లక్ష్యం నిర్ధారించుకుని ఆ దిశగా ముందుకు
రూ.8,300 కోట్ల ఆదాయం సాధించేందుకు ఆర్టీసీ సిద్ధం
తొలి త్రైమాసికంలో రూ.2 వేల కోట్లకు పైగా రెవెన్యూ
త్వరలో 500 కొత్త బస్సులు.. పెరగనున్న టికెట్ ఆదాయం
‘మహాలక్ష్మి’వల్ల రెట్టింపైన మహిళా ప్రయాణికుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తొలిసారి ఒక బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,300 కోట్లు) టర్నోవర్ క్లబ్‌లో చేరేందుకు లక్ష్యం నిర్ధారించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సమకూరిన ఆదాయంతో సంస్థలో కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో మిగతా మూడు త్రైమాసికాల్లో దానికి తగ్గకుండా ఆదాయాన్ని సాధించటం ద్వారా ఒక బిలియన్ డాలర్ టర్నోవర్ సాధించే అరుదైన మైలు రాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది ఆర్టీసీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టంగా మిగులుతుందని సంస్థ భావిస్తోంది. ఓవైపు భారీగా రికార్డవుతున్న సంస్థాగత వ్యయం, అప్పులపై చెల్లిస్తున్న రూ.వందల కోట్ల వడ్డీ.. వెరసి సంస్థకు కొంత నష్టాలనే మిగులుస్తున్నా, ఆదాయ పరంగా ఈ కొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించుకుంది.
ఆదాయం పెంపుపైనే దృష్టి పెట్టి..
గత కొంతకాలంగా ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ఆర్టీసీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఏడాదిన్నర క్రితం పలు రకాల సెస్‌లను సవరించి పరోక్షంగా బస్ చార్జీలను పెంచింది. దాని ద్వారా ఆదాయం భారీగా పెరిగింది. ఎండీ సజ్జనార్ వినూత్న ఆలోచనలతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ ఆదాయం పెంచటంలో సక్సెస్ అయ్యారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్పేర్‌లో ఉన్నవి సహా అన్ని బస్సులను రోడ్డెక్కించి, సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగేలా చూస్తున్నారు.
లక్షే లక్ష్యం పేరుతో .. ప్రతి డిపో నిత్యం రూ.లక్ష వరకు అదనపు ఆదాయం సాధించేలా కొత్త టార్గెట్‌ను అమలు చేస్తున్నారు. ఫలితంగా 38 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఇలాంటి ప్రత్యేక చర్యల వల్ల గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.6,942 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది రూ.2 వేల కోట్లను మించింది.
మహిళల ఉచిత ప్రయాణంతో..
ఉచితంగా ప్రయాణించే మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. వాటి విలువను లెక్కగట్టి ప్రభుత్వం ఆరీ్టసీకి రీయింబర్స్ చేయాల్సి ఉంది. మహిళల సంఖ్య భారీగా పెరగటంతో ఆర్టీసీ ఆదాయం కూడా బాగా పెరిగింది. ఆ మేరకు తొలి త్రైమాసిక ఆదాయం రూ.2 వేల కోట్లను దాటింది.
ఇక త్వరలో దశలవారీగా 500 వరకు కొత్త బస్సులు సమకూరనున్నాయి. వీటి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.8,300 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. దాన్ని మన రూపాయల్లో కాకుండా ప్రత్యేకంగా డాలర్లలో పే ర్కొంటే బిలియన్ డాలర్ల మొత్తంగా అవుతుంది. దీంతో ఆ పేరుతో ఈ లక్ష్యాన్ని నిర్ధారించుకున్నారు.
అంకెల్లో ఆదాయం.. వాస్తవరూపందాలుస్తుందా?
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.2,350 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ అయ్యాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆర్టీసీకి రూ.1,740 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది. మిగతా రూ.610 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. కానీ, ‘‘బిలియన్ డాలర్ల టర్నోవర్’’లో మాత్రం రూ.2,350 కోట్ల మొత్తాన్ని ఆదాయంగా చూపుతారు. అంటే అంకెల్లో ఆదాయం కనిపిస్తుంది, వాస్తవంగా లోటులో ఉంటుంది. అంకెల్లో ఉన్న ఆదాయం వాస్తవం కావాలంటే ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తేనే అసలు ఆదాయం
ఆర్టీసీ లో 2015లో చేసిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల మొత్తాన్ని ఉద్యోగులకు ఇవ్వనున్నట్టు గత ఫిబ్రవరిలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించిన రూ.281 కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. కానీ, కేవలం రూ.81 కోట్లు మాత్రమే రావటంతో ఆర్టీసీ దానికి డ్రైవర్లకు అందించింది. మిగతా నిధులు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు.
త్వరలో చెల్లిస్తామంటూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటున్నారే తప్ప, ఎప్పటికి ఇస్తారో మాత్రం చెప్పలేకపోతున్నారు. భవిష్యనిధికి బకాయి చెల్లించకపోవటంతో ఆ సంస్థ ఇటీవల ఏకంగా ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. సంస్థ ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో బిలియన్ డాలర్ల టర్నోవర్ లాంటి ఫీట్ చేపట్టడం విశేషం. ప్రభుత్వపరంగా ఆరీ్టసీకి పూర్తి చేయూతనందిస్తే ఈ ఫీట్ ప్రత్యక్షంగా సంస్థకు ఉపయోగంగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment