సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు అన్ని నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం ఉందని, పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు తీసుకెళ్లాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికల సమన్వయం కోసం నియమించిన 54 మంది నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిలతో మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఇన్‌చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పదేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతీ ఒక్కరితో మమేకమయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలిచ్చేందుకు వేదికలు మాత్రమేనని, బీఆర్‌ఎస్‌కు మాత్రం తాము చేసిన అభివృద్ధిని వివరించే అద్భుత అవకాశమన్నారు. ఇన్‌చార్జిలు తక్షణమే రంగంలోకి దిగి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
సహకారం అందించండి: హరీశ్
రాబోయే 45 రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని ఇన్‌చార్జిలకు హరీశ్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment