హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్, బోర్డ్స్, ఎనర్జీ వంటి వ్యాపారాల్లో ఉన్న ఎన్‌సీఎల్ గ్రూప్ 2022 నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో లిస్టెడ్ కంపెనీ అయిన ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ వాటా రూ.2,000 కోట్లుండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ టర్నోవర్ రూ.1,850 కోట్లు నమోదు చేయబోతోంది. ఈ టర్నోవరులో రూ.1,450 కోట్లు ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ సమకూర్చనుందని కంపెనీ ఎండీ కె.రవి వెల్లడించారు. డ్యూరాడోర్ ప్రీమియం డోర్లను శుక్రవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రీఫ్యాబ్ రంగంలోకి రీ–ఎంట్రీ ఇస్తామన్నారు. ప్రీమియం ప్రీఫ్యాబ్ ఉత్పత్తుల తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు రెండు చైనా కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంలో 15 ఏళ్లపాటు ఉన్నామని, పదేళ్ల క్రితం ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నామన్నారు.
భారీ పెట్టుబడి పెడతాం..
బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉందని రవి వెల్లడించారు. ‘కంపెనీ విస్తరణకు గతంలో రూ.300 కోట్లను పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి సమీకరించాం. గడువులోగా ఈ మొత్తాన్ని వారికి చెల్లించాం. బిల్డింగ్ మెటీరియల్స్‌లో కొత్త వ్యాపారానికి సైతం పిరమల్ తలుపు తడతాం. మా గ్రూప్ పట్ల వారికి మంచి అభిప్రాయం ఉంది’ అని వివరించారు. నెల్లూరులో ఏఏసీ బ్లాక్స్ యూనిట్‌ను 2.25 లక్షల క్యూబిక్ మీటర్ల వార్షిక సామర్థ్యంతో రూ.50 కోట్లతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. రెడీ మిక్స్ కాంక్రీట్ కేంద్రాలను కొత్తగా విజయవాడ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. సిమెంటు ధరలు మరోసారి పెరగవచ్చన్నారు. సూర్యాపేట వద్ద ఉన్న సిమెంటు ప్లాంటులో వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్టు రానుంది. దీని ద్వారా ఏటా విద్యుత్ బిల్లు రూ.25 కోట్లు ఆదా అవుతుందని కంపెనీ సీఎఫ్‌వో ప్రసాద్ తెలిపారు.
రూ.15,000 కోట్ల మార్కెట్..
రెడీమేడ్ డోర్స్, విండోస్ మార్కెట్ భారత్‌లో రూ.15,000 కోట్లుందని అంచనా. ఇందులో డోర్స్ వాటా 50 శాతం ఉంటుందని డ్యూరాడోర్ ప్రెసిడెంట్ వివేక్ గూడెన తెలిపారు. డోర్ల ధరలు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉందని వివరించారు. లైఫ్‌టైమ్ వారంటీతో వీటిని విక్రయిస్తున్నట్టు చెప్పారు. ఏజీటీ సాంకేతిక సహకారంతో రూ.50 కోట్లతో చౌటుప్పల్ వద్ద డోర్ల తయారీ ప్లాంటును ఎన్‌సీఎల్ ఏర్పాటు చేసింది.
2022 నాటికి 2,500 కోట్లకు టర్నోవర్
Published Sat, Mar 16 2019 1:26 AM | Last Updated on Sat, Mar 16 2019 1:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment