సాక్షి, విజయవాడ : నామినేషన్ల ముగింపునకు గడువు దగ్గరపడుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయడంలో తాత్సారం చేస్తున్నారు. సీట్లకోసం ఆశావహులు పట్టుబడుతుండడంతో చివరి నిమిషంలో ఏం చేయాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింటిని బీజేపీకి కేటాయించారు.
మిగిలినవాటిలో టీడీపీ 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. విజయవాడ తూర్పు, నూజివీడు స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పెనమలూరు సీటు బోడే ప్రసాద్‌కు కేటాయించారు. తూర్పు సీటు గద్దె రామ్మోహన్‌కు ఇచ్చారని మంగళవారమే ప్రచారం జరిగినప్పటికీ బీఫారం అందకపోవడంతో ఆయన అభ్యర్థిత్వంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నూజివీడు సీటుకోసం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ముత్తంశెట్టి కృష్ణారావులు నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు.
హరికృష్ణ వస్తారంటూప్రచారం..
సినీనటుడు బాలకృష్ణకు హిందూపురం సీటు కేటాయించడంతో ఆయన సోదరుడు హరికృష్ణకు కృష్ణాజిల్లా నుంచి సీటు కేటాయిస్తారంటూ బుధవారం జోరుగా ప్రచారం జరిగింది. పెనమలూరు సీటు బోడే ప్రసాద్‌కు ఇవ్వడంతో హరికృష్ణకు నూజివీడు, విజయవాడ తూర్పు నియోజవర్గాల్లో ఏదో ఒకటి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకను పార్టీ వర్గాలు ధ్రువీకరించడం లేదు. చంద్రబాబు , హరికృష్ణల మధ్య పొరపొచ్చాలున్న నేపథ్యంలో హరి గురించి మాట్లాడితే చంద్రబాబు ఆగ్రహిస్తారేమోనని నేతలంతా మౌనంగా ఉన్నట్లు తెలిసింది.
ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా గద్దె పోటీ..!
తూర్పు సీటు కేటాయించని పక్షంలో తిరుగుబావుటా ఎగురవేసేందుకు గద్దె రామ్మోహన్ సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమచారం. ఇప్పటివరకు తనకు సీటు కేటాయించకపోవడంతో ఆగ్రహించిన ఆయన బుధవారం చంద్రబాబుతో కాని, పార్టీ ప్రముఖులతో కాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. గురువారం బీ ఫారం రాకపోతే గద్దె స్వయంగా నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.
బుధవారం గద్దె అనూరాధ భర్త రామ్మోహన్ తరఫున విజయవాడ తూర్పు స్థానానికి బీ ఫారం లేకుండానే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సీటు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన ఏకంగా ఎంపీ అభ్యర్థిగానే రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో యలమంచిలి రవి కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
వీడని సస్పెన్స్
Published Thu, Apr 17 2014 3:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement