సాక్షి, హైదరాబాద్: ‘ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ పథకాలకు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే రెండు పథకాలు అమలు చేయడం అభినందనీయమేనన్నారు. మిగతా నాలుగు పథకాలు వందరోజుల్లో అమలు చేయాలని చెప్పారు.
ఈ ఆరు పథకాలకు బడ్జెట్‌లో రూ.53,196 కోట్లు కేటాయించారు..రాష్ట్ర ఆర్థిక రాబడి రూ. 2,74,185.7 కోట్లు, ఖర్చు 2,75,890.69 కోట్లుగా బడ్జెట్‌లో అంచనా వేశారు. రాష్ట్ర రాబడులు, అప్పులకు చెల్లించే వడ్డీలు, నెలవారీ చెల్లింపులకు మధ్య పొంతన కుదరడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 300 హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
బీపీఎల్ కుటుంబాలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.26,990 కోట్లు కావాలని, గ్యాస్ సిలిండర్‌కు రూ.2,699.70 కోట్లు, ఉచిత బస్సు పథకానికి రూ.3,600 కోట్లు, కౌలు రైతులకు రూ. 23,160.8 కోట్లు, మన్‌రేగా కింద 32 లక్షల వ్యవసాయ కూలీలు ఉంటారని, వీరికి ఏడాది రూ.3,840 కోట్లు, వరికి రూ. 500 చొప్పున బోనస్ ఇస్తే ఏడాదికి రూ.7500 కోట్లు, పంటరుణాలకు రూ.36 వేల కోట్లు కావాలని చెప్పారు. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఏడాదికి రూ.4800 కోట్లు, అంబేడ్కర్ ఆర్థికచేయూత పథకానికి నిధులెన్నో చెప్పలేదన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక చేయూతకు రూ.25 వేల కోట్లు, యువభరోసా, విద్యాభరోసా కార్డు అమలుకు రూ.38,894.22 కోట్లు, విద్యాజ్యోతి పథకానికి రూ.6,476 కోట్లు.. ఇంకా పింఛన్ల పెంపు ఇతర హామీలకు ఇలా కలిపి మొత్తం రూ.2,15,568.54 కోట్లు కావాలని, ఈ నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు. కొన్నేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ డబ్బులు పెండింగ్‌లో ఉంచారని, దీనివల్ల కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ధరణి స్థానంలో భూమాత తెచ్చేందుకు నియమించిన నిపుణుల కమిటీ ఎప్పటిలోగా నివేదిక ఇస్తుందో చెప్పాలన్నారు.
బడ్జెట్‌లో మైనార్టీలకు కేటాయింపులు నిరాశ పరిచాయని, ముస్లిం మైనార్టీ సంస్థలకు మంజూరైన నిధులు దారి మళ్లడంపై విచారణ జరిపించాలని, రాష్ట్రానికే ఆదాయం తెచ్చి పెడుతున్న హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీకి ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వేసవి తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయని, గోదావరి, కృష్ణా జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదముందని, రంజాన్ మాసం సమీపిస్తున్నందున పాతబస్తీలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బాలూనాయక్
ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సాగు,తాగునీటి ఇబ్బంది కలిగించినందుకు మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూనాయక్ డిమాండ్ చేశారు. అన్ని విభాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించదని, దీనిని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. ఎన్నికల ముందే కేసీఆర్‌కు దళితులు గుర్తుకొస్తారని, అంబేడ్కర్‌కు కనీసం నివాళులు అర్పించని సీఎంగా కేసీఆరే మిగిలిపోతారన్నారు.
ఆరు గ్యారంటీల అమలుకు రూ.2.15 లక్షల కోట్లు కావాలి: అక్బరుద్దీన్
Published Thu, Feb 15 2024 12:53 AM | Last Updated on Thu, Feb 15 2024 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment