GOCL Corporation
-
రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు హిందుజా గ్రూప్‌లో భాగమైన జీవోసీఎల్ కార్పొరేషన్ సీఈవో పంకజ్ కుమార్ వెల్లడించారు. ఎక్స్‌ప్లోజివ్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు, ధరల పెరుగుదల తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని మంగళవారం ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు సుమారు రూ. 559 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఎక్స్‌ప్లోజివ్స్ ఎగుమతులపైనా, ఎలక్ట్రానిక్స్ విభాగంపైనా మరింతగా దృష్టి పెడుతున్నామని కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు రూ. 40 కోట్లుగా ఉన్న ఎక్స్‌ప్లోజివ్స్ ఎగుమతులను ఈ ఏడాది రూ. 100 కోట్లకు పెంచుకోనున్నట్లు వివరించారు. సూడాన్, టాంజానియా తదితర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్ విభాగం ఆదాయం సుమారు రూ. 20 కోట్లుగా ఉందని, వచ్చే ఏడాది-ఏడాదిన్నర వ్యవధిలో దీన్ని రూ. 100 కోట్లకు పెంచుకోనున్నామని పంకజ్ కుమార్ పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పెట్టుబడులు .. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పంకజ్ వివరించారు. ఇందులో భాగంగా బళ్లారిలో ఎక్స్‌ప్లోజివ్స్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి రెండో లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో దాదాపు 100 మంది ఉండగా, రాబోయే రెండు-మూడేళ్లలో ఈ సంఖ్యను 300 వరకూ పెంచుకునే అవకాశం ఉందని పంకజ్ చెప్పారు. ముడి సరుకు రేట్ల భారం.. వివిధ కారణాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో ముడి వస్తువుల ధరలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని పంకజ్ తెలిపారు. కొన్నాళ్ల క్రితం 200 డాలర్లుగా ఉన్న టన్ను అమోనియా రేటు ఏకంగా సుమారు 900 డాలర్లకు ఎగిసిందని, ప్రస్తుతం 700 డాలర్ల స్థాయిలో ఉందని పేర్కొన్నారు. తదనుగుణంగా తాము కూడా కొంత మేర ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వచ్చే 3-4 నెలల్లో ముడి వస్తువుల రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందన్నారు. కంపెనీకి హైదరాబాద్‌లో ఉన్న 42.25 ఎకరాల మిగులు స్థలంలో 32 ఎకరాల విక్రయ ప్రక్రియ పూర్తయిందని పంకజ్ తెలిపారు. ఈ డీల్ విలువ రూ. 326 కోట్లు. -
హెచ్‌సీఎల్ టెక్ రికార్డ్- జీవోసీఎల్ జోరు
సరిహద్దు వద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. కాగా.. ఐటీ సర్వీసుల ఆస్ట్రేలియన్ కంపెనీ డీడబ్ల్యూఎస్ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు యూకే అనుబంధ సంస్థ ద్వారా క్వేకర్ హాటన్ కంపెనీలో 2 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు పేర్కొనడంతో లూబ్రికెంట్స్ దిగ్గజం జీవోసీఎల్ కార్పొరేషన్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఐటీ సర్వీసుల ఆస్ట్రేలియన్ కంపెనీ డీడబ్ల్యూఎస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు 15.82 కోట్ల డాలర్లు(రూ. 1160 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తికావచ్చని తెలియజేసింది. ఐటీ, బిజినెస్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సేవల కంపెనీ డీడబ్ల్యూఎస్.. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లలో సర్వీసులను అందిస్తున్నట్లు వివరించింది. తద్వారా ఆయా ప్రాంతాలలో సాఫ్ట్వేర్ సేవల విస్తరణకు వీలు కలగనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ పేర్కొంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 850 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 844 వద్ద ట్రేడవుతోంది. జీవోసీఎల్ కార్పొరేషన్ యూకే అనుబంధ సంస్థ హెచ్జీహెచ్ఎల్ హోల్డింగ్స్ ద్వారా క్వేకర్ హాటన్ కంపెనీలో 2 లక్షల షేర్లను విక్రయించేందుకు నిర్ణయించినట్లు జీవోసీఎల్ కార్పొరేషన్ వెల్లడించింది. క్వేకర్ కెమికల్ కార్పొరేషన్లో 4.27 లక్షల షేర్లను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. షేరుకి 175 డాలర్లలో 2 లక్షల షేర్లను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. తద్వారా రూ. 257 కోట్లు సమకూరగలవని తెలియజేసింది. వీటికి పన్ను వర్తించదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీవోసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 14 శాతంపైగా దూసుకెళ్లి రూ. 210ను తాకింది. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 204 వద్ద ట్రేడవుతోంది. -
జీవోసీఎల్ డివిడెండు 75%
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీవోసీఎల్ కార్పొరేషన్ (గతంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్) సుమారు రూ. 23 కోట్ల ఆదాయంపై రూ. 96 లక్షల నికర లాభం (స్టాండెలోన్) నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం సుమారు రూ. 30 కోట్లు కాగా లాభం రూ. 3 కోట్లు. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 390 కోట్ల నుంచి రూ. 484 కోట్లకు ఎగియగా.. లాభం మాత్రం రూ. 42 కోట్ల నుంచి రూ. 27 కోట్లకు (కన్సాలిడేటెడ్) తగ్గింది. రూ. 2 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 1.50 (75 శాతం) డివిడెండు ప్రకటించింది జీవోసీఎల్. బీఎస్ఈలో సంస్థ షేరు 2.7 శాతం క్షీణతతో రూ. 166.65 వద్ద ముగిసింది.