NCL
-
సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్ఎస్ఈ..
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ క్లియరింగ్ లిమిటెడ్(ఎన్సీఎల్)తో కలసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్ అవాంతర వివాదాన్ని సెటిల్ చేసుకుంది. ఎన్ఎస్ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్సీఎల్ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి. 2021 ఫిబ్రవరి 24న ఎన్ఎస్ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్లైన్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎన్ఎస్ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్తోపాటు సెటిల్మెంట్ బాధ్యతలను ఎన్సీఎల్ నిర్వహిస్తుంది. -
హైదరాబాద్‌లో ఎన్‌సీఎల్‌డోర్ ఎక్స్పీరియన్స్ సెంటర్
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం ఎన్సీఎల్ గ్రూప్‌లో భాగమైన ఎన్‌సీఎల్‌డోర్ తాజాగా హైదరాబాద్‌లో తమ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆవిష్కరించింది. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ చైర్మన్ కమలేష్ గాంధీ శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లు, ఇతరత్రా కొనుగోలుదారులు ఫ్యాక్టరీ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి, తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఎండీ కె. రవి ఈ సందర్భంగా తెలిపారు. సుమారు గంట సేపు అగ్నిని నిరోధించగలిగే ఫైర్–రెసిస్టెంట్ డోర్ సహా నేచురా తదితర నాలుగు సిరీస్‌లకు చెందిన తలుపులు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్టాండర్డ్ సైజులతో పాటు కస్టమరు కోరిన విధంగాను తలుపులను రూపొందించి, అందిస్తున్నామని రవి తెలిపారు. వీటి తయారీ కోసం రోజుకు 1,000 డోర్స్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ తలుపుల ధర రూ. 10,000 నుంచి రూ. 25,000 దాకా ఉంటుందని, అయిదేళ్ల పాటు వ్యారంటీ ఉంటుందని రవి వివరించారు. మరింత తక్కువ ధరల శ్రేణిలో కూడా రెడీమేడ్ డోర్లను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నామన్నారు. క్యూ4లో రూ. 29 కోట్ల లాభం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 29 కోట్ల లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 76 కోట్లు. మరోవైపు, సమీక్షాకాలంలో ఆదాయం రూ. 249 కోట్ల నుంచి రూ. 410 కోట్లకు పెరిగింది. షేర్హోల్డర్లకు ఇప్పటికే చెల్లించిన 30 శాతం మధ్యంతర డివిడెండ్‌కు అదనంగా మరో 10 శాతం (షేరు ఒక్కింటికి రూ. 1) డివిడెండ్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎన్సీఎల్ షేరు 3% పెరిగి దాదాపు రూ. 235 వద్ద ముగిసింది. చదవండి : Zomato: జొమాటో కీలక నిర్ణయం -
ఎన్సీఎల్ బిల్డ్‌టెక్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్సీఎల్ గ్రూప్ కంపెనీ అయిన ఎన్సీఎల్ ఆల్టెక్ అండ్ సెక్కోలార్ పేరును ఎన్సీఎల్ బిల్డ్‌టెక్‌గా మార్చారు. కంపెనీ ప్రస్తుతం సుమారు రూ.100 కోట్లతో విస్తరణ చేపట్టింది. నెల్లూరులో ఏఏసీ బ్లాక్స్ యూనిట్ నిర్మాణంలో ఉందని ఎన్సీఎల్ బిల్డ్‌టెక్ ఎండీ కె.మధు తెలిపారు. జేఎండీ సుబ్బ రాజు, ఈడీ పి.ఆదిత్యతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నెల్లూరు యూనిట్ 2020 మార్చికల్లా సిద్ధం కానుంది. జర్మనీకి చెందిన షూకో సహకారంతో సంగారెడ్డి వద్ద అల్యూమినియం విండోల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇదే జిల్లాలో స్టీల్ డోర్ల తయారీ యూనిట్ కూడా నెలకొల్పుతున్నాం’ అని వివరించారు. సోలార్ వెలుగులు..: విద్యుత్ వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా సోలార్ విద్యుత్‌ను వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. మొత్తం అవసరాల్లో 60–70 శాతం సోలార్ నుంచి సమకూరేలా చూస్తామని మధు చెప్పారు. 2018–19లో కంపెనీ రూ.372 కోట్ల టర్నోవర్‌పై రూ.47 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 700లకు పైమాటే. త్వరలో కొత్తగా 200 మందిని నియమించనున్నారు. -
కాలువ కనుమరుగు!
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పరిధిలోని కోర్ కాలువ కనుమరుగైంది. కాలువపై ఆక్రమణలు వెలియడంతో వరద ఉప్పొంగుతోంది. కాలనీలను ముంచెత్తుతోంది. మరోవైపు డ్రైనేజీ బ్లాక్ అయి, ఎగువ కాలనీల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోనల్ స్థాయిలో అనుమతులు తీసుకొని కాలువను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టడంతో దాదాపు పది కాలనీల్లోని 15వేలకు పైగా జనం ఇబ్బందులు పడుతున్నారు. 9 ఆక్రమణలను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేయడానికి వెళ్లగా... గతంలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగంలో పని చేసిన ఓ ఉద్యోగి వారిని బెదిరింపులకు గురి చేయడంతో వెనుదిరిగారు. సదరు ఉద్యోగి సైతం కాలువపై ఆక్రమ నిర్మాణం చేపట్టడం గమనార్హం. ఇళ్లు ఖాళీ... ఉడ్స్ కాలనీ, యాదిరెడ్డి బండ, పేట్‌బషీరాబాద్, ఎన్సీఎల్ సౌత్, వైష్ణోవ్ ఎన్క్లేవ్, సెయింట్ ఆన్స్ స్కూల్, హర్షా ఆస్పత్రి, దాదాపు వందకు పైగా అపార్ట్మెంట్లకు సంబంధించిన డ్రైనేజీ పైపులైన్ వ్యవస్థ ఎన్సీఎల్ కాలనీ మీదుగా శ్రీనిధి ఎన్క్లేవ్ నుంచి అంగడిపేట, మీనాక్షి, వెన్నెలగడ్డ చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే ఎన్సీఎల్ నుంచి అంగడిపేట వరకు కాలువపై ఆక్రమణలు వెలిశాయి. దీంతో వర్షం నీరు మొత్తం ఎన్సీఎల్ సౌత్ కాలనీని ముంచెత్తుతోంది. బాలాజీ ఆస్పత్రి నుంచి కిందకు వెళ్లే రెండో రోడ్డు కుడివైపు గల్లీలో సుమారు 16 ఇళ్లు ఉన్నాయి. వర్షం పడిన ప్రతిసారీ వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదకు తోడు డ్రైనేజీ ఇళ్లలోకి చేరుతోంది. దుర్వాసన, దోమలవ్యాప్తితో ప్లాట్ నంబర్ 64, 65, 66, 67, 68, 69, 52, 53 యజమానులు అన్నపూర్ణ, గాంధీబాబు, శ్రీహరిరాజు, రంజిత్‌సింగ్, అరవింద్‌గౌడ్, విజయవర్మ, లక్ష్మీదేవి, శ్రీనివాసులు ఏకంగా ఇళ్లు ఖాళీ చేసి అద్దె గదుల్లో ఉండడం గమనార్హం. వరదతో డ్రైనేజీ రోడ్లపైకి చేరడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఆగస్టు 4న అప్పటి గ్రేటర్ కమిషనర్ దానకిషోర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత పర్యటించారు. ఎన్సీఎల్ సౌత్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కాలువపై ఆక్రమణలను తొలగించాలని స్థానిక ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఉపకమిషనర్ మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, టౌన్‌ప్లానింగ్ అధికారి రాజ్‌కుమార్ ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లగా... ఆక్రమణదారులు వారినే బెదిరించారు. నోటీసులు లేకుండా ఎలా కూల్చివేస్తారని? ప్రశ్నించారు. అధికారులు ఓవైపు జేసీబీతో కాలువ మట్టిని తొలగించగా... మరోవైపు పూడ్చడంతో అప్పట్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని విజిలెన్స్ విభాగంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండతో... గతంలో అదే విభాగంలో పనిచేసిన ఓ ఉద్యోగి స్థానిక అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడు. మిగతా ఆక్రమణదారులు కూల్చివేతలకు అంగీకరించినా... ఇతడు మాత్రం అడ్డుకుంటున్నాడు. దీంతో దాదాపు 10 కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు మంజూరైనా.. వరద ఇబ్బందులపై స్థానికులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్ 2016లో కుత్బుల్లాపూర్‌లో పర్యటించారు. వెన్నెలగడ్డ ఎన్నాచెరువు ఎగువ, దిగువ ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా కోర్ కాలువను విస్తరించాలని ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు పనులు జరగలేదు సరికదా.. ఆక్రమణలు వెలిశాయి. ఉడ్స్ కాలనీ నుంచి యాదిరెడ్డి బండ మీదుగా బొల్లారం ఫారెస్ట్ నుంచి వర్షపు నీరు వెన్నెలగడ్డ ఎన్నా చెరువు వరకు చేరుకుంటుంది. అప్పట్లో కోర్ కాలువ ఉండడంతో ఈ వరద సాఫీగా వెళ్లేది. ప్రస్తుతం ఆక్రమణలు చోటుచేసుకోవడంతో వాటిని తొలగించి కోర్ కాలువను యథావిధిగా పునరుద్ధరించాలని ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర 3–5 మీటర్ల మేర వెడల్పుతో కోర్ కాలువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే నీటి పారుదల ప్రాజెక్ట్ అధికారులు నాలా సర్వే చేపట్టి చేతులు దులుపుకోవడంతో ఈ పనులు ముందుకుసాగడం లేదు. దీంతో మంజూరైన నిధులు కాస్త.. వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి ♦ కోర్ కాలువ ఉడ్స్ కాలనీ, యాదిరెడ్డి బండ, పేట్‌బషీరాబాద్, ఎన్సీఎల్ కాలనీ మీదుగా శ్రీనిధి ఎన్క్లేవ్ నుంచి అంగడిపేట, మీనాక్షి, వెన్నెలగడ్డ ఎన్నా చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ♦ ఎన్సీఎల్ నుంచి అంగడిపేట వరకు కాలువపై 9 ఆక్రమ నిర్మాణాలు వెలిశాయి. ♦ ఫలితంగా ఎన్సీఎల్ సౌత్ కాలనీని వరద ముంచెత్తుతోంది. మరోవైపు డ్రైనేజీ బ్లాక్ అవ్వడంతో ఎగువ కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ♦ తరచూ వరద, డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో ఎన్సీఎల్ సౌత్ కాలనీ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ♦ 2016లో మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించి కోర్ కాలువను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టులో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పర్యటించి కాలువపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ♦ అయితే ఆక్రమణల కూల్చివేతలను ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగి అడ్డుకుంటున్నాడు. సదరు ఉద్యోగి సైతం కాలువపై ఓ అక్రమ నిర్మాణం చేపట్టడం గమనార్హం. -
2022 నాటికి 2,500 కోట్లకు టర్నోవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్, బోర్డ్స్, ఎనర్జీ వంటి వ్యాపారాల్లో ఉన్న ఎన్సీఎల్ గ్రూప్ 2022 నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో లిస్టెడ్ కంపెనీ అయిన ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వాటా రూ.2,000 కోట్లుండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ టర్నోవర్ రూ.1,850 కోట్లు నమోదు చేయబోతోంది. ఈ టర్నోవరులో రూ.1,450 కోట్లు ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ సమకూర్చనుందని కంపెనీ ఎండీ కె.రవి వెల్లడించారు. డ్యూరాడోర్ ప్రీమియం డోర్లను శుక్రవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రీఫ్యాబ్ రంగంలోకి రీ–ఎంట్రీ ఇస్తామన్నారు. ప్రీమియం ప్రీఫ్యాబ్ ఉత్పత్తుల తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు రెండు చైనా కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంలో 15 ఏళ్లపాటు ఉన్నామని, పదేళ్ల క్రితం ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నామన్నారు. భారీ పెట్టుబడి పెడతాం.. బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉందని రవి వెల్లడించారు. ‘కంపెనీ విస్తరణకు గతంలో రూ.300 కోట్లను పిరమల్ ఎంటర్ప్రైజెస్ నుంచి సమీకరించాం. గడువులోగా ఈ మొత్తాన్ని వారికి చెల్లించాం. బిల్డింగ్ మెటీరియల్స్‌లో కొత్త వ్యాపారానికి సైతం పిరమల్ తలుపు తడతాం. మా గ్రూప్ పట్ల వారికి మంచి అభిప్రాయం ఉంది’ అని వివరించారు. నెల్లూరులో ఏఏసీ బ్లాక్స్ యూనిట్‌ను 2.25 లక్షల క్యూబిక్ మీటర్ల వార్షిక సామర్థ్యంతో రూ.50 కోట్లతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. రెడీ మిక్స్ కాంక్రీట్ కేంద్రాలను కొత్తగా విజయవాడ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. సిమెంటు ధరలు మరోసారి పెరగవచ్చన్నారు. సూర్యాపేట వద్ద ఉన్న సిమెంటు ప్లాంటులో వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్టు రానుంది. దీని ద్వారా ఏటా విద్యుత్ బిల్లు రూ.25 కోట్లు ఆదా అవుతుందని కంపెనీ సీఎఫ్‌వో ప్రసాద్ తెలిపారు. రూ.15,000 కోట్ల మార్కెట్.. రెడీమేడ్ డోర్స్, విండోస్ మార్కెట్ భారత్‌లో రూ.15,000 కోట్లుందని అంచనా. ఇందులో డోర్స్ వాటా 50 శాతం ఉంటుందని డ్యూరాడోర్ ప్రెసిడెంట్ వివేక్ గూడెన తెలిపారు. డోర్ల ధరలు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉందని వివరించారు. లైఫ్‌టైమ్ వారంటీతో వీటిని విక్రయిస్తున్నట్టు చెప్పారు. ఏజీటీ సాంకేతిక సహకారంతో రూ.50 కోట్లతో చౌటుప్పల్ వద్ద డోర్ల తయారీ ప్లాంటును ఎన్సీఎల్ ఏర్పాటు చేసింది. -
సీడీఆర్ నుంచిబయటపడ్డ ఎన్సీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు రంగ సంస్థ ఎన్సీఎల్ ఎట్టకేలకు కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్యాకేజి పరిధి నుంచి బైటపడింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా పిరమల్ ఎంటర్ప్రైజెస్ నుంచి సమీకరించిన రూ. 325 కోట్ల నిధుల్లో సుమారు రూ. 125 కోట్లను రుణబకాయిల చెల్లింపు కింద బ్యాంకర్లకు ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. మిగతా మొత్తాన్ని సిమెంటు ప్లాంట్ల విస్తరణ కోసం వినియోగించనున్నట్లు ఎన్సీఎల్ వివరించింది. నాగార్జున బ్రాండ్ సిమెంటు తయారీ సంస్థ ఎన్సీఎల్ సుమారు రూ.122 కోట్ల రుణబకాయిలకు సంబంధించి 2013లో సీడీఆర్ మార్గాన్ని ఎంచుకుంది.