సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి, రెండు సభల్లో పాల్గొననున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఏయే అంశాలపై మాట్లాడుతారు, ఏ హామీలిస్తారన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ తరఫున బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని, ఎస్సీ వర్గీకరణ అంశానికీ మద్దతు ప్రకటించవచ్చని నేతలు అంటున్నారు. ఈ నెల 7న సాయంత్రం 5.30గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగే బీజేపీ బీసీ గర్జనసభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తే పార్టీ తరఫున సీఎం అయ్యే బీసీ నేత పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న దశలో బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీకి అనుకూలంగా బీసీల మద్దతు కూడగట్టవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఎమ్మార్విఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగల ఆత్మగౌరవసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ జాతీయ, రాష్ట్ర పార్టీలు ఇప్పటికే మద్దతును ప్రకటించిన నేపథ్యంలో.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోపాటు రాష్ట్రంలో ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని మోదీ హామీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.
7న మోదీ షెడ్యూల్ ఇదీ..
ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు యూపీ నుంచి వైమానికదళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియానికి వస్తారు. 5.30 గంటల నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటల సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment