పెద్ద నోట్ల రద్దు రాజధాని నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలపై పెను ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువులు మొదలుకుని నగల దుకాణాల దాకా, వినోదాన్ని పంచే సినిమా థియేటర్ల నుంచి మద్యం దుకాణాల వరకూ అన్నీ విలవిలలాడుతున్నాయి. సాధారణంగా ప్రతిరోజూ నగరంలో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు రోజూ రూ.1,600 కోట్ల వ్యాపారం చేస్తుంటాయి. అయితే పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఈ వారంలో జరిగిన వ్యాపార కార్యకలాపాల మొత్తం సగటున రూ.200 కోట్లకు మించలేదు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి వచ్చే వ్యాపారుల టర్నోవర్ లెక్క మాత్రమే ఇది. ఇక వ్యాట్ పరిధిలోకి రాని వ్యాపారాల మొత్తం ఇందులో కనీసం నాలుగోవంతు అయినా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఆ వ్యాపారాలు కూడా పూర్తిగా పడిపోయాయి. నగదు ఉపసంహరణపై పరిమితి కారణంగా చిరు వ్యాపారులు దుకాణాలనే మూసుకున్నారు. వినియోగదారులు లేక కాయగూరల వ్యాపారులు సగానికి సగం ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. కాయగూరలు చౌకగా లభించే రైతు బజార్లలోనూ వినియోగదారులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు.