బిజినెస్‌ ఢమాల్‌ | huge losses in bussiness over currancy problems | Sakshi
Sakshi News home page

బిజినెస్‌ ఢమాల్‌

Published Fri, Nov 18 2016 2:08 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారాలు లేక వెలవెలబోతున్న చార్మినార్‌ ప్రాంతం - Sakshi

పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారాలు లేక వెలవెలబోతున్న చార్మినార్‌ ప్రాంతం

‘నోటు దెబ్బ’కు నగరంలో వెలవెలబోతున్న వ్యాపారాలు
♦ రోజూ రూ. 1,600 కోట్ల వ్యాపారం.. రద్దు తర్వాత రూ. 200 కోట్లకు తగ్గిన వైనం
♦ వినియోగదారులు లేక విలవిల్లాడుతున్న వ్యాపార, వాణిజ్య కూడళ్లు
♦ నిత్యం రూ.10 కోట్ల వ్యాపారం చేసే ఓ మాల్‌కు గడచిన వారం టర్నోవర్‌ రూ.3 కోట్లు
♦ హైటెక్‌ సిటీలోని మరో మాల్‌లో రోజుకు రూ.15 కోట్లు.. ఇప్పుడు కనాకష్టంగా కోటిన్నర
♦ సినిమా థియేటర్లలో సగానికి పైగా సీట్లు ఖాళీ.. బార్లు, రెస్టారెంట్లు, వైన్‌ షాపులు కుదేలు
♦ పడిపోయిన జ్యువెలరీ వ్యాపారం.. పెద్ద ఎత్తున నష్టపోతున్న ఫైవ్‌స్టార్‌ హోటళ్లు


సాక్షి, హైదరాబాద్‌
పెద్ద నోట్ల రద్దు రాజధాని నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలపై పెను ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువులు మొదలుకుని నగల దుకాణాల దాకా, వినోదాన్ని పంచే సినిమా థియేటర్ల నుంచి మద్యం దుకాణాల వరకూ అన్నీ విలవిలలాడుతున్నాయి. సాధారణంగా ప్రతిరోజూ నగరంలో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు రోజూ రూ.1,600 కోట్ల వ్యాపారం చేస్తుంటాయి. అయితే పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఈ వారంలో జరిగిన వ్యాపార కార్యకలాపాల మొత్తం సగటున రూ.200 కోట్లకు మించలేదు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి వచ్చే వ్యాపారుల టర్నోవర్‌ లెక్క మాత్రమే ఇది. ఇక వ్యాట్‌ పరిధిలోకి రాని వ్యాపారాల మొత్తం ఇందులో కనీసం నాలుగోవంతు అయినా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఆ వ్యాపారాలు కూడా పూర్తిగా పడిపోయాయి. నగదు ఉపసంహరణపై పరిమితి కారణంగా చిరు వ్యాపారులు దుకాణాలనే మూసుకున్నారు. వినియోగదారులు లేక కాయగూరల వ్యాపారులు సగానికి సగం ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. కాయగూరలు చౌకగా లభించే రైతు బజార్లలోనూ వినియోగదారులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. హోల్‌సేల్‌ ధరలకు విక్రయాలు చేసే మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్‌కు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తుంటారు. గడచిన వారం రోజులుగా ఈ మార్కెట్‌లో 50 శాతం దుకాణాలు మూసి ఉంచారు. చిల్లర లేదని అక్కడి వ్యాపారులు ఏకంగా ఉల్లిపాయల క్రయ విక్రయాలను నిలుపుదల చేసే స్థాయికి సంక్షోభం చేరుకుంది.

థియేటర్ల నుంచి విమానాల దాకా..
నాలుగు రోజుల ముందు ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే తప్ప టికెట్‌ లభించని ప్రముఖ మల్టీప్లెక్స్‌ల్లో గడచిన శని, ఆదివారాల్లో సగం సీట్లు కూడా నిండలేదు. ఇక హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులు కూడా సగానికి తక్కువగా ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హైదరాబాద్‌–ఢిల్లీ మినహా ఏ సెక్టార్‌లోనూ ఆక్సుపెన్సీ రేషియో 50 శాతం కూడా లేదని విమానయాన వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లోని ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో 70 శాతానికి పైగా గదులు ఖాళీగా ఉన్నాయి. గడచిన వారం రోజుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే ఈ హోటళ్లకు సంబంధించి రూ.450 కోట్ల దాకా వ్యాపారం ఆగిపోయింది.

సందడి లేని మాల్స్, వాణిజ్య కూడళ్లు
హైటెక్‌ సిటీలో నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే ఓ మాల్‌లో గురువారం సాయంత్రం జనం పదుల సంఖ్యలో ఉన్నారు. దాదాపు అంతే రద్దీగా ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–1లోని మాల్‌లోనూ ఇదే పరిస్థితి. చౌకధరలకు అన్ని రకాల దుస్తులు లభించే పంజాగుట్టలోని ఓ మాల్‌లోని పార్కింగ్‌ ఏరియా వాహనాలు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. ఇక చెప్పుల నుంచి ఏసీల దాకా ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చే వివిధ వ్యాపారాల టర్నోవర్‌ నిత్యం రూ.750 కోట్ల దాకా ఉంటుంది. పెద్ద నోట్ల రద్దుతో ఈ వ్యాపారం సగటున రూ.85 కోట్లకు పడిపోయింది. కూర్చోవడానికి సీటు కూడా దొరకని అబిడ్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో వారం రోజులుగా కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ చెప్పుల దుకాణానికి రాజధాని నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. మాదాపూర్‌లో రోజు రూ.15 కోట్ల మేర వ్యాపారం చేసే ఓ మాల్‌లో గడచిన వారం రోజులుగా వసూలైన మొత్తం 10.5 కోట్లు మాత్రమే. ఇక్కడ నగదు కంటే క్రెడిట్, డెబిట్‌ కార్డులు వాడే వినియోగదారులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ మాత్రం వ్యాపారం జరిగింది.

బంజారాహిల్స్‌లోని మరో మాల్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది. రోజు రూ.10 కోట్ల వ్యాపారం చేసే ఈ మాల్‌ గడచిన వారం రోజులుగా వసూలు చేసిన మొత్తం రూ.3 కోట్లు మాత్రమే. జనంతో కిటకిటలాడే మొబైల్‌ షాపులకు వారం రోజులుగా వినియోగదారులు కరువయ్యారు. అబిడ్స్‌ కేంద్రంగా రోజు సగటున రూ.60 కోట్ల వ్యాపారం జరుగుతుండగా వారం రోజుల్లో అది రూ.4 కోట్లకు పడిపోయింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చివరకు మిఠాయి దుకాణాలకు కూడా తాకింది. రోజుకు రూ.5 లక్షల వ్యాపారం చేసే సోమాజిగూడలోని ఓ మిఠాయి షాపు వారం రోజులుగా రూ.3 లక్షల విలువైన మిఠాయిలు మాత్రమే అమ్మగలిగింది.

నగల దుకాణాలు వెలవెల
రాజధానిలో నగల దుకాణాలు నిత్యం వేలాది మంది వినియోగదారులతో కళకళలాడుతూ ఉండేవి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ దుకాణాలపై తీవ్రంగా పడింది. కొనుగోలుదారులు రావడం లేదంటూ కొన్ని ప్రముఖ నగల దుకాణాలు తమ ఉద్యోగులకు మూడు నుంచి నాలుగు రోజులు స్వచ్ఛంద సెలవులను ప్రకటించాయి, మరికొన్ని దుకాణాలు మూసే  ఉంటున్నాయి. నగల వర్తకుల సంఘం అందించిన సమాచారం మేరకు.. రాజధానిలో నిత్యం కూ.250 కోట్ల విలువైన నగల వ్యాపారం జరుగుతుంది. కానీ పెద్ద నోట్ల రద్దు ప్రభావంతోపాటు కొద్దిరోజుల్లో బ్యాంక్‌ లాకర్లనూ కూడా సీజ్‌ చేస్తారన్న ప్రచారంతో టర్నోవర్‌ దారుణంగా పడిపోయింది. గడచిన వారం రోజుల్లో రూ.25 కోట్ల విలువైన నగల వ్యాపారం కూడా జరగలేదు. రోజూ రూ.12 కోట్ల మేర వ్యాపారం చేసే ఓ ప్రముఖ నగల దుకాణం గడచిన వారంలో చేసిన వ్యాపారం కోటి రూపాయలు మించి లేదు. బషీర్‌బాగ్‌ చౌరస్తా నుంచి లిబర్టీ దాకా బారులు తీరి ఉన్న నగల దుకాణాల్లో కొన్ని వారం నుంచే మూసే ఉన్నాయి. తెరిచిన దుకాణాల్లో నగలు కొనుగోలు చేయడానికి వచ్చిన వారు పట్టుమని పది మంది కూడా లేరు. పెద్ద నోట్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. వారం రోజుల్లో జంట నగరాల్లో నగల దుకాణాల టర్నోవర్‌ రూ.7 కోట్లు మించి లేకపోవడం గమనార్హం.

మద్యం, మాంసానికీ దూరం
బ్యాంక్‌ల నుంచి నగదు తీసుకునే అవకాశం తక్కువగా ఉండటం, ఏటీఎంలు పని చేయకపోవడంతో తమ దగ్గర ఉన్న నగదును ప్రజలు జాగ్రత్తగా వినియోగిస్తున్నారు. ఈ కారణంగా నగరంలోని మద్యం, మాంసం దుకాణాల్లో విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ప్రతి ఆదివారం రూ.6 లక్షల రూపాయల మాంసం విక్రయించే పంజాగుట్టలోని ఓ దుకాణం గడచిన ఆదివారం అమ్మిన మాంసం మొత్తం విలువ రూ.2 లక్షలే! హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రముఖ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పెద్దనోట్ల రద్దుకు ముందు రోజుకు సగటున రూ.12 లక్షల వ్యాపారం చేసేది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత వారం రోజుల్లో ఆ దుకాణం సగటు వ్యాపారం కేవలం రూ.2.5 లక్షలు. రోజుకు రూ.లక్ష అంతకంటే ఎక్కువ వ్యాపారంచేసే బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఇప్పుడు కనాకష్టంగా రూ.40 నుంచి 50 వేల మేర వ్యాపారం చేస్తున్నాయి. మద్యం దుకాణాలదీ అదే తీరు...అమ్మకాలు దారుణంగా పడిపోయాయని ఎక్పైజ్‌ అధికారులే చెపుతున్నారు. మల్టీప్లెక్స్‌లు సహా సినిమా థియేటర్లలో గడచిన వారం రోజులుగా సగం సీట్లు కూడా నిండటం లేదు. ఆన్‌లైన్‌ బుకింగ్‌లు 90 శాతం పడిపోయాయి. థియేటర్లలోని బుకింగ్‌ కౌంటర్ల దగ్గర జనమే కనిపించడం లేదు. ఫలితంగా నిర్మాతలు కొందరు తమ సినిమా విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.

విమాన సర్వీసులు, స్టార్‌ హోటళ్లకూ ఇబ్బందులే
పెద్ద నోట్ల రద్దు ప్రభావం విమాన సర్వీసులతో పాటు రాజధానిలోని స్టార్‌ హోటళ్లపైనా పడింది. విమానయాన వర్గాలు అందించిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌– ఢిల్లీ మినహా ఇతర అన్ని సెక్టార్లలో 50 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ముంబై,  అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చే విమానాలు 40 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ రెండు నగరాల నుంచి పెద్దఎత్తున వ్యాపారులు నగరానికి వచ్చి ఇక్కడ ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేస్తారు. ఇప్పుడు ఈ రెండు నగరాలతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా తగ్గడంతో వారం రోజుల్లో వాటి వ్యాపారం రూ.450 కోట్ల మేర పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement