భాషబోయిన అనిల్ కుమార్ : గోదావరి నది ఒడ్డున సింగరేణి కార్మికక్షేత్రం, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు వంటి ధార్మిక క్షేత్రాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలయం. ఉద్యమాలకు, పోరాటాలకు పురిటిగడ్డగా ఉంటూనే సెంటిమెంటుకు ఆలవాలంగా, విలక్షణ తీర్పులకు వేదికగా ప్రసిద్ధికెక్కింది. ఉద్యమాల ఖిల్లా, మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన కరీంనగర్‌లో 2014 నుంచి నేటి వరకు ఇక్కడ బీఆర్‌ఎస్ హవా సాగుతోంది.
అభ్యర్థుల ప్రకటనతో దాదాపుగా నెలరోజులు ముందుగానే అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలంతా ప్రచారం ప్రారంభించారు. ఈసారి కూడా సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని బీఆర్‌ఎస్ ధీమాగా ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత తమను విజయతీరాలకు చేరుస్తుందని నమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ మేరకు గెలుపు వ్యూహాలు రచిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
బీఆర్‌ఎస్.. అభివృద్ధి జపం!
తెలంగాణకు ముందు– తరువాత పరిస్థితులను చూపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రణాళికలను రచిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మునుపెన్నడూలేని భారీ నీటి ప్రాజెక్టు కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన వేల ఎకరాలు, కరీంనగర్‌లో కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, జాతీయ రహదారులు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, దళితబందు, రైతబంధు, రైతుబీమా, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు తమను ఉమ్మడి జిల్లాలో మరోసారి గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు.
2014, 2018లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో 13 అసెంబ్లీ స్థానాలున్న కరీంనగర్ జిల్లా పాత్ర కీలకం. ప్రతిసారీ 12 స్థానాలు గెలుస్తుండగా..పార్టీని వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి గెలవడంతో ఇక్కడ బలం 11 స్థానాలకు చేరింది. అయితే ఈసారి మొత్తం 13 సీట్లూ తన ఖాతాలో వేసుకోవాలని బీఆర్‌ఎస్ పథక రచన చేస్తోంది.
విపక్షాల ప్రచారాస్త్రాలు
♦ తమ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.
♦ ప్రజావ్యతిరేకత, పాలనపై ఉద్యోగుల్లో అసంతృప్తి, యువ ఓటర్లలో సానుకూలత తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది.
♦మైనార్టీ రుణాలు, బీసీబంధు కేటాయింపులో కొన్నిచోట్ల అర్హులకు చోటు దక్కకపోవడాన్ని విపక్షాలు ప్రచారా్రస్తాలుగా చేసుకునే అవకాశం ఉంది.
అధికార పార్టీ ఆయుధాలు..!
♦ సంక్షేమ పథకాలు, దళితబంధు, పైలట్ ప్రాజెక్టులు..
♦ ఉమ్మడి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం, సిరిసిల్లలో ఆక్వా హబ్, కరీంనగర్‌లో మానేరు రివర్
♦ ఫ్రంట్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి, కాళేశ్వరం ప్రాజెక్టు.
♦ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్, స్మార్ట్‌సిటీ నిర్మాణం, కొండగట్టు, వేములవాడ మాస్టర్‌ప్లాన్లు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై తకరారు..!
కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలను కొందరు నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జగిత్యాల, మంథని, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మానకొండూరు, పెద్దపల్లి స్థానాలు తమ ఖాతాలోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ దీమాతో ఉంది.
అయితే పార్టీలో అంతర్గత కలహాలు, ప్రతి స్థానానికీ పదుల సంఖ్యలో ఆశావహులు (అధికారికంగా 85 మంది) పోటీపడటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయా స్థానాల్లో నేతలు ప్రజా ఆశీర్వాద యాత్రలతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇక బీజేపీ విషయంలో సంజయ్, ఈటల రాజేందర్ మినహా మిగిలిన వారి విషయంలో స్పష్టత రాలేదు. వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మానకొండూరులకు అభ్యర్థులు దొరికినా ఇంకా ఖరారు కాలేదు.
కారుకు స్పీడ్‌బ్రేకర్లు ఇవే..!
ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు బలమైన పునాదులు ఉన్నా.. కొన్ని విషయాలు పార్టీని కలవరపెడుతున్నాయి. పెద్దపల్లిలో పార్టీ రెబెల్ నల్ల మనోహర్‌రెడ్డి బరిలోకి దిగితే కారు ఓట్లు చీలే అవకాశముంది. రామగుండంలో రెబెల్ కందుల సంధ్యారాణి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యతిరేక వర్గం పార్టీకి ప్రతికూలంగా తయారయ్యారు. వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు స్థానంలో చెలిమెడ లక్ష్మీ నరసింహారావుకు పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో రమేశ్ ఎంతమేరకు సహకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్‌కు పోటీగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలో దిగితే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఓటమికి బీఆర్‌ఎస్ చెమటోడ్చాల్సి ఉంటుంది. మంథనిలో శ్రీధర్‌బాబును ఓడించడానికి కారు పార్టీ ప్రత్యేక వ్యూహం రూపొందించింది. ఎంపీ బండి సంజయ్ బలమైన నాయకుడు అయినప్పటికీ.. కరీంనగర్‌లో పోటీపై అనాసక్తిగా ఉన్నారని సమాచారం. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్‌కు సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి. చొప్పదండిలో సొంత పార్టీ నేతల అసంతృప్తి కలవరపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment