సాక్షి, హైదరాబాద్: బీజేపీలో సద్దుమణిగిందని అనుకుంటున్న అసంతృప్తి మళ్లీ రాజుకుందా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తుండగా, మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సమయంలో.. కొందరు కీలక నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నేడో, రేపో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ఆయన బాటలో నడవనున్నారని తెలిసింది.
కాంగ్రెస్ సంప్రదింపులతో సుముఖత!
కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమైన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి జాబితాలో తనకు (ఎల్‌బీనగర్), తన భార్య లక్ష్మికి (మునుగోడు) టికెట్లను రాజ్‌గోపాల్‌రెడ్డి ఆశించారు. కానీ నాయకత్వం ప్రకటించిన జాబితాలో ఆ స్థానాలతో పాటు వీరి పేర్లు చోటు చేసుకోలేదు.
రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు మాత్రం రెండు సీట్లలో (హుజూరాబాద్, గజ్వేల్) పోటీకి అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. రాజగోపాల్ కూడా సానుకూలంగా స్పందించారని, బుధవారం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం.
ఇదే బాటలో మరికొందరు!
రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. వీరిలో గతంలో రెండుసార్లు ఎంపీగా ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నేత అసెంబ్లీకి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినా బరిలో నిలవాల్సిందేనని నాయకత్వం ఒత్తిడి తేవడంతో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఈ మాజీ ఎంపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచి కేంద్రమంత్రి కావాలని కోరుకుంటున్నారే తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని ఆయన సన్నిహితుల్లో చర్చ సాగుతోంది. మరోవైపు తనకు పట్టున్న ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన విజయావకాశాలపై సర్వేలు చేయించుకున్న ఆయనకు ఎక్కడా సానుకూల వాతావరణం కన్పించక పోవడంతో పార్టీనే వీడాలనే ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు.
కొంత కాలంగా నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న మరో మహిళా నేత కూడా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరికొందరు సైతం ఎన్నికలకు ముందు బీజేపీని వీడినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇలావుండగా ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండో జాబితా విడుదలలో జాప్యం చేయడం.. బీజేపీ నుంచి వచ్చే నేతల కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.
తొలి జాబితాపై అసంతృప్తే రాజుకుంటోందా?
తొలి జాబితాలో రాజగోపాల్‌రెడ్డితో పాటు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఇతర ముఖ్య నేతలకు టికెట్లను ఖరారు చేయకపోవడం, పార్టీ బలంగా ఉన్న సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన వారికి సీట్లివ్వడం లాంటి అంశాలు బీజేపీ నేతల్లో అసంతృప్తికి కారణమౌతున్నాయి. మొత్తంగా బీసీ వర్గాలకు 19 సీట్లు కేటాయించినా వాటిలో కొన్ని ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి ఉన్నట్టు చెబుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అత్యధిక సీట్లు రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడం, కొంతకాలంగా టికెట్‌ను ఆశిస్తూ ఆయా నియోజకవర్గాల్లో డబ్బు ఖర్చు చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్న నాయకులకు టికెట్ నిరాకరించడం, కనీసం వారిని పిలిచి పరిస్థితిని వివరించి, బుజ్జగించే పరిస్థితి లేకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నట్టు తెలిసింది.
హిందుత్వవాదం బలంగా ఉన్న నిర్మల్ జిల్లాలోని ఓ సీటును పార్టీలో చేరేదాకా ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఒకరికి ఇవ్వడంపై స్థానిక నేతల్లో అంతర్మథనం సాగుతున్నట్టు సమాచారం. ఇక ముధోల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన రమాదేవి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు.
మరోనేత మోహన్‌రావు పాటిల్ కూడా టికెట్ కోరుకున్నా రాలేదు. వరంగల్ (పశ్చిమ) టికెట్‌ను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డికి కాకుండా రావు పద్మకు ఇచ్చినా, కనీసం పిలిపించి మాట్లాడకపోవడంతో ఆయన రెబెల్‌గా పోటీకి సిద్ధమౌతున్నట్టు తెలిసింది.
జనగామ నుంచి జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డికి అవకాశం కల్పించినా, అక్కడ టికెట్ కోరుకున్న బీరప్ప, మరో ఇద్దరు నేతలకు ఈ విషయాన్ని తెలియజేసి బుజ్జగించే ప్రయత్నం చేయపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీకి దింపడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రేపు రెండో జాబితా?
బీజేపీ రెండో జాబితాను గురువారం ఢిల్లీలో జాతీయ నాయకత్వం ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల సమాచారం. ఈ మేరకు 26న జరగనున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థులను ప్రకటించగా..మిగిలిన 67 సీట్లకు ఒకటి లేదా రెండు జాబితాలు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఇలావుండగా తొలి జాబితాలో పార్టీ టికెట్లు దక్కించుకున్నవారు ఈ 28న మంచిరోజు కావడంతో అప్పటి నుంచి ప్రచారం ప్రారంభించాలని నాయకత్వం సూచించింది. ఈలోగా నామినేషన్ దాఖలుకు సంబంధించిన డాక్యుమెంట్లు, అఫిడవిట్లు, ఇతరత్రా సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment