హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు హిందుజా గ్రూప్‌లో భాగమైన జీవోసీఎల్ కార్పొరేషన్ సీఈవో పంకజ్ కుమార్ వెల్లడించారు. ఎక్స్‌ప్లోజివ్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు, ధరల పెరుగుదల తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని మంగళవారం ప్రకటించారు.
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు సుమారు రూ. 559 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఎక్స్‌ప్లోజివ్స్ ఎగుమతులపైనా, ఎలక్ట్రానిక్స్ విభాగంపైనా మరింతగా దృష్టి పెడుతున్నామని కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు రూ. 40 కోట్లుగా ఉన్న ఎక్స్‌ప్లోజివ్స్ ఎగుమతులను ఈ ఏడాది రూ. 100 కోట్లకు పెంచుకోనున్నట్లు వివరించారు. సూడాన్, టాంజానియా తదితర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్ విభాగం ఆదాయం సుమారు రూ. 20 కోట్లుగా ఉందని, వచ్చే ఏడాది-ఏడాదిన్నర వ్యవధిలో దీన్ని రూ. 100 కోట్లకు పెంచుకోనున్నామని పంకజ్ కుమార్ పేర్కొన్నారు.
రూ. 100 కోట్ల పెట్టుబడులు ..
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పంకజ్ వివరించారు. ఇందులో భాగంగా బళ్లారిలో ఎక్స్‌ప్లోజివ్స్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి రెండో లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో దాదాపు 100 మంది ఉండగా, రాబోయే రెండు-మూడేళ్లలో ఈ సంఖ్యను 300 వరకూ పెంచుకునే అవకాశం ఉందని పంకజ్ చెప్పారు.
ముడి సరుకు రేట్ల భారం..
వివిధ కారణాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో ముడి వస్తువుల ధరలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని పంకజ్ తెలిపారు. కొన్నాళ్ల క్రితం 200 డాలర్లుగా ఉన్న టన్ను అమోనియా రేటు ఏకంగా సుమారు 900 డాలర్లకు ఎగిసిందని, ప్రస్తుతం 700 డాలర్ల స్థాయిలో ఉందని పేర్కొన్నారు. తదనుగుణంగా తాము కూడా కొంత మేర ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వచ్చే 3-4 నెలల్లో ముడి వస్తువుల రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందన్నారు. కంపెనీకి హైదరాబాద్‌లో ఉన్న 42.25 ఎకరాల మిగులు స్థలంలో 32 ఎకరాల విక్రయ ప్రక్రియ పూర్తయిందని పంకజ్ తెలిపారు. ఈ డీల్ విలువ రూ. 326 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment