బ్యాంకులకుబకాయిల బెంగ
- నిలిచిపోయిన టర్నోవర్
- భారీగా పేరుకుపోయిన రుణాలు
- రైతాంగంలో రుణమాఫీపై చర్చ
- కోటి ఆశల్లో అన్నదాత
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ స్తంభించింది. రుణమాఫీ ప్రచారంతో గత నాలుగు మాసాలుగా రుణాల రికవరీ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీపై పట్టణాలు, పల్లెల్లో వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో ఆచరణ సాధ్యం కాదని బ్యాంకర్లు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల నాయకులు రుణమాఫీ హామీ తప్పక ఇస్తారనే భావనతో ఈ ఏడాది రైతులు జనవరి నుంచే బ్యాంకు రుణాలను చెల్లించటం మానేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల బ్యాంకుల్లో లావాదేవీలు పెద్ద ఎత్తున స్తంభించాయి. వ్యవసాయ బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి.
ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదారొందల కోట్ల రూపాయల రుణాలు టర్నోవర్ నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేస్తుందని రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
గతంలో ఇలా...
గతంలో దేవీలాల్ ప్రభుత్వం రైతుకు రూ.10 వేల లోపు రుణాలను మాఫీ చేసింది. ఆ మొత్తం దేశ వ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచన మేరకు రూ.78 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించింది. లక్ష రూపాయలలోపు బకాయి ఉన్న రైతులకు రుణాలను రద్దు చేసింది. దీంతో వరుసగా మూడేళ్ల పాటు బకాయి పడిన రైతుల పంట రుణాలు, బంగారం రుణాలు, ఇతర చిన్నతరహా బకాయిలు మాఫీ అయ్యాయి.
పేరుకుపోయిన రూ.500 కోట్ల బకాయిలు...
జిల్లాలో 425 సహకార బ్యాంకు శాఖలు ఉన్నాయి. 501 వాణిజ్య బ్యాంకులు, 54 సప్తగిరి గ్రామీణ బ్యాంకులు, 50 కేడీసీసీ బ్యాంకు బ్రాంచిలు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి ఐదారు వందల కోట్ల రూపాయల బకాయిలు జిల్లాలో పేరుకుపోయినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి రైతులు రుణాలు చెల్లించకపోవటం, పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, బంగారం రుణాలు, భూ అభివృద్ధి పథకం కింద ఇచ్చిన రుణాలు భారీగా పేరుకుపోయాయి.
ఈ మార్చి నాటికి జిల్లాలో అన్ని బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దాదాపు సహకార బ్యాంకులన్నింటా రుణాల చెల్లింపు నిలిచిపోయింది. పాత బకాయిలు చెల్లించక పోవటంతో రైతులకు వచ్చే ఖరీప్‌లో తిరిగి పంట రుణాల పంపిణీ ప్రశ్నార్థకమేనని బ్యాంకర్లు అంటున్నారు. పాత బకాయిలు రద్దు చేస్తారా, లేకుంటే గత మార్చి వరకు తీసుకున్న అన్ని రకాల రుణాలను రద్దు చేస్తారా అనే విషయమై ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. రుణమాఫీ వ్యవహారంతో ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి.
నిలిచిన డ్వాక్రా రుణాలు...
డ్వాక్రా సంఘాలు కూడా ప్రతినెలా చెల్లించే రుణాలను నిలుపుదల చేశాయి. జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల డ్వాక్రా వాయిదాలు కూడా గత మూడు నెలల నుంచి చెల్లించటం లేదని బ్యాంకర్లు తెలిపారు. డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ పొదుపు డబ్బు మాత్రమే చెల్లించి, తీసుకున్న రుణాలను జమ కట్టడం లేదని వారు పేర్కొన్నారు. అన్ని రకాల రుణాలు జమ పడకపోవటంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు బకాయిలపై ఒత్తిడి అధికంగా వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీని అమలు చేయటంలో సాధ్యాసాధ్యాలపై కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.