turnover
-
ఎంఎస్ఎంఈల వర్గీకరణకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) వర్గీకరించడానికి సంబంధించి పెట్టుబడులు, టర్నోవరు ప్రమాణాల్లో గణనీయంగా మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులున్న సంస్థలను సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 1 కోటిగా ఉంది. అలాగే వీటి టర్నోవరు పరిమాణాన్ని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు సవరించారు. ఇక చిన్న సంస్థల హోదాకు సంబంధించి పెట్టుబడుల పరిమాణాన్ని రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు, టర్నోవరు పరిమితిని రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచారు. రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 500 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను మధ్య తరహా సంస్థలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీటి పెట్టుబడుల పరిమితి రూ. 50 కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సంబంధించి కొత్త ప్రమాణాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పెట్టుబడులు, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచేలా బడ్జెట్లో ప్రతిపాదించారు. -
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
ఆర్టీసీ లక్ష్యం.. బిలియన్ డాలర్ టర్నోవర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తొలిసారి ఒక బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,300 కోట్లు) టర్నోవర్ క్లబ్లో చేరేందుకు లక్ష్యం నిర్ధారించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సమకూరిన ఆదాయంతో సంస్థలో కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో మిగతా మూడు త్రైమాసికాల్లో దానికి తగ్గకుండా ఆదాయాన్ని సాధించటం ద్వారా ఒక బిలియన్ డాలర్ టర్నోవర్ సాధించే అరుదైన మైలు రాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆర్టీసీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టంగా మిగులుతుందని సంస్థ భావిస్తోంది. ఓవైపు భారీగా రికార్డవుతున్న సంస్థాగత వ్యయం, అప్పులపై చెల్లిస్తున్న రూ.వందల కోట్ల వడ్డీ.. వెరసి సంస్థకు కొంత నష్టాలనే మిగులుస్తున్నా, ఆదాయ పరంగా ఈ కొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించుకుంది. ఆదాయం పెంపుపైనే దృష్టి పెట్టి.. గత కొంతకాలంగా ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ఆర్టీసీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఏడాదిన్నర క్రితం పలు రకాల సెస్‌లను సవరించి పరోక్షంగా బస్ చార్జీలను పెంచింది. దాని ద్వారా ఆదాయం భారీగా పెరిగింది. ఎండీ సజ్జనార్ వినూత్న ఆలోచనలతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ ఆదాయం పెంచటంలో సక్సెస్ అయ్యారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్పేర్‌లో ఉన్నవి సహా అన్ని బస్సులను రోడ్డెక్కించి, సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగేలా చూస్తున్నారు. లక్షే లక్ష్యం పేరుతో .. ప్రతి డిపో నిత్యం రూ.లక్ష వరకు అదనపు ఆదాయం సాధించేలా కొత్త టార్గెట్‌ను అమలు చేస్తున్నారు. ఫలితంగా 38 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఇలాంటి ప్రత్యేక చర్యల వల్ల గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.6,942 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది రూ.2 వేల కోట్లను మించింది. మహిళల ఉచిత ప్రయాణంతో.. ఉచితంగా ప్రయాణించే మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. వాటి విలువను లెక్కగట్టి ప్రభుత్వం ఆరీ్టసీకి రీయింబర్స్ చేయాల్సి ఉంది. మహిళల సంఖ్య భారీగా పెరగటంతో ఆర్టీసీ ఆదాయం కూడా బాగా పెరిగింది. ఆ మేరకు తొలి త్రైమాసిక ఆదాయం రూ.2 వేల కోట్లను దాటింది. ఇక త్వరలో దశలవారీగా 500 వరకు కొత్త బస్సులు సమకూరనున్నాయి. వీటి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.8,300 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. దాన్ని మన రూపాయల్లో కాకుండా ప్రత్యేకంగా డాలర్లలో పే ర్కొంటే బిలియన్ డాలర్ల మొత్తంగా అవుతుంది. దీంతో ఆ పేరుతో ఈ లక్ష్యాన్ని నిర్ధారించుకున్నారు. అంకెల్లో ఆదాయం.. వాస్తవరూపందాలుస్తుందా? మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.2,350 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ అయ్యాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆర్టీసీకి రూ.1,740 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది. మిగతా రూ.610 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. కానీ, ‘‘బిలియన్ డాలర్ల టర్నోవర్’’లో మాత్రం రూ.2,350 కోట్ల మొత్తాన్ని ఆదాయంగా చూపుతారు. అంటే అంకెల్లో ఆదాయం కనిపిస్తుంది, వాస్తవంగా లోటులో ఉంటుంది. అంకెల్లో ఉన్న ఆదాయం వాస్తవం కావాలంటే ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తేనే అసలు ఆదాయం ఆర్టీసీ లో 2015లో చేసిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల మొత్తాన్ని ఉద్యోగులకు ఇవ్వనున్నట్టు గత ఫిబ్రవరిలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించిన రూ.281 కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. కానీ, కేవలం రూ.81 కోట్లు మాత్రమే రావటంతో ఆర్టీసీ దానికి డ్రైవర్లకు అందించింది. మిగతా నిధులు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. త్వరలో చెల్లిస్తామంటూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటున్నారే తప్ప, ఎప్పటికి ఇస్తారో మాత్రం చెప్పలేకపోతున్నారు. భవిష్యనిధికి బకాయి చెల్లించకపోవటంతో ఆ సంస్థ ఇటీవల ఏకంగా ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. సంస్థ ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో బిలియన్ డాలర్ల టర్నోవర్ లాంటి ఫీట్ చేపట్టడం విశేషం. ప్రభుత్వపరంగా ఆరీ్టసీకి పూర్తి చేయూతనందిస్తే ఈ ఫీట్ ప్రత్యక్షంగా సంస్థకు ఉపయోగంగా ఉండనుంది. -
12 శాతం వృద్ధి లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్
హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: డాలర్ ఇండస్ట్రీస్ 2024–25లో 12% ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.506 కోట్ల టర్నోవర్‌పై రూ.90 కోట్ల నికరలాభం ఆర్జించింది. సంస్థ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని ఎండీ వినోద్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. ‘సంస్థ మొత్తం అమ్మకాల్లో దక్షిణాది వాటాను 20 శాతానికి చేరుస్తాం. ఈ ప్రాంతంలో మూడేళ్లలో 50 ఔట్లెట్లను తెరుస్తాం’ అని అన్నారు. 2025 –26లో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని జేఎండీ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. బ్రాండెడ్ హొజైరీ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 15 శాతం. -
యాపిల్ ఇండియాకు ఐఫోన్ల జోష్
న్యూఢిల్లీ: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇండియా అక్టోబర్–డిసెంబర్ కాలానికి టర్నోవర్‌లో సరికొత్త రికార్డ్ సాధించింది. 2 శాతం వృద్ధితో 119.6 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. ఇందుకు ఐఫోన్ విక్రయాల జోరు దోహదపడింది. వెరసి దేశీ అమ్మకాలలో కంపెనీ సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. యాక్టివ్ డివైస్ల సంఖ్య 2.2 బిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని ప్రొడక్టులలోనూ ఇది అత్యధికంకాగా.. ఐఫోన్ల నుంచి ఆదాయం 6 శాతం ఎగసి 69.7 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. మలేసియా, మెక్సికో, టర్కీ తదితర వర్ధమాన మార్కెట్లలోనూ కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు అందుకున్నట్లు కుక్ పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వివరాల ప్రకారం తొలిసారి 2023లో యాపిల్ అత్యధిక ఆదాయం అందుకోగా.. అమ్మకాల పరిమాణంలో శామ్సంగ్ ముందుంది. కోటి యూనిట్ల షిప్మెంట్ల ద్వారా యాపిల్ ఆదాయంలో టాప్ ర్యాంకును కొల్లగొట్టింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో ఐప్యాడ్ అమ్మకాలు 25 శాతం క్షీణించి 7 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. వేరబుల్, హోమ్, యాక్సెసరీస్ విభాగం విక్రయాలు సైతం 11 శాతం నీరసించి 11.95 బిలియన్ డాలర్లను తాకాయి. ఇక మ్యాక్ పీసీ అమ్మకాలు ఫ్లాట్‌గా 7.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సర్వీసుల ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని 23.11 బిలియన్ డాలర్లకు చేరింది. -
3గిఫ్ట్ నిఫ్టీ టర్నోవర్ రికార్డ్
న్యూఢిల్లీ: గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఒకే రోజులో 15.25 బిలియన్ డాలర్ల(రూ. 1.27 లక్షల కోట్లు) టర్నోవర్‌ను సాధించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. 38.63 లక్షల కాంట్రాక్టుల ద్వారా రికార్డ్ నమోదైంది. వెరసి ఈ ఏడాది ఆగస్ట్ 29న సాధించిన 12.98 బిలియన్ డాలర్ల రికార్డ్ టర్నోవర్‌ను అధిగమించినట్లు ఎన్ఎస్ఈ ఐఎక్స్ వెల్లడించింది. నిఫ్టీ–50 ఇండెక్స్ ఆధారంగా డాలర్లలో ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు గిఫ్ట్ నిఫ్టీ వేదికగా నిలిచే సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈ ఐఎక్స్.. గిఫ్ట్ సిటీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మలీ్టఅసెట్ ఎక్సే్ఛంజ్. ఈ ఏడాది(2023) జులై 3నుంచి గిఫ్ట్ నిఫ్టీలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఎన్ఎస్ఈ ఐఎక్స్లో ట్రేడింగ్ టర్నోవర్ ఊపందుకుంది. పూర్తిస్థాయిలో ట్రేడింగ్ మొదలయ్యాక తొలి రోజు నుంచి ఇప్పటివరకూ 4.59 మిలియన్ కాంట్రాక్టుల ద్వారా 178.54 బిలియన్ డాలర్ల విలువైన టర్నోవర్ నమోదైంది. ఎన్ఎస్ఈ ఐఎక్స్ విభిన్న ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. దేశీ సింగిల్ స్టాక్ డెరివేటివ్స్, ఇండెక్స్, కరెన్సీ, కమోడిటీ డెరివేటివ్స్సహా.. డిపాజిటరీ రిసీప్ట్స్, గ్లోబల్ స్టాక్స్‌ను ఆఫర్ చేస్తోంది. -
కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!
రామ్ వి సుతార్ తరహాలో గొప్ప పేరు సంపాదించుకున్న శిల్పకారులు మనదేశంలో చాలామంది ఉన్నారు. వీరు విదేశాలలో కూడా పేరు సంపాదించారు. వీరిలో శిల్పి అనీష్ కపూర్ ఒకరు. వీరి కళాఖండాలు విదేశాలలో కూడా విపరీతంగా అమ్ముడుపోతుంటాయి. తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అనీష్ కపూర్ అత్యధిక ఆదాయం పొందుతున్న భారతీయ శిల్పకారునిగా గుర్తింపు పొందారు. అతని టర్నోవర్ అతని విజయ గాథను తెలియజేస్తుంది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం 69 ఏళ్ల అనీష్ కపూర్ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన 50 మంది శిల్పకళా కళాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అనీష్ టర్నోవర్ ఏడాదికి రూ. 91 కోట్లుగా ఉందని పలు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పుకునే నటీనటులకు మించి అనీష్ ఆదాయం ఉంది. అగ్రస్థానంలో అనీష్ కపూర్ లండన్‌లో నివసిస్తున్న అనీష్ కపూర్ శిల్ప హస్తకళాకారునిగా సక్సెస్ అయ్యారు. అతని కళాఖండాలలో ఒకటి 9.27 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడమే దీనికి ఉదాహరణగా నిలిచింది. ఖరీదైన ఆర్ట్‌వర్క్‌ల కారణంగా భారత్ వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఆర్ట్ జాబితాలో అగ్రస్థానంలో ఉందని తాజా రిపోర్టు తెలియజేస్తోంది. జులై 31న విడుదల చేసిన ఈ జాబితాను వేలంలో విక్రయించిన కళాఖండాల ఆధారంగా తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం భారతదేశపు ప్రఖ్యాత పెయింటర్ అర్పితా సింగ్ రూపొందించిన ఒక కళాఖండం 24.71 కోట్ల రూపాయల టర్నోవర్‌తో 11.32 కోట్ల రూపాయలకు విక్రయమయ్యింది. అనీష్ కపూర్ తర్వాత ఆమె రెండో స్థానంలో నిలిచింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం భారతీయ చిత్రకారుడు జోగెన్ చౌదరి మూడవ స్థానంలో ఉన్నారు. కళాకారుడి మొత్తం టర్నోవర్ రూ.19.76 కోట్లు. అతను రూపొందించిన ఏడు అత్యంత ఖరీదైన కళాఖండాలు రూ.4.40 కోట్లకు వేలం వేశారు. అదే విధంగా కళాకారుడు గులాం మహ్మద్ షేక్ టర్నోవర్ రూ.17.88 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ముంబైకి చెందిన అనీష్ కపూర్ 1972లో బ్రిటన్‌కు వెళ్లారు. అతను చక్కటి కళాఖండాలను రూపొందించడంలో నైపుణ్యం సాధించారు. బ్రిటన్‌లోని టేట్ మోడరన్ టర్బైన్ హాల్‌తో పాటు, చికాగోలోని మిలీనియం పార్క్‌లో కూడా అనిష్ రూపొందించిన శిల్పాలు కనిపిస్తాయి 2018-19 సంవత్సరంలో అనీష్ కపూర్ టర్నోవర్ రూ. 168.25 కోట్లు. 1991 సంవత్సరంలో అనీష్‌కు టర్నర్ ప్రైజ్ లభించింది. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! -
వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!
ఎవరైనా స్కూలుకెల్లే వయసులో అల్లరి చేస్తారు.. గేమ్స్ ఆడుకుంటారు. ఇవి తప్పా వేరే ఆలోచన కూడా సరిగ్గా ఉండదు. అయితే ఇలాంటి ఆలోచనలకు భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన 'సంకర్ష్ చందా' (Sankarsh Chanda). కేవలం 17 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు. సంకర్ష్ చందా హైదరాబాద్ ఏరియా ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసిన తరువాత 2016లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రూ. 2000లతో ప్రారంభించి కేవలం రెండేళ్లలో అదనపు పెట్టుబడులు కూడా పెట్టాడు. ఒక సంవత్సరంలో తాను సుమారు రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టానని, రెండు సంవత్సరాల్లో ఆ షేర్ల విలువ రూ. 13 లక్షలకు చేరిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సంకర్ష్ చందా 2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆ సమయంలో తన చదువుకి స్వస్తి చెప్పి స్టాక్‌లు, బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ఫిన్‌టెక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. చదువు మానేసి తన మొత్తం దృష్టిని కేవలం దీనిపైనే నిమగ్నం చేశారు. సొంతంగా బిజినెస్ స్టార్ చేసినందుకు 2017లోనే తన 8 లక్షల షేర్లను విక్రయించాడు. స్టార్టప్‌ల సంపాదించిన సొమ్మును మళ్ళీ పెట్టుబడిగా పెట్టాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే భారీ లాభాలను గడించాడు. తన మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 100 కోట్లు వరకు ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం. ఇది మొత్తం తన మొత్తం స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పాటు కంపెనీ వ్యాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. 14 సంవత్సరాల వయసులో ఫాదర్ ఆఫ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్ అని పిలువబడే అమెరికన్ ఆర్థిక వేత్త బెంజిమన్ గ్రాహం కథనం చదివిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి కలిగిందని, అప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు చదవడం, డబ్బు పట్ల మానవ ప్రవర్తన గురించి తెలుసుకోవడం ప్రారంభించినట్లు సంకర్ష్ చందా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!) తాను చదవడానికి కూడా పుస్తకాలను ఇతరుల వద్ద నుంచి లేదా లైబ్రరీ నుంచి తీసుకుంటానని చెప్పాడు. ఒకవేల నేను సొంతంగా పుస్తకాలను కొంటే వాటిని ఉంచడానికి కనీసం నాకు రెండు, మూడు గదులు కావాల్సి వస్తుంది. దానికి అదనపు డబ్బు కావాల్సి వస్తుంది. అందుకే బుక్స్ కొననని చెప్పాడు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా అడుగుజాడల్లో నడుస్తూ.. చదువుకు స్వస్తి చెప్పి నిండా పాతికేళ్లు కూడా లేని సంకర్ష్ చందా ఏకంగా వంద కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సలహాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్
వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. ప్రస్తుతం అలాంటి ముగ్గురు స్నేహితుల విజయగాథ ఇది. రెండు లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోట్ల రుపాయలు టర్నోవర్ చేస్తున్నారు. అందరిలానే చదువు పూర్తి చేసుకుని కొన్నాళ్లు ఉద్యోగం చేసి సంతృప్తి చెందక వ్యాపారం వైపు అడుగులు వేశారు హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్, సుమన్ పాత్ర. 2 లక్షలు పెట్టుబడి.. 75 కోట్ల టర్నోవర్ వ్యాపారం చేద్దామని అనుకునే సమయానికి వారి వద్ద కేవలం రూ.2 లక్షలు మాత్రం ఉంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి 2010లో ఫ్లవర్ ఆరా పేరుతో కంపెనీని ప్రారంభించారు. ఇందులో పూలు, కేకులు, బహుమతులు వంటి వస్తువులకు సంబంధించిన ఆన్లైన్ సేవలను అందిస్తూ వచ్చారు. ప్రారంభంలో, ఆ కంపెనీలో ఒక ఉద్యోగి మాత్రమే ఉన్నాడు. అదే ఉద్యోగి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌గా పని చేయడంతో సహా కార్యకలాపాలు, డెలివరీ వంటి అన్ని అంశాలను నిర్వహించేవాడు. అనుకోకుండా వాలెంటైన్స్ డే వాళ్ల కంపెనీకి చాలా ఆర్డర్లు వచ్చాయి. స్టాఫ్ ఒక్కరే కావడంతో సహ వ్యవస్థాపకులు హిమాన్షు, శ్రే కూడా డెలివరీ కోసం వెళ్ళవలసి వచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా సందర్భాల్లో కేకులు ఎక్కువగా విక్రయాలు జరుగుతుండడం గమనించారు. దీంతో 2016 సంవత్సరంలో బెకింగో అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఒకే బ్రాండ్‌కు చెందిన తాజా కేక్‌లను డెలివరీ చేస్తూ బెకింగోని విస్తరింపజేశారు. ప్రస్తుతం, కంపెనీ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు మీరట్, పానిపట్, రోహ్తక్ కర్నాల్ వంటి చిన్న నగరాలకు సేవలందిస్తోంది. కంపెనీ విక్రయాల్లో 30 శాతం వెబ్సైట్ ద్వారానే 70 శాతం అమ్మకాలు స్విగ్గీ, జొమాటో ద్వారా జరుగుతున్నాయి. అలా 2021-22లో బెకింగో 75 కోట్లకు పైగా టర్నోవర్ చేరకుంది. ప్రస్తుతం కంపెనీలో 500 మందికి పైగా పనిచేస్తున్నారు. కంపెనీ ఈ ఏడాది తన మొదటి ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌ను ఢిల్లీలో ప్రారంభించింది. చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా! -
2026 కల్లా రూ. 21,000 కోట్లకు..
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) రానున్న నాలుగేళ్లలో టర్నోవర్‌ను భారీగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. 2026కల్లా రూ. 21,000 కోట్ల ఆదాయం సాధించగలమని విశ్వసిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. మార్కెట్లో కంపెనీకిగల పొజిషన్‌ను మరింత పటిష్ట పరచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలమని కంపెనీ 15వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. టెక్నాలజీ వినియోగం, ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలతో లాభదాయక, ఫ్యూచర్ రెడీ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించనున్నట్లు వివరించారు. 2021 మార్చిలోనే రూ. 21,000 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2026కల్లా అంచనాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లను అందుకునే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్పారు. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కంపెనీ 55 శాతం వృద్ధితో రూ. 8,136 కోట్ల ఆదాయం సాధించింది. -
రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు హిందుజా గ్రూప్‌లో భాగమైన జీవోసీఎల్ కార్పొరేషన్ సీఈవో పంకజ్ కుమార్ వెల్లడించారు. ఎక్స్‌ప్లోజివ్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు, ధరల పెరుగుదల తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని మంగళవారం ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు సుమారు రూ. 559 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఎక్స్‌ప్లోజివ్స్ ఎగుమతులపైనా, ఎలక్ట్రానిక్స్ విభాగంపైనా మరింతగా దృష్టి పెడుతున్నామని కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు రూ. 40 కోట్లుగా ఉన్న ఎక్స్‌ప్లోజివ్స్ ఎగుమతులను ఈ ఏడాది రూ. 100 కోట్లకు పెంచుకోనున్నట్లు వివరించారు. సూడాన్, టాంజానియా తదితర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్ విభాగం ఆదాయం సుమారు రూ. 20 కోట్లుగా ఉందని, వచ్చే ఏడాది-ఏడాదిన్నర వ్యవధిలో దీన్ని రూ. 100 కోట్లకు పెంచుకోనున్నామని పంకజ్ కుమార్ పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పెట్టుబడులు .. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పంకజ్ వివరించారు. ఇందులో భాగంగా బళ్లారిలో ఎక్స్‌ప్లోజివ్స్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి రెండో లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో దాదాపు 100 మంది ఉండగా, రాబోయే రెండు-మూడేళ్లలో ఈ సంఖ్యను 300 వరకూ పెంచుకునే అవకాశం ఉందని పంకజ్ చెప్పారు. ముడి సరుకు రేట్ల భారం.. వివిధ కారణాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో ముడి వస్తువుల ధరలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని పంకజ్ తెలిపారు. కొన్నాళ్ల క్రితం 200 డాలర్లుగా ఉన్న టన్ను అమోనియా రేటు ఏకంగా సుమారు 900 డాలర్లకు ఎగిసిందని, ప్రస్తుతం 700 డాలర్ల స్థాయిలో ఉందని పేర్కొన్నారు. తదనుగుణంగా తాము కూడా కొంత మేర ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వచ్చే 3-4 నెలల్లో ముడి వస్తువుల రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందన్నారు. కంపెనీకి హైదరాబాద్‌లో ఉన్న 42.25 ఎకరాల మిగులు స్థలంలో 32 ఎకరాల విక్రయ ప్రక్రియ పూర్తయిందని పంకజ్ తెలిపారు. ఈ డీల్ విలువ రూ. 326 కోట్లు. -
రూ. 1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆగ్రో కెమికల్స్ ఉత్పత్తి సంస్థ నిచినో ఇండియా రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది సుమారు రూ. 650 కోట్లుగా ఉందని, ఏటా 18–20 శాతం మేర వృద్ధి సాధిస్తున్నామని సంస్థ ఎండీ తమూకా నౌహిరో తెలిపారు. దాదాపు 71 ఉత్పత్తులతో దేశీయంగా క్రిమిసంహారకాల మార్కెట్లో తమకు 2–3 శాతం వాటా ఉందని, దేశవ్యాప్తంగా 2,500, తెలుగు రాష్ట్రాల్లో 1,200 మంది డీలర్లు ఉన్నారని చెప్పారు. వరి సాగులో సుడి దోమ సమస్య పరిష్కారానికి ఆర్కెస్ట్రా పేరిట క్రిమిసంహారకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునేందుకు ఇది రైతులకు తోడ్పడగలదని సంస్థ సీవోవో డీజీ శెట్టి తెలిపారు. జపాన్ సంస్థ నిహాన్ నొయాకూ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ అయిన నిచినో ఇండియాకు.. తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డితో పాటు దేశీయంగా మొత్తం నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. -
అదిరిపోయే టార్గెట్ సెట్ చేసుకున్న టీసీఎస్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. తద్వారా కస్టమర్లకు మరింత చేరువగా బిజినెస్ విభాగాలను తీసుకెళ్లాలని భావిస్తోంది. అంతేకాకుండా 2030కల్లా 50 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 3.89 లక్షల కోట్లు) ఆదాయాన్ని అందుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2021లో టీసీఎస్ 25 బిలియన్ డాలర్ల టర్నోవర్‌ను సాధించింది. టీసీఎస్ ప్రస్తుతం మరో 25 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని జత చేసుకునే దీర్ఘకాలిక వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు వ్యవస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఇండస్ట్రీ వర్టికల్ యూనిట్స్ అండ్ మార్కెట్స్ నిర్మాణాన్ని రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కంపెనీ అంతర్గత ప్రణాళికలు, వ్యూహాలపై వ్యాఖ్యానించబోమని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు! -
స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 17,980 కోట్లు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,980 కోట్లు టర్నోవర్ సాధించింది. దీంతో గత ఏడాది కంటే 14 శాతం వృద్ధి సాధించినట్టయింది. గురువారం నిర్వహించిన 39వ సాధారణ వార్షిక సమావేశంలో స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వివరాలను ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్ ఏజీఎంలో పాల్గొన్న సీఎండి, డైరెక్టర్లు సంస్థ ఉత్పత్తులు,ఎగుమతులు 0.497 మెట్రిక్ టన్నుల నుంచి 1.308 మెట్రిక్ టన్నులకు పెరిగాయన్నారు. గత ఏడాది కంపెనీ నికర నష్టం రూ.3,910 కోట్లు కాగా ఈ ఏడాది రూ.789 కోట్లకు తగ్గిందన్నారు. దేశీయ అమ్మకాలు గత ఏడాదిలో 20 శాతం కాగా ఈ ఏడాది 24 శాతానికి పెరిగాయన్నారు. సమావేశంలో ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధిగా అండర్ సెక్రటరీ సుభాష్ కుమార్, స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు వి.వి.వేణుగోపాలరావు, డి.కె. మహంతి, కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరెక్టర్ డాక్టర్ సీతా సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి -
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ.18 వేల కోట్లు
విశాఖపట్టణం: విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21లో రూ.18 వేల కోట్లు టర్నోవర్ సాధించింది. స్టీల్‌ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి ఇదే రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం. గురువారం స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశంలో సీఎండీ పి.కె.రథ్ గత ఏడాది ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ వ్యవధిలో 4.45 మిలియన్ టన్నులు అమ్మకాల ద్వారా 13 శాతం వృద్ధి సాధించామన్నారు. గత నాలుగు నెలల్లో రూ. 740 కోట్లు నికర లాభం సాధించామన్నారు. మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా 7.11 లక్షల టన్నులు అమ్మకాలతో రూ.3,300 కోట్లు టర్నోవర్ జరిగిందన్నారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 2,329 కోట్లు అమ్మకాలు చేయగా ఈ ఏడాది 42 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు. 2020 డిసెంబర్ నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కంపెనీ ప్రగతికి ముఖ్య కారణమన్నారు. అదే విధంగా ఈ ఏడాది 1.3 మిలియన్ టన్నులు విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా గత ఏడాది కంటే 261 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్–19 సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రూ.5 కోట్లతో పాటు మొత్తం రూ.10 కోట్లు వ్యయం చేశామన్నారు. రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ఈ వారంలో ప్రారంభం కానుందన్నారు. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాల కోసం విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మొహంతి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)కె.కె.ఘోష్, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) కె.వి.ఎన్. రెడ్డి పాల్గొన్నారు. -
అయిదేళ్లలో రూ.5,000 కోట్ల వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐసీఎల్ ఫిన్‌కార్ప్ 2022 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. కేరళకు చెందిన ఈ కంపెనీ 2018–19లో రూ.700 కోట్లకుపైగా టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు చేరుకుంటామని కంపెనీ సీఎండీ కె.జి.అనిల్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో ప్రస్తుతం 157 శాఖలను నిర్వహిస్తున్నాం. మూడేళ్లలో 1,000 శాఖల స్థాయికి చేరతాం. 927 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను 5,000లకు పెంచుతాం. లిస్టెడ్ కంపెనీ అయిన సాలెం ఈరోడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేస్తున్నాం. ప్రమోటర్లకున్న 74.27 శాతం వాటా కొనుగోలుకు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. అలాగే మార్చిలోగా ఎన్సీడీల జారీ ద్వారా రూ.100 కోట్లు సమీకరించనున్నాం’ అని వివరించారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ నికర లాభం రూ. 96.71 కోట్లు
సాక్షి, విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ 2018–19లో రూ. 96.71 కోట్ల నికర లాభం ఆర్జించింది.శుక్రవారం జరిగిన సంస్థ 37వ ఏజీఎంలో కంపెనీ సీఎండి పి.కె.రథ్ ఈ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది రూ. 20,844 కోట్ల టర్నోవర్ సాధించి మార్కెట్లో 8.80 శాతం వాటాతో అంతకు ముందు ఏడాది కంటే 25 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ఆ ఏడాది వడ్డీలు, పన్నులు, తరుగు, రుణ విమోచనలు చెల్లించక ముందు (ఈబీఐటీడీఏ) రూ.1802.91 కోట్లు అర్జన సాధించిందన్నారు (అంతకు ముందు ఏడాది ఈబీఐటీడీఏ రూ. 346.19 కోట్లు) .2017–18లో రూ. 1369.01 కోట్ల నికర నష్టాలు సాధించగా ఆ తర్వాత సంవత్సరం లాభాలు అర్జించడం విశేషం. సమావేశానికి రాష్ట్రపతి ప్రతినిధిగా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ డైరెక్టర్ నీరజ్ అగర్వాల్ హాజరయ్యారు. సమావేశంలో స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు కె.సి.దాస్, వి.వి.వేణుగోపాలరావు, డి.కె.మొహంతి, కె.కె.ఘోష్, స్వతంత్ర డైరెక్టర్లు ఎస్.కె. మిశ్రా, సునీల్ గుప్తా, అశ్వినీ మెహ్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయంలోనూ రిలయన్స్ టాప్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను చాటుకుంది. ఆదాయం పరంగా ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను (ఐవోసీ) అధిగమించి దేశంలో అగ్ర స్థానానికి చేరుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ.6.23 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. పోటీ సంస్థ ఐవోసీ టర్నోవర్ 6.17 లక్షల కోట్లుగానే ఉంది. ఇక లాభం విషయంలోనూ నంబర్ 1 రిలయన్స్ ఇండస్ట్రీలే కావడం గమనార్హం. ఐవోసీ లాభంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రెట్టింపు స్థాయింలో రూ.39,588 కోట్లను నమోదు చేసింది. ఐవోసీ నికర లాభం 17,274 కోట్లకే పరిమితం అయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.22,189 కోట్లతో పోలిస్తే 23 శాతం క్షీణించింది. కానీ, అదే సమయంలో ఆర్ఐఎల్ లాభంలో 13 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. మార్కెట్ విలువ పరంగా ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో టాప్ కంపెనీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీసీఎస్‌తో తరచూ పోటీ పడుతూ ఉంటుంది. దశాబ్దం క్రితం ఐవోసీ సైజులో ఆర్ఐఎల్ సగం మేరే ఉండేది. ఈ మధ్య కాలంలో టెలికం, రిటైల్, డిజిటల్ సేవలు వంటి వినియోగ ఆధారిత వ్యాపారాల్లోకి రిలయన్స్ పెద్ద ఎత్తున విస్తరించడం అగ్ర స్థానానికి చేరుకునేందుకు దోహదపడింది. గతేడాది వరకు ఐవోసీ ప్రభుత్వరంగంలో అత్యంత లాభదాయకత కలిగిన కంపెనీగా ఉండగా, 2018–19లో ఓఎన్జీసీ ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఓఎన్జీసీ మార్చి క్వార్టర్ ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉండగా, డిసెంబర్ నాటికే 9 నెలల్లో రూ.22,671 కోట్ల లాభం సొంతం చేసుకుంది. ఈ ప్రకారం చూసినా ఐవోసీని వెనక్కి నెట్టేసినట్టే అనుకోవాలి. ఐవోసీ ఆదాయం ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్, గ్యాస్ వ్యాపారాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఏ విధంగా చూసినా.. తాజా రికార్డులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడు రకాలుగా... ఆదాయం, లాభం, మార్కెట్ విలువ పరంగా మెరుగైన స్థానంలో, దేశంలో నంబర్1గా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఆర్ఐఎల్ ఆదాయం 2018–19లో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 44 శాతం వృద్ధి చెందింది. అదే ప్రధానంగా ఐవోసీని రెండో స్థానానికి నెట్టేసేందుకు ఉపయోగపడింది. 2010–19 మధ్య వార్షికంగా ఆర్ఐఎల్ ఆదాయ వృద్ధి 14 శాతం ఉండడం గమనార్హం. ఇక ఐవోసీ ఆదాయం 2018–19లో 20 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2010–19 మధ్య వార్షికంగా 6.3 శాతం పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటి స్టాక్ క్లోజింగ్ ధర ప్రకారం ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ.8.52 లక్షల కోట్లు. ఇక గమనించాల్సిన మరో అంశం... మరే కంపెనీకి లేని విధంగా ఆర్ఐఎల్ వద్ద రూ.1.33 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉండడం. అంతే కాదండోయ్... స్థూల రుణ భారం విషయంలోనూ ప్రముఖ స్థానం రిలయన్స్‌దే కావడం విశేషం. 2019 మార్చి నాటికి రూ.2.87 లక్షల కోట్ల రుణాలు ఆర్ఐఎల్ తీసుకుని ఉంది. ఐవోసీ రుణ భారం రూ.92,700 కోట్లు. -
2022 నాటికి 2,500 కోట్లకు టర్నోవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్, బోర్డ్స్, ఎనర్జీ వంటి వ్యాపారాల్లో ఉన్న ఎన్సీఎల్ గ్రూప్ 2022 నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో లిస్టెడ్ కంపెనీ అయిన ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వాటా రూ.2,000 కోట్లుండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ టర్నోవర్ రూ.1,850 కోట్లు నమోదు చేయబోతోంది. ఈ టర్నోవరులో రూ.1,450 కోట్లు ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ సమకూర్చనుందని కంపెనీ ఎండీ కె.రవి వెల్లడించారు. డ్యూరాడోర్ ప్రీమియం డోర్లను శుక్రవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రీఫ్యాబ్ రంగంలోకి రీ–ఎంట్రీ ఇస్తామన్నారు. ప్రీమియం ప్రీఫ్యాబ్ ఉత్పత్తుల తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు రెండు చైనా కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంలో 15 ఏళ్లపాటు ఉన్నామని, పదేళ్ల క్రితం ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నామన్నారు. భారీ పెట్టుబడి పెడతాం.. బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉందని రవి వెల్లడించారు. ‘కంపెనీ విస్తరణకు గతంలో రూ.300 కోట్లను పిరమల్ ఎంటర్ప్రైజెస్ నుంచి సమీకరించాం. గడువులోగా ఈ మొత్తాన్ని వారికి చెల్లించాం. బిల్డింగ్ మెటీరియల్స్‌లో కొత్త వ్యాపారానికి సైతం పిరమల్ తలుపు తడతాం. మా గ్రూప్ పట్ల వారికి మంచి అభిప్రాయం ఉంది’ అని వివరించారు. నెల్లూరులో ఏఏసీ బ్లాక్స్ యూనిట్‌ను 2.25 లక్షల క్యూబిక్ మీటర్ల వార్షిక సామర్థ్యంతో రూ.50 కోట్లతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. రెడీ మిక్స్ కాంక్రీట్ కేంద్రాలను కొత్తగా విజయవాడ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. సిమెంటు ధరలు మరోసారి పెరగవచ్చన్నారు. సూర్యాపేట వద్ద ఉన్న సిమెంటు ప్లాంటులో వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్టు రానుంది. దీని ద్వారా ఏటా విద్యుత్ బిల్లు రూ.25 కోట్లు ఆదా అవుతుందని కంపెనీ సీఎఫ్‌వో ప్రసాద్ తెలిపారు. రూ.15,000 కోట్ల మార్కెట్.. రెడీమేడ్ డోర్స్, విండోస్ మార్కెట్ భారత్‌లో రూ.15,000 కోట్లుందని అంచనా. ఇందులో డోర్స్ వాటా 50 శాతం ఉంటుందని డ్యూరాడోర్ ప్రెసిడెంట్ వివేక్ గూడెన తెలిపారు. డోర్ల ధరలు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉందని వివరించారు. లైఫ్‌టైమ్ వారంటీతో వీటిని విక్రయిస్తున్నట్టు చెప్పారు. ఏజీటీ సాంకేతిక సహకారంతో రూ.50 కోట్లతో చౌటుప్పల్ వద్ద డోర్ల తయారీ ప్లాంటును ఎన్సీఎల్ ఏర్పాటు చేసింది. -
మార్కెట్లోకి గోద్రెజ్ కొత్త ఏసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహోపకరణాల తయారీ సంస్థ గోద్రెజ్ నూతన శ్రేణి ఏసీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 38 రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. చల్లదనం కోసం పర్యావరణ అనుకూల ఆర్290, ఆర్32 ద్రావణాలను ఏసీల్లో వినియోగిస్తున్నామని, ఆర్290ను భారత్‌లో తొలిసారిగా తామే వాడామని గోద్రెజ్ అప్లయెన్సెస్ నేషనల్ సేల్స్ హెడ్ సంజీవ్ జైన్ చెప్పారు. సౌత్ బిజినెస్ హెడ్ వెంకటరామన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో గోద్రెజ్ అప్లయెన్సెస్ రూ.4,000 కోట్ల టర్నోవర్ నమోదు చేయనుంది. 2019– 20లో 25 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ఏసీల విభాగం వాటా గతేడాది మాదిరిగానే 20 శాతం ఉంటుంది’ అని వివరించారు. -
ఈ ఏడాది రూ.2,000 కోట్ల వ్యాపారం: లివ్‌ఫాస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ కంపెనీ లివ్‌ఫాస్ట్ ఈ ఏడాది రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2018లో రూ.949 కోట్ల వ్యాపారం నమోదు చేసినట్టు కంపెనీ సీఈవో గుర్ప్రీత్ సింగ్ భాటియా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా మార్చికల్లా 25,000 ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పారు. ‘కొత్తగా ప్రవేశపెట్టిన మోడళ్లు 25 శాతం వేగంగా చార్జింగ్ అవడమేగాక 25 శాతం అదనపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. 18 రకాల మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మోడల్‌నుబట్టి 15 నుంచి 60 నెలల దాకా వారంటీ ఉంది’ అని వివరించారు. -
రూ.150 కోట్లతో... ఎంఎస్ఆర్ కాపర్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ కాపర్ పేరుతో రాగి వాటర్ బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్ఆర్ కాపర్ లిమిటెడ్ (గతంలో ఎంఎస్ఆర్ ఇండియా)... భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ.150 కోట్ల వ్యయంతో హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ వద్ద ఏర్పాటు చేసే ఈ ప్లాంటు తయారీ సామర్థ్యం నెలకు 600 టన్నులు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దుతున్న ఈ ఫ్యాక్టరీలో నవంబరు చివరికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని, వైర్లు, రాగి ఉత్పత్తులు, విద్యుత్ పరికరాల వంటి 25 రకాలను ఇక్కడ తయారు చేస్తామని ఎంఎస్ఆర్ కాపర్ ఎండీ కె.వి.రాజశేఖర్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫ్యాక్టరీకి కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నట్టు తెలియజేశారు. నెలకు 10 లక్షల బాటిళ్లు.. ప్రస్తుతం కంపెనీ నెలకు 1.5– 2 లక్షల డాక్టర్ కాపర్ బాటిళ్లను విక్రయిస్తోంది. భారత్‌లో దక్షిణాదిన ఇవి అందుబాటులో ఉన్నాయి. యూఎస్, సింగపూర్, మలేషియా, దుబాయి, కెన్యాలో సైతం విక్రయిస్తోంది. నూతన ప్లాంటు రాకతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లకు చేరుతుంది. దీంతో కొత్త మార్కెట్లలో అడుగు పెడతామని కంపెనీ తెలిపింది. డిసెంబరు నుంచి ఉత్తరాది మార్కెట్లకు సరఫరా చేయనున్నారు. అలాగే ఆస్ట్రేలియా, యూరప్‌కు ఎగుమతి చేస్తామని, బాటిళ్ల విక్రయాల్లో ఎగుమతుల వాటా 20 శాతం ఉందని రాజశేఖర్ చెప్పారు. రెండింతల టర్నోవర్.. ఎంఎస్ఆర్ కాపర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2018–19లో రూ.250– 300 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజశేఖర్ వెల్లడించారు. ‘‘కొత్త ప్లాంటులో ఉత్పత్తి నవంబరు చివరి నాటికి 50 శాతం, డిసెంబరులో 100 శాతానికి చేరుకుంటుంది. డాక్టర్ కాపర్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. కంపెనీ తయారు చేస్తున్న ఇతర ఫుడ్ ప్రొడక్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. నూతన మార్కెట్లలో విస్తరిస్తాం. కాపర్ ఉత్పత్తుల ద్వారానే నెలకు రూ.40 కోట్ల వరకు ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫ్యాక్టరీతో 400 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని వివరించారు. -
హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ.21 కోట్లు
సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.21 కోట్లకు పెరిగింది. టర్నోవరు మాత్రం రూ.828 కోట్ల నుంచి తగ్గి రూ.767 కోట్లకు పరిమితమయింది. గడిచిన ఆరు నెలల్లో చూస్తే (ఏప్రిల్– సెప్టెంబరు) రూ.1,382 కోట్ల టర్నోవరుపై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
రోబో సిలికాన్ మరో 9 ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోబో బ్రాండ్‌తో ఇసుక తయారీ, విక్రయంలో ఉన్న రోబో సిలికాన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్, నాగ్‌పూర్, విజయవాడ, బెంగళూరు, మంగళూరు, దాద్రిలో మొత్తం 11 ప్లాంటున్నాయి. రెండేళ్లలో మరో 9 తయారీ కేంద్రాలను స్థాపించనున్నట్టు రోబో సిలికాన్ సీఈవో సుమ్నేష్ ఖండెల్వాల్ తెలిపారు. ఫైనాన్స్ హెడ్ అమిత్ జైన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంట్ల రాకతో మరిన్ని నగరాలకు విస్తరించినట్టు అవుతుందని చెప్పారు. ‘ఒక్కో కేంద్రానికి రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి సెంటర్లో 35–40 మందికి ఉపాధి లభిస్తుంది. 2017–18లో రూ.125 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ఈ ఏడాది రెండింతలు ఆశిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో సహజ ఇసుక విక్రయాలపై నియంత్రణ ఉంది. దీంతో రాతి ఇసుకకు మంచి డిమాండ్ ఉంటోంది. పైగా నది ఇసుకతో పోలిస్తే రాతి ఇసుక ధర ప్రాంతాన్నిబట్టి 40–50 శాతం తక్కువగా ఉంటుంది. కంపెనీ విక్రయాల్లో 50 శాతం ఒక్క హైదరాబాద్ మార్కెటే కైవసం చేసుకుంది’ అని వివరించారు. రోబో సిలికాన్‌లో ట్రూ నార్త్‌గా పేరు మార్చుకున్న ఇండియా వాల్యూ ఫండ్‌కు 77 శాతం వాటా ఉంది. 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
వేతన జీవులకు షాక్: కొత్త ఐటీఆర్..ఎన్నో మార్పులు
ఐటీఆర్–1 వేతనజీవుల కోసం. దీన్లో ఇదివరకు జీతభత్యాల గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఇవ్వాలి. ►ఉద్యోగస్తులకు యాజమాన్యం వారిచ్చే స్టాక్ ఆప్షన్ ప్లాన్ విషయంలో మార్పుల వలన, లిస్ట్ కాని కంపెనీ షేర్లుంటే వాటి ‘ప్రైమరీ మార్కెట్’ విలువను సీఏ, మర్చంట్ బ్యాంకర్‌తో ధ్రువీకరించాలి. ►అద్దెకిచ్చిన ఇంటి మీద అద్దె వివరాలివ్వాలి. ►మూలధన లాభాలకు సంబంధించి అదనపు వివరాలివ్వాలి. మినహాయింపులు పొందిన వారు వాటిని ఎంతో వివరంగా తెలియజేయాలి. ►కొన్ని ఫారాలలో అసెస్సీకి సంబంధించిన కాలమ్ ‘జెండర్’ తొలగించారు.ఈ సమాచారం ఇవ్వక్కర్లేదు. ►భాగస్వామ్య సంస్థలు భాగస్వాముల ఆధార్ వివరాలను తెలియజేయాలి. ►భాగస్వామి గత సంవత్సరం వరకూ ఫారం–2ను దాఖలు చేయవచ్చు. ఈ సారి ఫారం–3లో రిటర్నులు దాఖలు చేయాలి. ► అలాగే నాన్ రెసిడెంట్లు ఫారం–1కి బదులుగా ఫారం–2 దాఖలు చేయాలి. ఇందులో అదనంగా సమాచారం ఇవ్వాలి. వారు రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు విదేశీ బ్యాంక్ వివరాలిస్తే.. ఆబ్యాంక్ ఖాతాకు రిఫండ్ ఇస్తారు. ► కొంతమంది నిర్దేశించిన శాతాన్ని లాభంగా చూపించడం ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటారు. వారు ఈసారి అదనంగా సమాచారం ఇవ్వరు. (ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మాత్రమే). ►వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు జీఎస్టీ రిటర్నులలో పేర్కొన్న టర్నోవర్‌ను చూపించాలి. దీనివలన పుస్తకాల టర్నోవర్‌తో, జీఎస్టీ టర్నోవర్‌ను పోల్చి చూస్తారు. వ్యత్యాసం ఉంటే వివరణ ఇవ్వాలి. ►అలాగే కంపెనీల విషయంలో ఎన్నెన్నో వివరాలు ఇవ్వాలి. ►వేతనజీవుల విషయంలో గడువుతేది 31/07/2018. ఆన్లైన్లో దాఖలు చేయాలి. అన్ని కాగితాలు సంపాదించి, సరిచూసుకొని, ఖచ్చితంగా ఫైల్ చేయండి. 31/07/2018 దాటితే రూ.5,000, 31/12/2018 దాటితే రూ.10,000 పెనాల్టీ పడుతుంది. -
విశాఖ స్టీల్ టర్నోవర్ రూ.16,500 కోట్లు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ 2017–18లో అత్యధికంగా రూ.16,500 కోట్ల టర్నోవర్ సాధించింది. ఉక్కు మల్టీపర్పస్ హాలులో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి. మధుసూదన్ ఈ వివరాలను తెలియజేశారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల కృషి ఫలితంగా టర్నోవర్‌లో 31 శాతం వృద్ధి సాధించగా, సేలబుల్ స్టీల్ 17 శాతం వృద్ధితో 4.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో హాట్‌మెటల్ 17 శాతం, ద్రవపు ఉక్కు 19 శాతం, ఫినిష్డ్ స్టీల్ 21 శాతం, విలువ ఆధారిత ఉత్పత్తులు 16 శాతం, విద్యుత్ ఉత్పత్తిలో 28 శాతం వృద్ధి నమోదు చేశామని వివరించారు. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే 2018–19లో టర్న్ అరౌండ్ సాధించడం ఖాయమన్నారు. 2018–19లో హాట్ మెటల్ 6.4 మిలియన్ టన్నులు, ద్రవపు ఉక్కు 6.3 మి.ట, సేలబుల్ స్టీల్ 5.7 మి.ట లక్ష్య సాధనతో విశాఖ స్టీల్‌ప్లాంట్ ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఇందుకోసం ఉద్యోగులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు రే చౌదరి, పి.కె. రథ్, కె.సి.దాస్, ఈడీలు, జీఎంలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రామ్కీ ఎన్విరో విదేశీ టూర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యర్థాల నిర్వహణలో ఉన్న దిగ్గజ సంస్థ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్... విదేశీ మార్కెట్లలో మరింత విస్తరిస్తోంది. అమెరికా, ఒమన్, సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, సింగపూర్, బంగ్లాదేశ్‌లో ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియాల్లోనూ విస్తరణకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో మూడింట ఒక వంతు అంతర్జాతీయ కార్యకలాపాల నుంచే వస్తోంది. 2022 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్ రెడ్డి చెప్పారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... వాణిజ్యపరంగా అనుకూలమైన ప్రపంచస్థాయి పరిష్కారాలను తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. పెట్టుబడి రూ.1,000 కోట్లు.. ఒమన్‌లో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, సౌదీ అరేబియాలో వ్యర్థాల నిర్వహణ ప్లాంటు నిర్మాణం, దుబాయ్‌లో నిర్మాణ వ్యర్థాల రికవరీ ఫెసిలిటీ ఏర్పాటుకు రామ్కీ ఎన్విరో ఇటీవలే అంతర్జాతీయ కాంట్రాక్టులను దక్కించుకుంది. అలాగే పారిశ్రామిక, జీవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణకు దోహా, జోర్డాన్, బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు పొందింది. వీటి నిర్మాణానికి వచ్చే రెండేళ్లలో రామ్కీ సంస్థ రూ.900–1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. మెరైన్ సర్వీసుల్లోకి.. ఇటీవలే టెక్సాస్‌కు చెందిన నేచుర్ ఎన్విరాన్మెంటల్, మెరైన్ సర్వీసెస్‌లో 50 శాతం వాటాను రామ్కీ ఎన్విరో కొనుగోలు చేసింది. తద్వారా సముద్ర వ్యర్థాల నిర్వహణలోకి ప్రవేశించిన భారత కంపెనీగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవల్లో 10 కంపెనీలే ఉన్నాయని గౌతమ్ రెడ్డి తెలిపారు. ‘‘నేచుర్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఏటా రూ.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. భారత్‌తో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని సేవలను అందుబాటులోకి తెస్తాం’’ అని వివరించారు. అయిదేళ్లలో 50 శాతం.. రామ్కీ ఎన్విరో సంస్థ 2016–17లో రూ.1,550 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,800 కోట్లు ఉండొచ్చని గౌతమ్ రెడ్డి చెప్పారు. ‘‘దీన్లో విదేశీ వ్యాపారం వాటా రూ.600 కోట్లు ఉంటుంది. రెండేల్లో మొత్తం టర్నోవర్ రూ.3,500 కోట్లకు చేరే అవకాశముంది. దీన్లో విదేశీ వాటా 30 శాతం ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం వాటా ఐదేళ్లలో 50 శాతానికి చేరుతుందనే నమ్మకం ఉంది’’ అని వివరించారు. వ్యర్థాల నుంచి విద్యుత్.. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో కంపెనీకి మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంటుంది. రోజుకు సుమారు 6,000 టన్నుల వ్యర్థాలు ఈ కేంద్రానికి వస్తాయి. ఇక్కడే వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 20 మెగావాట్ల ప్లాంటు నిర్మాణంలో ఉంది. 2019 మార్చికల్లా విద్యుత్ ప్లాంటు అందుబాటులోకి రానుంది. రామ్కీ ఎన్విరో దీనికోసం రూ.340 కోట్లు వెచ్చిస్తోంది. ఇక జవహర్‌నగర్ డంప్ యార్డులో క్యాపింగ్ పనులు వేగం పుంజుకున్నాయి. క్యాపింగ్ పూర్తయితే పరిసరాల కాలుష్యానికి చెక్ పడుతుంది. -
హైదరాబాద్‌లో కెవెంటర్స్ ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ డెయిరీ బ్రాండ్ కెవెంటర్స్... హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించింది. తొలుత సుజనా ఫోరం, జీవీకే, ఇనార్బిట్లలో మూడు ఔట్లెట్లను ప్రారంభించిన ఈ సంస్థ... 2019 చివరి నాటికి నగరవ్యాప్తంగా 32 స్టోర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, డైరెక్టర్ షోరభ్ సీతారామ్ మాట్లాడుతూ.. థిక్, క్లాసిక్, ఫ్రూటీ షేక్స్లలో 27 రకాల పానీయాలను అందుబాటులో ఉంచామని, వీటి ధరలు రూ.99 నుంచి 250 వరకు ఉంటాయని తెలిపారు. ‘‘ప్రస్తుతం దేశంలో 30 ప్రాంతాల్లో 170, నేపాల్, యూఏఈ దేశాల్లో 12 ఔట్‌లెట్లున్నాయి. వీటిల్లో 20 శాతం మాత్రమే సొంతవి. మిగిలినవన్నీ ఫ్రాంచైజీ విధానంలో ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. 2019 ముగింపు నాటికి దేశ, విదేశాల్లో కలిపి వీటి సంఖ్యను 1,500లకు చేర్చాలని లకి‡్ష్యంచినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కెవెంటర్స్ స్టోర్లకు పాల ఉత్పత్తుల సరఫరా కోసం మదర్ డెయిరీతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.32 కోట్ల వ్యాపారాన్ని చేశామని, ఈ ఏడాది రూ.75 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచామని తెలిపారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 12,781కోట్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ 2016–17లో రూ. 12,781 కోట్ల టర్నోవర్ సాధించింది. బుధవారం ఉన్నతాధికారులుతో జరిగిన కార్యక్రమంలో 2016–17లో సాధించిన ప్రగతి, ఉత్పత్తి, సవాళ్లను సీఎండి మధుసూదన్ వివరించారు. ఆ వ్యవధిలో హాట్ మెటల్ ఉత్పత్తిలో 11 శాతం, ద్రవ ఉక్కులో 10 శాతం, ఫినిష్డ్ స్టీల్‌లో 16 శాతం, సేలబుల్ స్టీల్‌లో 10 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. ముఖ్యంగా రెండవ వైర్ రాడ్ మిల్లో ఉత్పత్తి రికార్డు స్థాయిలో 43 శాతం వృద్ధి సాధించగా, 5 శాతం వృద్ధితో సింటర్ ఉత్పత్తి 6 మిలియన్ టన్నుల మార్కును అందుకుందన్నారు. గత ఏడాది ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ ధరలు గణనీయంగా పెరిగినప్పటికి ఉత్పత్తి, టర్నోవర్‌లో వృద్ధి సాధించిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విస్తరణ యూనిట్ల నుంచి ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్లాంట్ సామర్ధ్యం పెంచాలని ఆయన కోరారు. గత ఏడాదిలో డిజిటల్ పేమెంట్లు, ఈ–టెండరింగ్ వంటి అంశాల్లో చూపిన ప్రగతి సంస్థ అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పి.సి.మహాపాత్ర, డి.ఎన్.రావు, రే చౌదరి, కె.సి.దాస్‌తో పాటు ఈడీలు, జీఎంలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘నోటు దెబ్బ’కు బిజినెస్ ఢమాల్
-
బిజినెస్ ఢమాల్
‘నోటు దెబ్బ’కు నగరంలో వెలవెలబోతున్న వ్యాపారాలు ♦ రోజూ రూ. 1,600 కోట్ల వ్యాపారం.. రద్దు తర్వాత రూ. 200 కోట్లకు తగ్గిన వైనం ♦ వినియోగదారులు లేక విలవిల్లాడుతున్న వ్యాపార, వాణిజ్య కూడళ్లు ♦ నిత్యం రూ.10 కోట్ల వ్యాపారం చేసే ఓ మాల్‌కు గడచిన వారం టర్నోవర్ రూ.3 కోట్లు ♦ హైటెక్ సిటీలోని మరో మాల్లో రోజుకు రూ.15 కోట్లు.. ఇప్పుడు కనాకష్టంగా కోటిన్నర ♦ సినిమా థియేటర్లలో సగానికి పైగా సీట్లు ఖాళీ.. బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు కుదేలు ♦ పడిపోయిన జ్యువెలరీ వ్యాపారం.. పెద్ద ఎత్తున నష్టపోతున్న ఫైవ్‌స్టార్ హోటళ్లు సాక్షి, హైదరాబాద్ పెద్ద నోట్ల రద్దు రాజధాని నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలపై పెను ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువులు మొదలుకుని నగల దుకాణాల దాకా, వినోదాన్ని పంచే సినిమా థియేటర్ల నుంచి మద్యం దుకాణాల వరకూ అన్నీ విలవిలలాడుతున్నాయి. సాధారణంగా ప్రతిరోజూ నగరంలో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు రోజూ రూ.1,600 కోట్ల వ్యాపారం చేస్తుంటాయి. అయితే పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఈ వారంలో జరిగిన వ్యాపార కార్యకలాపాల మొత్తం సగటున రూ.200 కోట్లకు మించలేదు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి వచ్చే వ్యాపారుల టర్నోవర్ లెక్క మాత్రమే ఇది. ఇక వ్యాట్ పరిధిలోకి రాని వ్యాపారాల మొత్తం ఇందులో కనీసం నాలుగోవంతు అయినా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఆ వ్యాపారాలు కూడా పూర్తిగా పడిపోయాయి. నగదు ఉపసంహరణపై పరిమితి కారణంగా చిరు వ్యాపారులు దుకాణాలనే మూసుకున్నారు. వినియోగదారులు లేక కాయగూరల వ్యాపారులు సగానికి సగం ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. కాయగూరలు చౌకగా లభించే రైతు బజార్లలోనూ వినియోగదారులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. హోల్‌సేల్ ధరలకు విక్రయాలు చేసే మలక్‌పేట మహబూబ్‌మాన్షన్ మార్కెట్‌కు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తుంటారు. గడచిన వారం రోజులుగా ఈ మార్కెట్లో 50 శాతం దుకాణాలు మూసి ఉంచారు. చిల్లర లేదని అక్కడి వ్యాపారులు ఏకంగా ఉల్లిపాయల క్రయ విక్రయాలను నిలుపుదల చేసే స్థాయికి సంక్షోభం చేరుకుంది. థియేటర్ల నుంచి విమానాల దాకా.. నాలుగు రోజుల ముందు ఆన్లైన్లో బుక్ చేస్తే తప్ప టికెట్ లభించని ప్రముఖ మల్టీప్లెక్స్‌ల్లో గడచిన శని, ఆదివారాల్లో సగం సీట్లు కూడా నిండలేదు. ఇక హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులు కూడా సగానికి తక్కువగా ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హైదరాబాద్–ఢిల్లీ మినహా ఏ సెక్టార్‌లోనూ ఆక్సుపెన్సీ రేషియో 50 శాతం కూడా లేదని విమానయాన వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో 70 శాతానికి పైగా గదులు ఖాళీగా ఉన్నాయి. గడచిన వారం రోజుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే ఈ హోటళ్లకు సంబంధించి రూ.450 కోట్ల దాకా వ్యాపారం ఆగిపోయింది. సందడి లేని మాల్స్, వాణిజ్య కూడళ్లు హైటెక్ సిటీలో నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే ఓ మాల్లో గురువారం సాయంత్రం జనం పదుల సంఖ్యలో ఉన్నారు. దాదాపు అంతే రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1లోని మాల్లోనూ ఇదే పరిస్థితి. చౌకధరలకు అన్ని రకాల దుస్తులు లభించే పంజాగుట్టలోని ఓ మాల్లోని పార్కింగ్ ఏరియా వాహనాలు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. ఇక చెప్పుల నుంచి ఏసీల దాకా ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వివిధ వ్యాపారాల టర్నోవర్ నిత్యం రూ.750 కోట్ల దాకా ఉంటుంది. పెద్ద నోట్ల రద్దుతో ఈ వ్యాపారం సగటున రూ.85 కోట్లకు పడిపోయింది. కూర్చోవడానికి సీటు కూడా దొరకని అబిడ్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో వారం రోజులుగా కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ చెప్పుల దుకాణానికి రాజధాని నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. మాదాపూర్‌లో రోజు రూ.15 కోట్ల మేర వ్యాపారం చేసే ఓ మాల్లో గడచిన వారం రోజులుగా వసూలైన మొత్తం 10.5 కోట్లు మాత్రమే. ఇక్కడ నగదు కంటే క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే వినియోగదారులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ మాత్రం వ్యాపారం జరిగింది. బంజారాహిల్స్‌లోని మరో మాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. రోజు రూ.10 కోట్ల వ్యాపారం చేసే ఈ మాల్ గడచిన వారం రోజులుగా వసూలు చేసిన మొత్తం రూ.3 కోట్లు మాత్రమే. జనంతో కిటకిటలాడే మొబైల్ షాపులకు వారం రోజులుగా వినియోగదారులు కరువయ్యారు. అబిడ్స్ కేంద్రంగా రోజు సగటున రూ.60 కోట్ల వ్యాపారం జరుగుతుండగా వారం రోజుల్లో అది రూ.4 కోట్లకు పడిపోయింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చివరకు మిఠాయి దుకాణాలకు కూడా తాకింది. రోజుకు రూ.5 లక్షల వ్యాపారం చేసే సోమాజిగూడలోని ఓ మిఠాయి షాపు వారం రోజులుగా రూ.3 లక్షల విలువైన మిఠాయిలు మాత్రమే అమ్మగలిగింది. నగల దుకాణాలు వెలవెల రాజధానిలో నగల దుకాణాలు నిత్యం వేలాది మంది వినియోగదారులతో కళకళలాడుతూ ఉండేవి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ దుకాణాలపై తీవ్రంగా పడింది. కొనుగోలుదారులు రావడం లేదంటూ కొన్ని ప్రముఖ నగల దుకాణాలు తమ ఉద్యోగులకు మూడు నుంచి నాలుగు రోజులు స్వచ్ఛంద సెలవులను ప్రకటించాయి, మరికొన్ని దుకాణాలు మూసే ఉంటున్నాయి. నగల వర్తకుల సంఘం అందించిన సమాచారం మేరకు.. రాజధానిలో నిత్యం కూ.250 కోట్ల విలువైన నగల వ్యాపారం జరుగుతుంది. కానీ పెద్ద నోట్ల రద్దు ప్రభావంతోపాటు కొద్దిరోజుల్లో బ్యాంక్ లాకర్లనూ కూడా సీజ్ చేస్తారన్న ప్రచారంతో టర్నోవర్ దారుణంగా పడిపోయింది. గడచిన వారం రోజుల్లో రూ.25 కోట్ల విలువైన నగల వ్యాపారం కూడా జరగలేదు. రోజూ రూ.12 కోట్ల మేర వ్యాపారం చేసే ఓ ప్రముఖ నగల దుకాణం గడచిన వారంలో చేసిన వ్యాపారం కోటి రూపాయలు మించి లేదు. బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ దాకా బారులు తీరి ఉన్న నగల దుకాణాల్లో కొన్ని వారం నుంచే మూసే ఉన్నాయి. తెరిచిన దుకాణాల్లో నగలు కొనుగోలు చేయడానికి వచ్చిన వారు పట్టుమని పది మంది కూడా లేరు. పెద్ద నోట్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. వారం రోజుల్లో జంట నగరాల్లో నగల దుకాణాల టర్నోవర్ రూ.7 కోట్లు మించి లేకపోవడం గమనార్హం. మద్యం, మాంసానికీ దూరం బ్యాంక్‌ల నుంచి నగదు తీసుకునే అవకాశం తక్కువగా ఉండటం, ఏటీఎంలు పని చేయకపోవడంతో తమ దగ్గర ఉన్న నగదును ప్రజలు జాగ్రత్తగా వినియోగిస్తున్నారు. ఈ కారణంగా నగరంలోని మద్యం, మాంసం దుకాణాల్లో విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ప్రతి ఆదివారం రూ.6 లక్షల రూపాయల మాంసం విక్రయించే పంజాగుట్టలోని ఓ దుకాణం గడచిన ఆదివారం అమ్మిన మాంసం మొత్తం విలువ రూ.2 లక్షలే! హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ పెద్దనోట్ల రద్దుకు ముందు రోజుకు సగటున రూ.12 లక్షల వ్యాపారం చేసేది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత వారం రోజుల్లో ఆ దుకాణం సగటు వ్యాపారం కేవలం రూ.2.5 లక్షలు. రోజుకు రూ.లక్ష అంతకంటే ఎక్కువ వ్యాపారంచేసే బార్ అండ్ రెస్టారెంట్లు ఇప్పుడు కనాకష్టంగా రూ.40 నుంచి 50 వేల మేర వ్యాపారం చేస్తున్నాయి. మద్యం దుకాణాలదీ అదే తీరు...అమ్మకాలు దారుణంగా పడిపోయాయని ఎక్పైజ్ అధికారులే చెపుతున్నారు. మల్టీప్లెక్స్‌లు సహా సినిమా థియేటర్లలో గడచిన వారం రోజులుగా సగం సీట్లు కూడా నిండటం లేదు. ఆన్లైన్ బుకింగ్‌లు 90 శాతం పడిపోయాయి. థియేటర్లలోని బుకింగ్ కౌంటర్ల దగ్గర జనమే కనిపించడం లేదు. ఫలితంగా నిర్మాతలు కొందరు తమ సినిమా విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. విమాన సర్వీసులు, స్టార్ హోటళ్లకూ ఇబ్బందులే పెద్ద నోట్ల రద్దు ప్రభావం విమాన సర్వీసులతో పాటు రాజధానిలోని స్టార్ హోటళ్లపైనా పడింది. విమానయాన వర్గాలు అందించిన సమాచారం ప్రకారం హైదరాబాద్– ఢిల్లీ మినహా ఇతర అన్ని సెక్టార్లలో 50 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ముంబై, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చే విమానాలు 40 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ రెండు నగరాల నుంచి పెద్దఎత్తున వ్యాపారులు నగరానికి వచ్చి ఇక్కడ ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేస్తారు. ఇప్పుడు ఈ రెండు నగరాలతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా తగ్గడంతో వారం రోజుల్లో వాటి వ్యాపారం రూ.450 కోట్ల మేర పడిపోయింది. -
విశ్రాంతి.. పెద్ద భ్రాంతి!
పంట తీసుకొచ్చే రైతులకు నిలువనీడ కరువు రూ.2000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్నా.. ఫలితం సున్నా బస్తాలపై, చెట్ల నీడలో సేదతీరుతున్న అన్నదాతలు ఆసియూ ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్లో విశ్రాంతి భవనాల లేమి వరంగల్ సిటీ: ఆసియూ ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అది. దేశంలోనే ఏకైక రెగ్యులేటరీ మార్కెట్ కూడా అదే. అధికారిక లెక్కల ప్రకారం.. సంవత్సరానికి రూ.2000 కోట్ల వ్యాపార లావాదేవీలకు నెలవు. అనధికారికంగా మరో రూ.2000 కోట్ల వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటారుు. ఇంత గొప్ప ‘ఘణా’ంకాలు, ఘన కీర్తి ఉన్నా.. వరంగల్ మార్కెట్లో అన్నదాతలకు మండుటెండల్లో నిలువ నీడ దొరకడం లేదు. దీంతో దాని పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా తయూరైంది. అభివృద్ధి పనులకు ఎన్నో నిధులు వెచ్చించినా.. ఇప్పటిదాకా మార్కెట్లో రైతుల కోసం విశ్రాంతి భవనాలను నిర్మించలేదు. ఈ కారణంగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ తాము మార్కెట్‌కు తీసుకొచ్చే పంట బస్తాలపైన, చెట్ల నీడన రైతులు సేదతీరుతున్నారు. అందరికీ కూడుపెట్టే అన్నదాతల సౌకర్యార్ధం విశ్రాంతి భవనాలను నిర్మించాల్సిన అవసరముందని రైతులోకం అభిప్రాయపడుతోంది. గౌరవించే సంస్కారం లేదు రైతులతో అటు ప్రభుత్వానికి, ఇటు మార్కెట్ అధికారులకు ఏం అవసరం ? మా పంట వ్యాపారులకు కావాలి. అందులో అందరికీ వాటాలు కావాలి. అంతే తప్ప రైతులను గౌరవించే సంస్కారం మార్కెటింగ్ శాఖలో లేదు. అందుకే మార్కెట్లో విశ్రాంతి భవనాలు కట్టడం లేదు. - అరికాల రాజలింగం, పత్తి రైతు నీళ్లు కొనుక్కోవాలి.. నీడ వెతుక్కోవాలి అందరికి అన్నం పెట్టే రైతులం వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు పంట తీసుకొచ్చినప్పుడు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. నీరు కొని తాగాల్సి వస్తోంది. ఈ మండుటెండల్లో నీడనిచ్చే ప్రదేశం మార్కెట్లో లేదు. దీంతో చెట్లు ఎక్కడున్నాయూ అంటూ వెతుక్కోవాల్సి వస్తోంది. చెట్ల నీడనే సేదతీరుతున్నాం. విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. - ఎలకంటి సుదర్శన్‌రెడ్డి, మక్క రైతు వారిది స్వార్ధం.. మాది నిస్వార్ధం మేం తెచ్చిన పంట కొని వ్యాపారులు లాభపడుతారు. వ్యవసాయ మార్కెట్లో పనిచేసే అధికారులకు వేలాది రూపాయల జీతాలు వస్తారుు. మేం మట్టిని నమ్ముకొని.. రాత్రనక, పగలనక కష్టపడి, నిద్రాహారాలు మాని పండించిన పంట మాత్రం వాళ్లకు కావాలి. మా సంక్షేమం అక్కర్లేదు. వాళ్లది కచ్చితంగా స్వార్ధమే. మాది నిస్వార్ధం. - ముదిరి మల్లయ్య, వేరుశనగ రైతు విశ్రాంతి భవనం, మహిళా రైతు భవనం నిర్మాణానికి ప్రయత్నాలు వరంగల్ మార్కెట్లోని అన్ని యార్డుల్లో రైతులకు విశ్రాంతి భవనం, మహిళా రైతు భవనం నిర్మించాలని భావిస్తున్నాం. ఇందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. మరుగుదొడ్లు, మంచినీటి వసతిని త్వరలో అందుబాటులోకి తెస్తాం. - అజ్మీరా రాజు, మార్కెట్ కార్యదర్శి ప్రజాప్రతినిధులు చొరవచూపాలి మా చెమట చుక్కలతోనే వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయూన్ని విస్మరించి అధికారులు,వ్యాపారులు ప్రవర్తిస్తున్నారు. కనీసం ప్రజాప్రతినిధులైనా చొరవ చూపి రైతుల కోసం వరంగల్ మార్కెట్లో విశ్రాంతి భవనం నిర్మాణం జరిగేలా చూడాలి. - ఆర్.శంకర్రావు, పత్తి రైతు -
మిధాని రికార్డ్ స్థాయి టర్నోవర్
హైదరాబాద్: రక్షణ రంగానికి చెందిన మినీరత్న కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి టర్నోవర్(రూ.760కోట్లు) సాధించింది. 2016-15 ఆర్థిక సంవత్సరంలో తమ టర్నోవర్ రూ. 680 కోట్లని మిధాని ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా 2014-15లో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల్లో అత్యధిక ఎంఓయూ స్కోర్(1.01-ఎక్స్లెంట్ రేటింగ్)ను సాధించామని మిధాని సీఎండీ డాక్టర్ దినేశ్ కుమారి లిఖి చెప్పారు. ఈ ఎక్స్లెంట్ రేటింగ్‌న సాధించడం ఇది వరుసగా 12వ ఏడాదని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల స్థూల లాభం ఆర్జించామని, రూ.1,100 కోట్ల ఆర్డర్లు సాధించామని తెలిపారు. ప్రభుత్వానికి వరుసగా 13 సంవత్సరాల పాటు డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. -
ఏపీ, తెలంగాణలో రూ.400 కోట్లు టర్నోవర్
-
బ్యాంకులకుబకాయిల బెంగ
నిలిచిపోయిన టర్నోవర్ భారీగా పేరుకుపోయిన రుణాలు రైతాంగంలో రుణమాఫీపై చర్చ కోటి ఆశల్లో అన్నదాత విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ స్తంభించింది. రుణమాఫీ ప్రచారంతో గత నాలుగు మాసాలుగా రుణాల రికవరీ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీపై పట్టణాలు, పల్లెల్లో వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో ఆచరణ సాధ్యం కాదని బ్యాంకర్లు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల నాయకులు రుణమాఫీ హామీ తప్పక ఇస్తారనే భావనతో ఈ ఏడాది రైతులు జనవరి నుంచే బ్యాంకు రుణాలను చెల్లించటం మానేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల బ్యాంకుల్లో లావాదేవీలు పెద్ద ఎత్తున స్తంభించాయి. వ్యవసాయ బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదారొందల కోట్ల రూపాయల రుణాలు టర్నోవర్ నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేస్తుందని రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఇలా... గతంలో దేవీలాల్ ప్రభుత్వం రైతుకు రూ.10 వేల లోపు రుణాలను మాఫీ చేసింది. ఆ మొత్తం దేశ వ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచన మేరకు రూ.78 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించింది. లక్ష రూపాయలలోపు బకాయి ఉన్న రైతులకు రుణాలను రద్దు చేసింది. దీంతో వరుసగా మూడేళ్ల పాటు బకాయి పడిన రైతుల పంట రుణాలు, బంగారం రుణాలు, ఇతర చిన్నతరహా బకాయిలు మాఫీ అయ్యాయి. పేరుకుపోయిన రూ.500 కోట్ల బకాయిలు... జిల్లాలో 425 సహకార బ్యాంకు శాఖలు ఉన్నాయి. 501 వాణిజ్య బ్యాంకులు, 54 సప్తగిరి గ్రామీణ బ్యాంకులు, 50 కేడీసీసీ బ్యాంకు బ్రాంచిలు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి ఐదారు వందల కోట్ల రూపాయల బకాయిలు జిల్లాలో పేరుకుపోయినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి రైతులు రుణాలు చెల్లించకపోవటం, పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, బంగారం రుణాలు, భూ అభివృద్ధి పథకం కింద ఇచ్చిన రుణాలు భారీగా పేరుకుపోయాయి. ఈ మార్చి నాటికి జిల్లాలో అన్ని బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దాదాపు సహకార బ్యాంకులన్నింటా రుణాల చెల్లింపు నిలిచిపోయింది. పాత బకాయిలు చెల్లించక పోవటంతో రైతులకు వచ్చే ఖరీప్‌లో తిరిగి పంట రుణాల పంపిణీ ప్రశ్నార్థకమేనని బ్యాంకర్లు అంటున్నారు. పాత బకాయిలు రద్దు చేస్తారా, లేకుంటే గత మార్చి వరకు తీసుకున్న అన్ని రకాల రుణాలను రద్దు చేస్తారా అనే విషయమై ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. రుణమాఫీ వ్యవహారంతో ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి. నిలిచిన డ్వాక్రా రుణాలు... డ్వాక్రా సంఘాలు కూడా ప్రతినెలా చెల్లించే రుణాలను నిలుపుదల చేశాయి. జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల డ్వాక్రా వాయిదాలు కూడా గత మూడు నెలల నుంచి చెల్లించటం లేదని బ్యాంకర్లు తెలిపారు. డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ పొదుపు డబ్బు మాత్రమే చెల్లించి, తీసుకున్న రుణాలను జమ కట్టడం లేదని వారు పేర్కొన్నారు. అన్ని రకాల రుణాలు జమ పడకపోవటంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు బకాయిలపై ఒత్తిడి అధికంగా వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీని అమలు చేయటంలో సాధ్యాసాధ్యాలపై కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. -
విశాఖ ఉక్కు టర్నోవర్ 875కోట్లు
ఉక్కునగరం, న్యూస్‌లైన్: నవరత్న సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మంచి ఫలితాలను సాధించింది. ఏప్రిల్ నెలలో రూ.875కోట్ల టర్నోవర్ సాధించి 51శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో వైర్‌రాడ్ మిల్ ఉత్పత్తులు 67శాతం వృద్ధితో రూ.75కోట్లు కలిగి ఉన్నది. ఏప్రిల్ నెలలో ద్రవ ఉక్కు ఉత్పత్తి 16శాతం వృద్ధి నమోదు సాధించింది. ఈ సందర్భంగా సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో నియంత్రణ విధించినప్పటికీ ఉద్యోగుల అంకితభావం వల్ల ఉత్పత్తి స్థాయిలను పెంచడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో అదే విశ్వాసం, నమ్మకంతో పనితీరును కనబర్చి ప్లాంట్ పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు. -
మీకు మీరే బాస్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఎంటర్ప్రెన్యూర్ సెల్.. ఈసెల్.. ఇంక్యుబేషన్ సెంటర్.. స్టార్ట్ అప్స్.. సీడ్ ఫండింగ్... ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీలు, ఐఐఎంలలో వీటి గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే స్వయం ఉపాధి దిశగా ఆలోచించి సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేయడం. ఆ కంపెనీ ద్వారా తాను ఉపాధిని పొందడమే కాకుండా తనతోపాటు మరికొంతమందికి జీవనోపాధిని కల్పించడం. ఇలా సొంతంగా సంస్థను ఏర్పాటు చేయడాన్నే స్టార్ట్ అప్స్ అంటున్నారు! వ్యాపార, వాణిజ్య రంగాల్లో శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్న మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ముఖ్యంగా యువత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై ఎంతో ఉత్సాహం చూపిస్తోంది. ‘మీ కలల సౌధాలను మీరే నిర్మించడం మొదలు పెట్టండి..! లేకుంటే వేరే వాళ్లు తమ కలల సౌధాల నిర్మాణం కోసం మిమ్మల్ని నియమించుకుంటారు.!!’ దేశంలోని యువత స్టార్ట్-అప్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పడానికి ఫణీంద్ర సామ, సచిన్ బన్సాల్‌ల విజయాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇక్కడ గమనించాల్సిన అంశం వీళ్లు తమ బిజినెస్ స్టార్ట్ అప్స్ కోసం రూ.కోట్లు కుమ్మరించలేదు. తెల్లారేసరికల్లా రూ.కోట్ల టర్నోవర్ సాధించాలనీ కోరుకోలేదు. కానీ నిర్దిష్టమైన ఆలోచన, స్పష్టమైన లక్ష్యంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఎంతో ముందు చూపుతో ముందుకు కదిలారు. రాత్రింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించారు. తాము ఉన్నతంగా ఎదగడమే కాకుండా వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే యువత వీళ్లను స్ఫూర్తిగా తీసుకుంటే అద్భుత లక్ష్యాలు సాధించడం తేలికే. కార్యక్షేత్రంలో అడుగుపెట్టేముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి.. 1 ఆలోచన.. ఆసక్తి . ఒక వ్యాపారాన్ని, కంపెనీని ప్రారంభించాలనుకునే వ్యక్తులకు స్పష్టమైన ఆలోచన, అమితమైన ఆసక్తి, మార్కె ట్ అవకాశాలపై దూరదృష్టి ఉండాలి. ముందుగా ఏ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు? అనే అంశంపై పూర్తి అవగాహన ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రారంభించాలనుకుంటున్న బిజినెస్ తమ అభిరుచులకనుగుణంగా ఉండాలి. వ్యాపార ఆలోచనలకు, వ్యక్తిగత ఆసక్తి ఆయుధంగా నిలుస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు అవగాహన ఉన్న రంగంపై దృష్టి సారిస్తే కార్యక్షేత్రంలో కలిసొచ్చే ఎన్నో అవకాశాలున్నాయి. ఈ క్రమంలో.. మూడు అంశాలు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అవి.. మీరు ఎంచుకునే రంగంలో సమస్యలను గుర్తించి ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడం.అలాంటి అవకాశాలను గుర్తించాక, వాటిని అమలు చేసే దిశగా ఆలోచించడం. అవకాశాలు, ఆలోచనలపై స్పష్టమైన అవగాహన వచ్చాక, తాను ప్రారంభించాలనుకునే వ్యాపారానికి సంబంధించి బిజినెస్ ప్లాన్ రూపొందించుకుని, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవడం. ఈ రిపోర్ట్ దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు, అసలైన వినియోగదారులు ఎవరు? అనే అంశాలతో సమగ్రంగా ఉండాలి. 2 పెట్టుబడులపై దృష్టి ఆలోచన, ఆసక్తి, అవకాశాలు వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన వచ్చాక తక్షణం దృష్టి సారించాల్సిన అంశం పెట్టుబడులు. స్టార్ట్ అప్స్ ఏర్పాటులో ఎదురవుతున్న ప్రధాన సమస్య కూడా ఇదే. ఎందుకంటే ఇన్వెస్టర్లను సంతృప్తిపరిచే విధంగా తమ వ్యాపార ఆలోచనను వివరించడం, వారిని ఒప్పించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ప్రస్తుతం చక్కటి వ్యాపార ఆలోచనలతో ముందుకొచ్చేవారికి వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి చేయూత లభిస్తోంది. ఉదాహరణకు దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతి ఏటా ఐడియా చాలెంజ్ పేరుతో ఔత్సాహిక యువత నుంచి వ్యాపార ఆలోచనలను సేకరించి, టాప్ టెన్‌లో నిలిచిన ఐడియాలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. అంతేకాకుండా వ్యాపారం ప్రారంభం దిశగా తోడ్పాటునూ అందిస్తోంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఐఐఎంలు, ఐఐటీలు కూడా భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించి ఆర్థిక చేయూతనిచ్చే విధంగా కృషి చేస్తున్నాయి. ఏటా క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తూ మంచి వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్వేషించి అందిపుచ్చుకుంటే పెట్టుబడుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడులను సాధించాలంటే చక్కటి ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించడం, మెచ్చే విధంగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగే నైపుణ్యం ఎంతో అవసరం. 3 బెస్ట్ వర్క్ టీం ఆలోచనలు కలిసొచ్చాయి.. పెట్టుబడులు లభించాయి.. ఇక తదుపరి దశ కార్యోన్ముఖులు కావడం. ఈ దశలో ముందుగా దృష్టి సారించాల్సిన అంశం చక్కటి వర్క్ టీంను ఎంచుకోవడం. సంబంధిత వ్యాపారం సుస్థిరాభివృద్ధి సాధించాలంటే పనిచేసే బృందం కూడా అంతే నిబద్ధతతో ఉండాలి. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంస్థల విషయంలో లీడ్ చేసే మొదటి 20 మంది వ్యక్తులను తీసుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసు బాయ్ నుంచి సీఈవో వరకు ప్రతి హోదా, వారు నిర్వహించే విధులు, ప్రతి ఒక్కరి పనితీరు స్టార్ట్ అప్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఒక వ్యక్తిగా రూపొందించిన ఆలోచనల అమలుకు నిపుణులైన బృందం సహకారం ఎంతో అవసరం. కాబట్టి వ్యాపార నిర్వహణకు సంబంధించి చక్కటి వ్యూహాలను అమలు చేసే నిపుణులను నియమించుకోవాలి. కొన్ని సందర్భాల్లో తమకంటే అనుభవజ్ఞులైన వారిని ఒప్పించే విషయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఇక్కడ కూడా కలిసొచ్చే మంత్రం ఒకటే. అదే ప్రాజెక్ట్ ప్రజెంటేషన్. దీని ద్వారా ఎంతటి వారినైనా మెప్పించవచ్చు. 4 టార్గెట్ కస్టమర్స్ ముఖ్యమైన అంశం వినియోగదారులను ఆకట్టుకోవడం. తమ వ్యాపారానికి తగిన కస్టమర్స్ సెగ్మెంట్‌ను గుర్తించి వారిని ఆకర్షించేలా తమ ఉత్పత్తులు, లేదా సేవల గురించి తెలియజేయడం. ఈ విషయంలో ప్రసార సాధనాల ద్వారా ప్రకటనలు కీలకంగా మారతాయి. కొత్తగా ఏర్పాటైన సంస్థలు కేవలం ప్రసార సాధనాలకే పరిమితం కాకుండా తమ టార్గెట్ వినియోగదారుల వద్దకు నేరుగా వెళ్లడం మరింత లాభిస్తుంది. అప్పటికే ఆ రంగంలో నిలదొక్కుకున్న సంస్థల పోటీని తట్టుకోవాలంటే ప్రారంభంలో ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. పోటీదారుల ఉత్పత్తులు లేదా సేవల కంటే తమవి ఎంత నాణ్యమైనవో, ఎంత త్వరగా ఆ సేవలు అందించగలం అనే అంశాలను వివరించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించే వీలుంటుంది. 5 పోటీని తట్టుకునే విధంగా కొత్త కంపెనీల ఏర్పాటులో ప్రధాన సమస్య, సవాలు.. మార్కెట్ పోటీ! చాలామంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ పోటీ కారణంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ దశలోనే వెనుకంజ వేస్తున్నారనేది నిపుణుల అభిప్రాయం. ఈ పోటీని తట్టుకునే విధంగా మానసిక సంసిద్ధత ఉండాలి. పోటీ ఉంటేనే కొత్త ఆలోచనలు, సృజనాత్మకత వెలుగులోకి వస్తాయి. తద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా తమ ఉత్పత్తులను వృద్ధి చేయొచ్చు. 6 భవిష్యత్ సవాళ్లపై అంచనా సమీప పోటీదార్ల మార్కెట్‌తోపాటు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ దృష్టి సారించాల్సిన మరో ప్రధాన అంశం.. భవిష్యత్ సవాళ్లను అంచనా వేయడం. కేవలం తాము వ్యాపారం ప్రారంభించే సమయానికి ఆ రంగంలో ఉన్న సమస్యలను గుర్తించడమే కాకుండా.. రానున్న కాలంలో ఆ రంగంలో ఎదురవనున్న ఇబ్బందులపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా తమ సంస్థ పరంగా ఎదురయ్యే సమస్యలను గుర్తెరగాలి. అప్పుడే ప్రాజెక్ట్ రిపోర్ట్ సమయంలోనే దీర్ఘకాలిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవడానికి వీలవుతుంది. ఈ క్రమంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు.. సంస్థ కోణంలో ఆలోచిస్తే.. వస్తువులు లేదా సేవల డిమాండ్ - సప్లై అంశాలు మొదలు భవిష్యత్ లాభనష్టాలు, ఊహించని వ్యయాల అంచనా. ఇక మార్కెట్ కోణంలో చూస్తే.. నియంత్రణ సంస్థల విధానాలు, వ్యూహాల వరకు అన్ని అంశాలపై స్పష్టత అవసరం. ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు రూపొందించుకోవాలి. 7 మార్పులతోపాటు మారేలా మరో ప్రధాన వ్యూహం.. మార్పులకు వెంటనే స్పందించడం. తమ వ్యాపార రంగంలో సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగా మారి, అందుకు తగిన రీతిలో సేవలు లేదా ఉత్పత్తుల రూపకల్పనకు ఉపక్రమించడం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఇప్పుడే వ్యాపారం ప్రారంభించదలుచుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. గత కొన్నేళ్లుగా సంబంధిత రంగంలో వచ్చిన మార్పులను పరిశీలిస్తే ప్రాథమిక అంచనాను రూపొందించుకోవచ్చు. తద్వారా భవిష్యత్ మార్పులను ఊహించే అవకా 8 నిరంతర నిర్వహణ, శ్రమించేతత మానవ వనరుల నుంచి మార్కెట్ పోటీలో నిలదొక్కుకోవడం వరకు.. అన్ని రకాలుగా సుస్థిరత సాధి ంచినా..ఎన్నడూ మ రిచిపోకూడని అంశా లు.. నిరంతర నిర్వహణ, శ్రమించేతత్వం. చాలామంది వ్యాపారవేత్తలు సంస్థకు ఒక గుర్తింపు లభించాక కొంత విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనతో బాధ్యతలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టరు. ఇది సరికాదు. సంస్థ ఏ స్థాయికి చేరుకున్నా.. ఎంతటి లాభాలను ఆర్జిస్తున్నా.. వ్యాపారవేత్త నిత్యం కార్యక్షేత్రంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే.. నిర్వహణ లోపాలు తలెత్తి సంస్థ మనుగడే ప్రమాదంలో పడే ఆస్కారముంటుంది. సంస్థను ప్రారంభించే ముందు ఇలాంటి దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి. 9 సక్సెస్‌కు లేదు ప్రామాణికం ఔత్సాహిక వ్యాపారవేత్తలు గుర్తుంచుకోవాల్సిన అంశం.. సక్సెస్‌కు నిర్దిష్ట ప్రామాణికం అంటూ ఏదీ ఉండదు అని. లాభా లు గడించడం, మా ర్కెట్లో సుస్థిర స్థానం సంపాదించడమే సక్సెస్ అనుకోవడం సరికాదు. వ్యాపారపరంగా విజయం అంటే.. నిత్యనూతనంగా వినియోగదారులను ఆకట్టుకోవడం. అందుకు తగిన రీతిలో వ్యాపారాభివృద్ధి చేసే విధంగా వ్యూహాలు రూపొందించడం. 10 ఎగ్జిట్ పాలసీ సంబంధిత వ్యక్తులు తమ దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా ఆలోచించుకోవాల్సిన అంశం ఎగ్జి ట్ పాలసీ. అంటే.. వ్యాపారం నుంచి విరమించుకోవడం. దేశంలో చాలా సంస్థలు.. లాభాల బాటలో పయనిస్తూ కూడా యజమాని తప్పుకున్నాక మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితులను కూడా ముందుగానే ఊహించి తగిన ఎగ్జిట్ పాలసీని రూపొందించుకోవాలి. అంతేకాకుండా మరెన్నో లాభదాయక సంస్థలు తమకున్న గుడ్‌విల్ ద్వారా మరో సంస్థకు మేజర్ స్టేక్‌ను విక్రయించి కొన్ని ఏళ్ల తర్వాత లభించే ఆదాయాన్ని ముందుగానే పొందుతున్నాయి. ఇందుకు మంచి ఉదాహరణ ‘రెడ్‌బస్ ఆన్లైన్ పోర్టల్’. కేవలం కొన్ని లక్షల వ్యయంతో ప్రారంభమైన ఈ సంస్థను గతేడాది భారీ మొత్తానికి ఇబిబో గ్రూప్ కొనుగోలు చేసింది. ఔత్సాహికులకు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రైవేటీకరణ, సరళీకరణలో భాగంగా ఇప్పుడు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రైవేటు రంగం నుంచి.. ప్రభుత్వం తరపున ఎన్నో ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ సంస్థ ద్వారా పలు పథకాల కింద యువ వ్యాపారవేత్తలకు ఆర్థిక చేయూత నందిస్తున్నాం. ఇది రూ.2 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉంటోంది. అదేవిధంగా ప్రైవేట్ రంగం నుంచి, ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు, వాటి అలుమ్ని అసోసియేషన్ల నుంచి కూడా ఆర్థికంగా తోడ్పాటు లభిస్తోంది. కావాల్సిందల్లా చక్కటి ఆలోచన, ఫండింగ్ మెంటార్స్‌ను మెప్పించే ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించడం. వీటితోపాటు వాటికి సమర్థవంతంగా కార్యరూపం ఇచ్చే విధంగా వ్యవహరించడం. - సాక్షి కులకర్ణి, డెరైక్టర్, ఎస్ఎంబీడీ చాంబర్ ఆఫ్ ఇండియా