రూ.150 కోట్లతో...  ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ కొత్త ప్లాంటు | MSR Copper new plant with Rs 150 crore | Sakshi
Sakshi News home page

రూ.150 కోట్లతో...  ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ కొత్త ప్లాంటు

Published Fri, Nov 9 2018 1:43 AM | Last Updated on Fri, Nov 9 2018 1:43 AM

MSR Copper new plant with Rs 150 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డాక్టర్‌ కాపర్‌ పేరుతో రాగి వాటర్‌ బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ లిమిటెడ్‌ (గతంలో ఎంఎస్‌ఆర్‌ ఇండియా)... భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ.150 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ వద్ద ఏర్పాటు చేసే ఈ ప్లాంటు తయారీ సామర్థ్యం నెలకు 600 టన్నులు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దుతున్న ఈ ఫ్యాక్టరీలో             నవంబరు చివరికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని, వైర్లు, రాగి ఉత్పత్తులు, విద్యుత్‌ పరికరాల వంటి 25 రకాలను ఇక్కడ తయారు చేస్తామని ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ఎండీ కె.వి.రాజశేఖర్‌ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఫ్యాక్టరీకి కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నట్టు తెలియజేశారు.
 
నెలకు 10 లక్షల బాటిళ్లు.. 
ప్రస్తుతం కంపెనీ నెలకు 1.5– 2 లక్షల డాక్టర్‌ కాపర్‌ బాటిళ్లను విక్రయిస్తోంది. భారత్‌లో దక్షిణాదిన ఇవి అందుబాటులో ఉన్నాయి. యూఎస్, సింగపూర్, మలేషియా, దుబాయి, కెన్యాలో సైతం విక్రయిస్తోంది. నూతన ప్లాంటు రాకతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లకు చేరుతుంది. దీంతో కొత్త మార్కెట్లలో అడుగు పెడతామని కంపెనీ తెలిపింది. డిసెంబరు నుంచి ఉత్తరాది మార్కెట్లకు సరఫరా చేయనున్నారు. అలాగే ఆస్ట్రేలియా, యూరప్‌కు ఎగుమతి చేస్తామని, బాటిళ్ల విక్రయాల్లో ఎగుమతుల వాటా 20 శాతం ఉందని రాజశేఖర్‌ చెప్పారు. 

రెండింతల టర్నోవర్‌.. 
ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. 2018–19లో రూ.250– 300 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజశేఖర్‌ వెల్లడించారు. ‘‘కొత్త ప్లాంటులో ఉత్పత్తి నవంబరు చివరి నాటికి 50 శాతం, డిసెంబరులో 100 శాతానికి చేరుకుంటుంది. డాక్టర్‌ కాపర్‌కు డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. కంపెనీ తయారు చేస్తున్న ఇతర ఫుడ్‌ ప్రొడక్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. నూతన మార్కెట్లలో విస్తరిస్తాం. కాపర్‌ ఉత్పత్తుల ద్వారానే నెలకు రూ.40 కోట్ల వరకు ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫ్యాక్టరీతో 400 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement