డి కాలువ, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులన్నీ నేనే నిర్మించా. స్కూళ్లు, హాస్పిటళ్లు, రోడ్లు నేనే వేయించా. నా వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చింది. సింగపూర్ 50 ఏళ్లలో అభివృద్ధి జరిగితే తొమ్మిదేళ్లలో సైబరాబాద్ నిర్మించా. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకొని గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తా. ఖమ్మంతో పాటు ప్రతి జిల్లాను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతా’ అని హామీల వర్షం కురిపించారు. బాంచెన్ నీకాల్మొక్త దొరా అనేది తెలంగాణలో పోవాలన్నదే నా కల అని అది బీసీ ముఖ్యమంత్రితోనే సాధ్యమవుతుందన్నారు. ఇక నుంచి ఎన్నికలయ్యేంత వరకు కాపురాలు మానేసి ఇంటింటికి తిరిగి కేసీఆర్ దుకాణం బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ అదిలాబాద్ జిల్లాకు చెందిన అల్లూరి శోభారాణి తదితరులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమేశ్ రాథోడ్, అరవింద్‌కుమార్ గౌడ్, ఎగ్గె మల్లేశం పాల్గొన్నారు.
చంద్రబాబుతో శైలజానాథ్ భేటీ
మాజీ మంత్రి శైలజానాథ్.. చంద్రబాబుతో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం శైలజానాథ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎంతో కాలం నుంచి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఆయన చంద్రబాబుతో భేటీ అయి ఇదే అంశంపై చ ర్చించినట్లు సమాచారం. శైలజానాథ్ మాత్రం బాబును కలవలేదని చెప్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా చంద్రబాబును కలిసినట్లు సమాచారం.